Alliance Leaders Election Campaign: రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్‌ను ఓడించడమే లక్ష్యంగా జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి ముందుకు సాగుతోంది. ఇందుకు మూడు పార్టీల నేతలు సహకరించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఆయా చోట్ల కూటమి నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. వైసీపీ రహిత పాలన అందించి రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
Defeat Jagan in 2024 Elections: ఎన్నికలు సమీపిస్తున్నవేళ కూటమి అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాలా యత్నిస్తున్నారు. ఇంటింటికీ ప్రచారం చేస్తూ హామీల జల్లు కురిపిస్తూ, టీడీపీ సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తున్నారు. వైఎస్సార్సీపీ పాలన అంతం కాబోతుందని టీడీపీ అధినేత చంద్రబాబు జోస్యం చెప్పారు. ప్రజలు కోరుకుంటున్న ప్రగతిపూర్వక సంక్షేమ ప్రభుత్వం రాబోతుందని ఆయన ఆకాంక్షించారు. కొవ్వూరు, గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇవాళ జరగబోతున్న ప్రజాగళం సభలకు ప్రభంజనంలా తరలిరావాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు భరోసా ఇద్దామని చంద్రబాబు తెలిపారు.
West Godavari: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో తెలుగుదేశం అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణను గెలిపించాలని ఆయన సతీమణి కృష్ణ తులసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. వైఎస్సార్సీపీ పాలనలో ప్రజలు ఏ విధంగా నష్టపోయారో వివరించారు. కూటమి అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.
ఊపందుకున్న కూటమి ప్రచారం - సీఎం జగన్ ఓటమే లక్ష్యంగా వ్యూహం
Nidadavolu: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో ఎన్డీయో కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మేనిఫెస్టో అంశాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజలతో మమేకమై కలిసి కూటమి గెలుపుకు కృషి చేయాలని అభ్యర్థించారు. వైఎస్సార్సీపీ ఈ ఐదేళ్లలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Guntur: గుంటూరు జిల్లా మంగళగిరిలో తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక నేతలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటువేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పట్టణంలో డ్రైనేజీ కాలువలు నిర్మించి, తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని పెమ్మసాని భరోసా ఇచ్చారు.
"నీటి, రోడ్డు, డ్రైనేజీ సమస్యలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. సమస్యల నిర్ములన కోసం అధికారంలోకి వచ్చిన తరువాత తప్పకుండా కృషి చేస్తాం. పేదవారికి 20వేల పక్కా ఇళ్లు నిర్మాణానికి హామీ ఇచ్చాం. " -పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు ఎంపీ పార్లమెంటు అభ్యర్థి
శ్రీ సత్య సాయి జిల్లా: తెలుగుదేశంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది శ్రీ సత్యసాయి జిల్లా వినుకొండ నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. గురువారం టీడీపీ, జనసేన శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డబ్బు శబ్దాలతో, నృత్యం చేస్తూ టపాసులు కాలుస్తూ జై టీడీపీ జై జనసేన అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. శ్రీసత్యసాయి జిల్లా చందకచెర్లలో మడకశిర ఎమ్మెల్యే అభ్యర్థి సుధాకర్‌ను గెలిపించాలంటూ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కోరారు. పెన్షన్ల పంపిణీలో పేదలు, వృద్ధుల జీవితాలతో ఆడుకోవద్దంటూ పార్టీలకు హితవు పలికారు.
Annamayya: అన్నమయ్య జిల్లా రాజంపేటలో తెలుగుదేశం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. రాజంపేట ఆర్ఎస్ రోడ్డు ప్రధాన రహదారి నుండి ఏబీన్ఆర్ ఫంక్షన్‌హాల్ వరకు బాణాసంచా కాలుస్తూ కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి పూజలు నిర్వహించి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. 2024 ఎన్నికల్లో గెలుపుతో రాజంపేట ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. రాయచోటి జిల్లా కేంద్రానికి దీటుగా రాజంపేట అభివృద్ధి చేసి మెడికల్ కళాశాలను తీసుకొచ్చే బాధ్యత తనదని అన్నారు.
Anantapur: అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో వైసీపీ అభ్యర్థి తన అనుచరులతో టీడీపీలోకి చేరారు. మూడు పార్టీల కలయిక త్రిమూర్తుల కలయికగా ఉందని రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని గుమ్మనూరు అభివర్ణించారు. రాష్ట్రంలో తెలుగుదేశం గెలుపు తధ్యమని అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. అనంతపురం పాతూరులో చౌడేశ్వరి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. వెంకటేశ్వర ప్రసాద్ చేపట్టిన ప్రచారానికి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పాతూరు పరిసర ప్రాంతాల్లో కార్యకర్తలు గజమాలతో ఎమ్మెల్యే అభ్యర్థికి ఘనస్వాగతం పలికారు. టీడీపీ సూపర్ -6 పథకాలను ప్రజలకు వివరించి తనని గెలిపించాలని వెంకటేశ్వర ప్రసాద్ కోరారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అనంతపురంలోని సమస్యలు పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
Anakapalli: రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిన నీచమైన నాయకుడు, గజదొంగ వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో వైఎస్సార్సీపీ నుంచి సుమారు 3 వేల మంది అయ్యన్న, అనిత సమక్షంలో ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరారు. రాష్ట్రం, పిల్లల భవిష్యత్తు కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని అయ్యన్న కోరారు.