Akshaya Patra President on Anna Canteens Arrangements: ఆన్న క్యాంటీన్ల నిర్వహణకు తాము అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు అక్షయ పాత్ర ఫౌండేషన్ తెలుగు రాష్ట్రాల ప్రెసిడెంట్ సత్య గౌర చంద్ర దాస్ తెలిపారు. 15 రూపాయలతో మూడు పూటలా మంచి వంటకాలతో భోజనాన్ని తయారు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం మంగళగిరి, ఏలూరు ప్రాంతాల్లో వంటశాలలు ఉన్నాయని, త్వరలో అనంతపురం, గుడివాడ, ఒంగోలు ప్రాంతాల్లో కిచెన్లు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్న కాంటీన్లు సెప్టెంబర్ చివరి నాటికీ అందుబాటులోకి వస్తాయని వివరించారు. వారంలో ఒక రోజు ప్రత్యేక వంటకం ఉంటుందని సత్య గౌర చంద్ర దాస్ తెలిపారు.
తొలి విడతలో 100 క్యాంటీన్లు: అధికారంలోకి వచ్చాక తిరిగి అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఎన్డీయే ప్రభుత్వం ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకుంటోంది. 203 అన్న క్యాంటీన్లను ఒకేసారి ప్రారంభించాలని మొదట భావించినా భవన నిర్మాణ పనులు పూర్తి కానందున తొలి విడతలో 100 క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు. రెండు, మూడు విడతల్లో మిగిలిన క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు.
గత ప్రభుత్వ హయాంలో నిలిచిన అన్న క్యాంటీన్లు : 2014-19లో టీడీపీ హయాంలో 5 రూపాయలకే పేదలకు భోజనం అందించడానికి ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూసేసింది. క్యాంటీన్ల భవనాలను వార్డు సచివాలయాలకు, మున్సిపల్ కార్యాలయాలకు కేటాయించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే అన్న క్యాంటీన్లు తిరిగి తెరవడానికి ఏర్పాట్లు చేస్తోంది. క్యాంటీన్ల భవనాలకు మరమ్మతులు దాదాపు పూర్తయ్యాయి.
పేదలకు పట్టెడన్నం పెట్టే అన్నం క్యాంటీన్లను చంద్రబాబు ప్రభుత్వం పునరుద్దరించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అన్నా క్యాంటీన్లు ప్రారంభమైతే ఇతర అవసరాల కోసం నగరానికి వచ్చే వారికి తక్కువ ధరకే ఆకలి తీరుతుందని అంటున్నారు. ప్రస్తుతం నగరంలో ఏదైనా పని ఉండి వస్తే బయట టిఫిన్, ఒక పూట భోజనం చేస్తే కనీసం 130 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని ప్రజలు చెబుతున్నారు.