AIYF Chalo CM Camp Office: మెగా డీఎస్సీ కోసం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన దగా డీఎస్సీ వద్దు మెగా డీఎస్సీ ప్రకటించాలని యువజన సంఘాల నాయకులు సీఎం ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. విజయవాడ సీపీ కార్యాలయం నుంచి తాడేపల్లికి బయలుదేరిన ఏఐవైఎఫ్ నాయకులను పోలీసులు అడ్డుకోవటంతో రోడ్డుపై బైఠాయించారు. యువజన నాయకులను అడ్డుకున్న పోలీసులు బలవంతంగా స్టేషన్లకు తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ పోస్టుల సంఖ్య 6 వేల 100 నుంచి 23 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు.
మెగా డీఎస్సీ విడుదల చేయాలని నిరుద్యోగుల ర్యాలీ - ఎమ్మెల్యేను అడ్డుకోవడంతో ఉద్రిక్తత
డీఎస్సీ పోస్టులు పెంచమంటే చేతకాని ప్రభుత్వం పోలీసులతో అరెస్టులు చేయించడం సిగ్గుచేటని ఏఐవైఎఫ్ నాయకులు విమర్శించారు. ప్రతిపక్ష నేతగా రాష్ట్రంలో 23 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్న ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చి ఐదేళ్లు కావస్తున్నా ఆ పోస్టులను భర్తీ చెయ్యలేదని మండిపడ్డారు.
ఇప్పుడు ఎన్నికల ముందు కేవలం 6 వేల 100 పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవడం అన్యామన్నారు. జగన్ ప్రభుత్వం దగా డీఎస్సీని ప్రకటించిందని దాన్ని రద్దు చేసి 23 వేల ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగులు జగన్మోహన్ రెడ్డి సర్కార్‌ని ఇంటికి సాగనంపుతారని ఏఐవైఎఫ్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
హడావుడిగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు: నిరుద్యోగుల ఆందోళన
మరోవైపు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసం వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. సీఎం ఇంటివైపు వెళ్లే మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాహన రాకపోకలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సీఎం ఇంటి ముట్టడికి పిలుపునివ్వడంతో పలువురు ఏఐవైఎఫ్ నాయకులను శనివారం రాత్రే పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు.
పాదయాత్ర సమయంలో 23 వేల పోస్టులు వేస్తామన్నారని, కానీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లకు 6 వేల 100 పోస్టులు వేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట తప్పను, మడప తిప్పను అనే జగన్ వెంటనే డీఎస్సీ విడుదల చేసి మాట నిలబెట్టుకోవాలని అన్నారు. నిరుద్యోగుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ధ్వజమెత్తారు. లేకుంటే వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగులు సీఎం జగన్‌కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
"నాలుగున్నరేళ్లపాటు కాలయాపన చేసి, ఇప్పుడు 6100 పోస్టులు ఇవ్వడం చాలా సిగ్గుచేటు. అధికారంలోకి రాకముందు 23వేల పోస్టులు అన్నారు. అవి ఇప్పుడు ఏం అయ్యాయి. మాట తప్పను, మడమ తిప్పను అన్నావు, ఆ మాటలు ఏం అయ్యాయి. మాకు దగా డీఎస్సీ వద్దు వెంటనే మెగా డీఎస్సీ విడుదల చేయాలి. లేకుంటే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపి, తగిన బుద్ధి చెబుతాం". - ఏఐవైఎఫ్ నాయకుడు
'నాడు మెగా - నేడు దగా' - ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగుల ఆందోళన