Allu Arjun Comments on His Arrest : జైలు నుంచి విడుదలైన తరువాత జూబ్లీహిల్స్‌లోని నివాసానికి చేరుకున్న అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. తనకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తాను చట్టాన్ని గౌరవించే పౌరుణ్ని అని, చట్టానికి కట్టుబడి ఉంటానని అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు. కేసు కోర్టులో ఉన్నందున దాని గురించి మాట్లాడనని అన్నారు.
బాధిత కుటుంబానికి మరోసారి సానుభూతి తెలుపుతున్నానన్నారు. తాను సినిమా చూసేందుకు వెళ్లినప్పుడు అనుకోకుండా ఘటన జరిగిందని మరోసారి స్పష్టం చేశారు. ఆ ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని అన్నారు. 20 ఏళ్లుగా థియేటర్‌కు వెళ్లి సినిమా చూస్తున్నానని, తన సినిమాలే కాకుండా, మామయ్య సినిమాలు కూడా చూశానని తెలిపారు. బాధిత కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిదన్న అల్లు అర్జున్, వారికి అండగా ఉంటామని మరోసారి హామీ ఇచ్చారు.
బాధితురాలు రేవతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని వెల్లడించారు. తనకు బాసటగా నిలిచిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అభిమానం, ప్రేమతో నిలిచిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేసిన అల్లు అర్జున్, తాను బాగున్నానని, ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. తాను న్యాయాన్ని నమ్ముతున్నానని వ్యాఖ్యానించారు.
భావోద్వేగానికి గురైన కుటుంబసభ్యులు: జూబ్లీహిల్స్‌లోని నివాసానికి చేరుకున్న అల్లు అర్జున్‌ని చూసి కుటుంబసభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ఇంటికి చేరుకున్న వెంటనే సతీమణి, పిల్లలను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇంటి వద్ద అభిమానులకు అభివాదం చేశారు.
జైలు నుంచి విడుదలైన అనంతరం తొలుత నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి అల్లు అర్జున్ వెళ్లారు. గీతా ఆర్ట్స్ కార్యాలయంలో అల్లు అర్జున్‌తో న్యాయవాదుల బృందం చర్చలు జరిపారు. అల్లు అర్జున్‌తో 45 నిమిషాలు చర్చించిన న్యాయవాది నిరంజన్‌రెడ్డి, అనంతరం అక్కడ నుంచి వెళ్లిపోయారు. చర్చల తరువాత గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి అల్లు అర్జున్ జూబ్లీహిల్స్‌లోని ఇంటికి వచ్చారు.
ప్రక్రియ ఆలస్యం కావడంతో ఇవాళ విడుదల: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ శుక్రవారం అరెస్టు అయ్యారు. నాంపల్లి కోర్టు అల్లు అర్జున్‌కు 14 రోజులు రిమాండ్ విధించింది. అనంతరం తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. మధ్యంతర బెయిల్ వచ్చినా ప్రక్రియ ఆలస్యం కావడంతో రాత్రంతా జైలులోనే ఉన్నారు. ఇవాళ ఉదయం విడుదలయ్యారు.