Family jumped Godavari River In Basara : అప్పులిచ్చిన వడ్డీ వ్యాపారుల వేధింపులు ఓ చిరు వ్యాపారి కుటుంబాన్ని ఛిదిమేశాయి. ఒత్తిళ్లకు తట్టుకోలేక ఆ కుటుంబం గోదావరి నదిలోకి దూకింది. నిర్మల్ జిల్లా బాసర వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనలో ఆ చిరు వ్యాపారి మృతి చెందగా, ఆయన భార్య సురక్షితంగా బయటపడ్డారు. వారి కుమార్తె గల్లంతయ్యారు.
పోలీసుల వివరాల ప్రకారం : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన ఉప్పలించి వేణు (54) తన భార్య అనురాధ, ఇద్దరు కుమార్తెలతో కలిసి 20 ఏళ్ల కిందట నిజామాబాద్‌కు బతుకుదెరువు కోసం వచ్చారు. న్యాల్‌కల్ రహదారి పక్కన కాలనీలో నివసిస్తూ పాన్ షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా దుకాణం సక్రమంగా నడవట్లేదు. దీంతో కుటుంబపోషణ ఇబ్బందిగా మారింది. దీంతో వడ్డీ వ్యాపారుల వద్ద రూ.3 లక్షల అప్పు తీసుకున్నారు. నెల నెలా వడ్డీ సక్రమంగా చెల్లిస్తున్నారు. కాగా అప్పు తీసుకున్న డబ్బులు ఇవ్వాలని ఇటీవల అప్పులిచ్చిన వారు ఇబ్బందులకు గురి చేశారు.
కొంత సమయం ఇవ్వాలని కోరినా వినకుండా వేధింపులకు గురి చేశారు. తన చిన్న కుమార్తె పూర్ణిమ (25)కు పెళ్లిచూపులు జరిగాయని, అప్పు తీర్చడానికి గడువు ఇవ్వాలని వేడుకున్నా వారు వినలేదు. దీంతో మనస్తాపానికి గురైన వేణు, తన భార్య, కుమార్తెతో కలిసి ద్విచక్రవాహనంపై బుధవారం వేకువజామున బాసరకు వెళ్లారు. అక్కడ గోదావరి వంతెన పైనుంచి నదిలో దూకారు. అనురాధ నీటి ప్రవాహానికి మొదటి స్నానాల ఘాట్ వరకు కొట్టుకొచ్చారు.
స్థానిక గంగపుత్రులు, భక్తులు ఆమెను కాపాడి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ముథోల్ సీఐ మల్లేశ్, బాసర, ముథోల్ ఎస్సైలు గణేశ్, సాయికిరణ్ అనురాధతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం ఆమె భర్త, కుమార్తె కోసం గాలించగా వేణు మృతదేహం లభ్యమైంది. పూర్ణిమ గల్లంతు కావడంతో ఆమె కోసం గాలిస్తున్నారు.
అప్పులిచ్చిన వడ్డీ వ్యాపారుల కోసం బాసర పోలీసులు నిజామాబాద్ వెళ్లగా వారు పారిపోయినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేణు పెద్ద కుమార్తెకు వివాహం కాగా, నాలుగు సంవత్సరాల క్రితం అనారోగ్య సమస్యలతో ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఎంబీఏ చదివిన చిన్న కుమార్తె పూర్ణిమకు పెళ్లి కుదరగా, ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. మరికొన్ని రోజుల్లోనే పెళ్లి జరగాల్సిన ఆ ఇంట్లో విషాదం అలుముకుంది.
ప్రేయసికి ప్రభుత్వ ఉద్యోగం - తనది నిరుద్యోగం - మనస్థాపంతో ఆ యువకుడు ఏం చేశాడంటే?
క్షణికావేశంలో భార్య, భయంతో భర్త ఆత్మహత్య - అనాథలైన ఇద్దరు చిన్నారులు