Allegations on DSP VNK Chaitanya: తాడిపత్రి పూర్వ డీఎస్పీ, రాజంపేట డీఎస్పీ వీఎన్కే చైతన్య అనంతపురం జిల్లా తాడిపత్రి అరాచక పూర్వ డీఎస్పీ అక్రమాలపై జిల్లా పోలీసు అధికారులు ఏ మాత్రం దృష్టి సారించని వైనం కనిపిస్తోంది. పోలింగ్ అనంతరం రాళ్లదాడి జరిగిన రోజు అర్ధరాత్రి తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో విధ్వంసం సృష్టించిన డీఎస్పీపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు లేకుండా రాజంపేట డీఎస్పీ వీఎన్కే చైతన్య జేసీ కుటుంబంపై కక్ష తీర్చుకునే తరహాలో సీసీ కెమెరాలు పగులగొట్టి తాడిపత్రిలో విధ్వంసం సృష్టించాడు.
ఈ సంఘటన జరిగి నెలరోజులు కావస్తున్నా కనీసం విచారణ కూడా చేపట్టని పరిస్థితి నెలకొంది. చైతన్య గతంలో తాడిపత్రిలో పనిచేస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీకి చెందిన అనేకమంది నాయకులపై కక్ష పూరితంగా వ్యవహరించి అక్రమ కేసులు పెట్టాడు. వైఎస్సార్సీపీ అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్దన్ రెడ్డి ఈనాడు కంట్రిబ్యూటర్పై దాడిచేసిన సంఘటనను డీఎస్పీ చైతన్య నీరుగార్చే కేసుపెట్టి చేతులు దులుపుకొన్నారనే ఆరోపణలున్నాయి. డీఎస్పీ చైతన్య అరాచకాలపై కొత్త ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణ చేయించాలని బాధితులు చేతులెత్తి వేడుకుంటున్నారు.
తాడిపత్రి 30వ వార్డు టీడీపీ కౌన్సిలర్ భూగర్భ మురుగునీటి పైపులైను మరమ్మతులు చేస్తుండగా అప్పటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్దన్ రెడ్డి కౌన్సిలర్ మల్లికార్జునపై దాడిచేశాడు. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న ఈనాడు కంట్రిబ్యూటర్ ఎర్రిస్వామిపై కూడా హర్షవర్దన్ రెడ్డి విచక్షణరహితంగా దాడిచేసి కొట్టాడు. అప్పట్లో ఇద్దరూ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే దాడిచేసిన ఎమ్మెల్యే కుమారుడిని కనీసం స్టేషన్‌కు కూడా పిలిపించకుండా, ఫిర్యాదు చేయడానికి వెళ్లిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కౌన్సిలర్ మల్లికార్జునను డీఎస్పీ చైతన్య స్టేషన్లోనే కొట్టాడని, బూతులు తిట్టాడని అప్పట్లో బాధితుడు ఆరోపించారు.
అరాచకానికి పరాకాష్ఠ.. రాష్ట్రంలోనే అత్యంత వివాదాస్పద అధికారిగా తాడిపత్రి డీఎస్పీ
మల్లికార్జున ఫిర్యాదుపై కేసులు నమోదు చేయకపోవడంతో బాధితుడు కోర్టును ఆశ్రయించి ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. తాడిపత్రి నియోజకవర్గంలో చిన్నపాటి గొడవ ఏది జరిగినా బాధితులైన టీడీపీ కార్యకర్తలు, నాయకులే లక్ష్యంగా రక్తం కళ్లచూసేవరకు కొట్టిన సంఘటనలు అనేకం ఉన్నాయి. యాడికి మండలం కోనుప్పలపాడులో ఓ మహిళపై వైఎస్సార్సీపీ కార్యకర్త అత్యాచార యత్నం చేశాడు. బాధిత మహిళ, ఆమె భర్త అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధిత మహిళను బూతులు తిట్టడమే కాకుండా, ఆమె భర్తను అనేక విధాలుగా అవమానించిన డీఎస్పీ చైతన్య అప్పట్లో తీవ్ర విమర్శలకు గురయ్యారు. ఎస్సీ మహిళపై అత్యాచార ఘటనకు అప్పటి కలెక్టర్ బాధితురాలి జీవనోపాధికి వ్యవసాయ భూమి కేటాయించారు. ఈ భూమిని కూడా వైఎస్సార్సీపీ మూకలు ఆక్రమించుకొని బాధితురాలిపై, ఆమె భర్తపై దాడిచేయగా బాధితుల పక్షాన నిలవాల్సిన చైతన్య, వైఎస్సార్సీపీ నిందితులకు కొమ్ముకాశారని బాధితుడు ఆరోపిస్తున్నాడు.
మరో సంఘటనలో యల్లనూరుకు చెందిన డ్రైవర్ చంద్రశేఖర్ చౌదరిపై వైఎస్సార్సీపీ నాయకుడైన లారీ యజమాని 1.70 లక్షల అప్పు ఉన్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చంద్రశేఖర్ చౌదరి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా డీఎస్పీ చైతన్య అతన్ని తమిళనాడు నుంచి తీసుకొచ్చి ఓ గోదాంలో అక్రమ నిర్బంధం చేసి విచక్షణారహితంగా కొట్టారని ఆరోపణలు వచ్చాయి. బాధితుడు చంద్రశేఖర్ చౌదరి డబ్బు తిరిగి ఇచ్చేలా ప్రామిసరీ నోటు రాసివ్వాలని డీఎస్పీ చైతన్య తీవ్ర ఒత్తిడి చేసి, కొట్టినట్లు విమర్శలు ఎదుర్కొన్నాడు.
బాధితుడికి ఒంటి నిండా గాయాలు కాగా, చంద్రశేఖర్ చౌదరికి విద్యుత్ షాక్ ఇచ్చి హత్యచేశారని డీఎస్పీ చైతన్యపై మీడియాలో పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. తాను హత్యచేయలేదని, నిందితుడే విద్యుత్ ట్రాన్స్ ఫారమ్ వద్ద తీగ పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడని డీఎస్పీ చైతన్య అనంతపురానికి వచ్చి మీడియా సమావేశంలో చెప్పారు. దీనిపై సమగ్రంగా విచారణ చేయాల్సిన అప్పటి జిల్లా ఎస్పీ కూడా వైఎస్సార్సీపీ నాయకుల ఒత్తిడికి తలొగ్గి చైతన్యపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
తాడిపత్రి అప్పటి డీఎస్పీ వీఎన్కే చైతన్య అక్రమాలను టీడీపీ నేతలు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తీవ్రంగా స్పందించిన చంద్రబాబు డీఎస్పీ చైతన్య మూల్యం చెల్లించుకోక తప్పదని అప్పట్లో బాధితులకు హామీ ఇచ్చారు. తాడిపత్రిలో డీఎస్పీ చైతన్య బాధితులంతా ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఒక్కటై వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా పనిచేశారు. ఎన్నికల ప్రచారంలో కూడా డీఎస్పీ అరాచకాలను, వైఎస్సార్సీపీకి కొమ్ముకాసిన వైనాన్ని ప్రజలకు వివరించారు.
మున్సిపల్ ఛైర్మన్‌గా ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి అనేక విధాలుగా ఇబ్బంది పెట్టిన డీఎస్పీ చైతన్య తీరుపై ఆయన మీడియా సమావేశాలు పెట్టి ఎన్ని ఆరోపణలు చేసినా పోలీసు ఉన్నతాధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదు. చైతన్య అక్రమాలపై జేసీ అనేక ఫిర్యాదులు చేసినా ప్రభుత్వం గాని, ఉన్నతాధికారులు గాని ఖాతరు చేయని పరిస్థితులు ఐదేళ్లపాటు నిత్యకృత్యంగా మారాయి. ఇన్ని విధాలా అక్రమాలకు పాల్పడి, ప్రస్తుతం రాజంపేట డీఎస్పీగా పనిచేస్తున్న చైతన్య యూనిఫాం ఉద్యోగానికే పనికిరాడని జేసీ ప్రభాకర్ రెడ్డి అనేక సార్లు మీడియా సమావేశంలో విమర్శలు చేశారు.
పోలింగ్ జరిగిన మరుసటి రోజు తాడిపత్రిలో రాళ్లదాడి జరగడంతో, వివిధ ప్రాంతాల నుంచి పోలీసు అధికారులను తాడిపత్రికి పిలిపించారు. అయితే పై అధికారుల ఆదేశాలు లేకుండానే డీఎస్పీ చైతన్య రాజంపేట నుంచి అర్ధరాత్రి తాడిపత్రి చేరుకొని, స్పెషల్ పార్టీ పోలీసులను వెంట తీసుకెళ్లి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాలు పగులగొట్టి, ఇంట్లోకి చొరబడి విధ్యంసం చేశారు.
జేసీ కార్యాలయంలో పనిచేసే దివ్యాంగుడు కిరణ్‌ను అర్ధరాత్రిలో ఇంటి నుంచి పిలుచుకొచ్చి డీఎస్పీ చైతన్య లాఠీతో తలపగులగొట్టాడు. తాడిపత్రిలో సుమారు రెండున్నరేళ్లు డీఎస్పీగా పనిచేసిన వీఎన్కే చైతన్య అప్పటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి కొమ్ముకాస్తూ ఇసుక దోపిడీ అక్రమార్కులతో చేతులు కలపడమే కాకుండా, టీడీపీ కార్యకర్తలను, నాయకులను రక్తమోడేలా కొట్టాడు.
ఈ తరహాలో విధ్వంసానికి పాల్పడిన డీఎస్పీ చైతన్యపై మే 15వ తేదీ నుంచి ఈటీవీ, ఈనాడులో వరుస కథనాలు వచ్చాయి. దీనిపై జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన గౌతమి సాలి కూడా కనీసం విచారణకు కూడా ఆదేశించలేదు. చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత అయినా తమకు న్యాయం జరుగుతుందని తాడిపత్రిలో డీఎస్పీ చైతన్య చేతిలో ఇబ్బంది పడిన బాధితులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.