Cyber Fraud Helping Gang Arrested at Hyderabad : సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు, బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న కేటుగాళ్ల ముఠాను తెలంగాణ సైబర్ సెక్యురిటీ బ్యూరో పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ జీడిమెట్ల జగద్గిరిగుట్టకు చెందిన షేక్ సుబానీ, చింతల్ నివాసి నవీన్, ప్రేమ్‌కుమార్‌లను అరెస్ట్ చేసిన సైబర్ క్రైం పోలీసులు వారినుంచి 113 సిమ్ కార్డులు, 3 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.
ఇలా దేశంలోని పలు ముఠాల నుంచి సిమ్ కార్డులు, బ్యాంకు ఖాతాలను దుబాయ్‌లోని విజయ్ అనే కీలక నిందితుడు కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సైబర్ నేరాలకు పాల్పడేందుకు దుబాయ్‌లో చైనీయులు ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌లో విజయ్ పనిచేస్తున్నట్లు గుర్తించారు. భారత్ నుంచి ఒక్క సిమ్ కార్డును రూ.500 కొని చైనీయుల కాల్ సెంటర్‌కు రూ.1,500-3,000 వరకూ విక్రయిస్తునట్లు గుర్తించారు.
ఇండియా టూ దుబాయ్ సిమ్ కార్డులు కొరియర్ : హైదరాబాద్‌కు చెందిన విజయ్ పదో తరగతి వరకు చదివాడు, ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడ సైబర్ నేరాలు చేసేందుకు చైనా దేశస్థులు ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్‌లో చేరాడు. అందులో పనిచేసేందుకు అర్హత లేకపోయినా సిమ్ కార్డులు సమకూర్చడంలో విజయ్ దిట్ట. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్న సిమ్‌కార్డు సరఫరా చేసే ముఠాతో పరిచయం ఏర్పర్చుకున్న విజయ్ అక్కడ నుంచి సిమ్ కార్డులు కొరియర్ ద్వారా దుబాయ్‌కు తెప్పించుకుంటున్నాడు.
దీంతో పాటు సిమ్ కార్డు, బ్యాంకు ఖాతాలు సేల్ అంటూ టెలిగ్రామ్‌లో గ్రూపులు క్రియేట్ చేసిన విజయ్, అతన్ని సంప్రదించిన ఏజెంట్ల నుంచి కూడా అధిక మొత్తంలో సిమ్ కార్డులు కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ సిమ్ కార్డుల ద్వారా కాల్ సెంటర్‌లో ఉన్న ఉద్యోగులు వాట్సప్ అకౌంట్లు తెరిచి వాటి నుంచి భారతీయులపై సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
Cyber Threat For India From Sim Cards : తాజాగా అరెస్ట్ అయిన ముగ్గురు నిందితులు సిమ్ కార్డులను నగరంలోని విజయ్ సోదరుడి వద్దకు చేరవేస్తున్నారు. విజయ్ సోదరుడు వాటిని దుబాయ్‌కు కొరియర్ చేస్తున్నాడు. కాగా విజయ్ ద్వారా చైనీయులు సేకరించిన సిమ్ కార్డులను సైబర్ నేరగాళ్లు దుబాయ్, థాయిలాండ్‌తో పాటు కాంబోడియాలో ఉన్న కాల్ సెంటర్లు కూడా చేరవేస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. దుబాయ్‌లో ఉన్న విజయ్ను అరెస్ట్ చేస్తేనే, కీలక సమాచారం వచ్చే అవకాశం ఉంది.
చైనా హ్యాకర్ల చేతిలో భారత డేటా- మరో 19 దేశాలపైనా సైబర్ దాడి!