AP CID EX Chief Sunil Kumar Irregularities : సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్‌కుమార్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదుపై ప్రభుత్వం విచారణ చేపట్టింది. నెల్లూరు సీఐడీ డీఎస్పీ విజయవాడకు వచ్చి పలువురు నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. సీఐడీ విభాగాధిపతిగా పనిచేసిన సమయంలో సునీల్‌కుమార్ సామాన్య ప్రజల్ని తప్పుడు కేసుల్లో ఇరికించి, కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారని హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ అధికారులకు తెలిపారు.
క్రిమినల్ లాను ఆయుధంగా వినియోగించుకుని పౌరుల్ని వేధించారని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. అరెస్టులు, కస్టడీల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించారన్నారు. చీకటి పడిన తర్వాత బాధితుల ఇళ్లల్లోకి సీఐడీ అధికారుల్ని పంపించారని చెప్పారు. ఏడేళ్ల లోపు శిక్ష పడే సెక్షన్ల కింద నమోదు చేసిన కేసుల్లో కూడా సీఆర్‌పీసీ 41ఏ నోటీసులివ్వకుండానే అరెస్టులు చేసినట్లు సీఐడీ అధికారులకు ఆయన వివరించారు.
విచారణ గదుల్లో అప్పట్లో ఎక్కడా సీసీ కెమెరాలు లేవని ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని లక్ష్మీనారాయణ వివరించారు. కస్టడీలో పాల్పడ్డ హింస గురించి న్యాయమూర్తుల ఎదుట చెబితే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని బాధితులను, వారి కుటుంబ సభ్యుల్ని తీవ్రంగా బెదిరించారన్నారు. సామాజిక మాధ్యమ కేసులు సీఐడీ పరిధిలోకి రావని కానీ వాటిని అడ్డం పెట్టుకుని సునీల్‌కుమార్ ఇష్టానుసారంగా వ్యవహరించారని తెలిపారు.
"వైఎస్సార్సీపీ పాలనలో సీఐడీ చీఫ్‌గా ఉన్న సునీల్‌కుమార్ ఉన్నారు. ఆయన దురాగతాలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశాం. దీనిపై డీమ్డ్ రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్ట్‌ను సీఐడీ అధికారులు ఇచ్చాం. విచారణ అధికారులు మమల్ని విచారించారు. వారికి మాకు తెలిసిన విషయాలను చెప్పాం." - గూడపాటి లక్ష్మీనారాయణ, హైకోర్టు న్యాయవాది
Probe in PV Sunil Kumar : సీఐడీ వ్యవహరించిన తీరు హేయమని మరికొందరు బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు. అర్ధరాత్రిపూట తమ ఇంటి తలుపులు విరగ్గొట్టి మరీ అధికారులు లోపలికి చొరబడ్డారని గార్లపాటి వెంకటేశ్వరరావు సీఐడీకి తెలిపారు. సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు ఇవ్వకుండానే తనను అదుపులోకి తీసుకున్నారని వివరించారు. గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో రాత్రంతా నిర్బంధించి తీవ్రంగా కొట్టారని వాపోయారు. మరుసటి రోజు సాయంత్రం కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.
కస్టడీలో తీవ్రంగా కొట్టిన విషయాన్ని న్యాయమూర్తి ఎదుట చెప్పగా వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాసుపత్రికి పంపించారని గార్లపాటి వెంకటేశ్వరరావు వివరించారు. వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేశానంటూ తనపై కేసు పెట్టి హింసించారన్నారు. అప్పటి సీఐడీ డీఎస్పీ రామారావు, సీఐ జగదీష్, హెచ్‌సీ బాషా, వంశీలు దీనికి కారణమని చెప్పారు. వారందరిపైనా ప్రైవేట్ కేసు వేసినట్లు తెలిపారు. నాటి సీఐడీ విభాగాధిపతి సునీల్‌కుమార్ ఆదేశాల మేరకే చిత్రహింసలు పెట్టారు.
గన్నవరం విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ ఘటనతో సీఎంఓలోని కీలక అధికారికి సంబంధం ఉందంటూ వచ్చిన పోస్టును వాట్సప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేశానని తనను 2022 అక్టోబర్ 13 సాయంత్రం సీఐడీ సిబ్బంది అరెస్ట్ చేశారని టీడీపీ మీడియా సమన్వయకర్త దారపనేని నరేంద్ర సీఐడీకి తెలిపారు. నాటి సీఐడీ ఓఎస్డీ విజయ్‌పాల్, మరో నలుగురు సిబ్బంది తన ఒంటిపైనున్న దుస్తులన్నీ విప్పించారని స్టేట్‌మెంట్ ఇచ్చారు.
కస్టడీలో చిత్రహింసలు : గోడ కుర్చీ వేయించారని ఆ రాత్రంతా అనేక రకాలుగా చిత్రహింసలకు గురిచేసినట్లు సీఐడి ముందు దారపనేని నరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. సీఆర్‌పీసీ 41ఏ నోటీసులివ్వకుండా అరెస్ట్ చేసి 14న కోర్టుకు తీసుకెళ్లారని తెలిపారు. కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి కొట్టిన విషయాన్ని న్యాయమూర్తికి అప్పట్లోనే వివరించగా పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారని చెప్పారు.
విజయవాడలోని తన భార్యతో ఇంట్లో ఉండగా 2022 సెప్టెంబర్ 22న సాయంత్రం 8 గంటల సమయంలో ఏడుగురు వ్యక్తులు మా ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించారని సీనియర్ పాత్రికేయులు కొల్లు అంకబాబు అన్నారు. బలవంతంగా లాక్కెళ్లారని కనీసం చొక్కాఅయినా వేసుకోనివ్వలేదని వాపోయారు. తీవ్రంగా దుర్భాషలాడినట్లు అంకబాబు సీఐడీ అధికారులకు స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఆ రాత్రంతా గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలోనే నిర్బంధించారని వివరించారు.
గన్నవరం విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ ఘటనతో సీఎంఓలోని కీలక అధికారికి సంబంధం ఉందంటూ వచ్చిన పోస్టును వాట్సప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేశానంటూ తనపై కేసు పెట్టి అరెస్టు చేసినట్లు కొల్లు అంకబాబు చెప్పారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సీఆర్‌పీసీ 41ఏనోటీసులు ఇవ్వలేదని సెప్టెంబర్ 23న కోర్టులో హాజరుపరిచారన్నారు. తన అరెస్ట్‌పై ఓ జాతీయ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా వృద్ధ పాత్రికేయుడైతే ఇంట్లో కూర్చొకుండా ఆయనకు సోషల్ మీడియాతో పనేంటని సునీల్ కుమార్ అప్పట్లో తనను ఉద్దేశించి మాట్లాడినట్లు తెలిపారు.
సీఐడీ మాజీ చీఫ్ సునీల్‌కుమార్‌పై బిగుస్తున్న ఉచ్చు
నిబంధనలకు నీళ్లు - 'అగ్ని'లో అవినీతి! - AP CID EX CHIEF SANJAY FRAUDS