CHILAKALURIPETA BYPASS ROAD IN AP: కోల్‌కతా నుంచి చెన్నైకు వెళ్లే జాతీయ రహదారి-16లో చిలకలూరిపేట వద్ద నిర్మించిన ఆరు వరుసల బైపాస్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు ఈ హైవేపై వెళ్లే వాహనాలు చిలకలూరిపేట పట్టణంలోనుంచి వెళ్లాల్సి వచ్చేది. దీనికి ప్రత్యామ్నాయంగా 16.38 కి.మీ. మేర ఆరు వరుసలతో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఈ బైపాస్‌ను నిర్మించింది. దీనిపై రెండు రోజులుగా వాహనాలను అనుమతిస్తున్నారు. వాస్తవానికి గత నెల 29న ప్రధానమంత్రి నరేంద్రమోదీ విశాఖ పర్యటన సందర్భంగా చిలకలూరిపేట బైపాస్‌ను వర్చువల్‌గా ప్రారంభించాల్సి ఉంది. అయితే ఆయన పర్యటన రద్దుకావడంతో బైపాస్ ఆరంభం ఆగిపోయింది. తాజాగా ఎన్‌హెచ్‌ఏఐ ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రాజెక్టు డైరెక్టర్ టి.పార్వతీశం ఈ బైపాస్‌కు కొబ్బరికాయకొట్టి వాహనాలను అనుమతించారు. ఈ బైపాస్ రోడ్ అంచనా విలువ సుమారుగా రూ.907 కోట్లు. అయితే భూసేకరణకు ఖర్చు చేసిన నిధులు కాకుండా సివిల్ పనులకు గానూ రూ.725 కోట్లు ఖర్చు చేశారు.
రాజధాని అమరావతి కలుపుకొంటూ జాతీయ రహదారి-16 నిర్మాణం - National Highway Near By Amaravati
అధునాతన సదుపాయాలతో బైపాస్ రోడ్డు: చిలకలూరిపేట బైపాస్‌లో అనేక అధునాతన సదుపాయాలు కల్పించారు. అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ విధానంలో భాగంగా ప్రతి కి.మీ.కు ఓసీసీ కెమెరా ఏర్పాటు చేశారు.ఈ హైవేలో స్పీడ్ కెమెరాలతోపాటు స్పీడ్ డిస్‌ప్లేలను ఏర్పాటు చేశారు. వాహనం బైపాస్ నుంచి దాటి వెళ్లిన తర్వాత అది ఎంత వేగంతో వెళుతోందో అక్కడ దగ్గర్లో ఉన్న డిస్‌ప్లేలో చూడవచ్చు. గంటకు 100 కి.మీ. వేగంతో వాహనాలు వెళ్లేలా డిజైన్ చేశారు. వాహనాల వేగం కేవలం 80 కి.మీ. కు మాత్రమే అవకాశం ఇస్తారు. బైపాస్‌కు పక్క భాగంలో ఒక మెగావాట్ సామర్థ్యంతో కూడిన సోలార్ పవర్ ప్లాంటును ఏర్పాటు చేశారు. దీనిద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను గ్రిడ్‌కి అనుసంధానం చేశారు. బైపాస్‌లో వినియోగించే లైటింగ్, ఇతర అవసరాలకు ఆ విద్యుత్‌ని వినియోగిస్తారు.
ఏపీలో రహదారులకు త్వరలో మోక్షం- గోతులు పూడ్చటానికి టెండర్లు - National highway widening works