Student Murder in Guntur District : తొమ్మిదో తరగతి చదివే ఓ అనాథ బాలుడు అనుమానాస్పద స్థితిలో బావిలో శవమై తేలాడు. అయినా ఆ గ్రామస్థుల్లో మానవత్వం కనిపించలేదు. పోలీసులకు విషయం తెలిసినా పట్టించుకోలేదు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుది. తాడికొండ మండలం పొన్నేకల్లులో గత నెల 24న జరిగిన ఈ ఘటన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
మృతుడు షేక్ సమీర్ స్వగ్రామం గుంటూరు జిల్లా అమరావతి మండలం కర్లపూడి. చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో పొన్నేకల్లులోని నాయనమ్మ మస్తాన్‌బీ వద్ద ఉంటున్నాడు. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి (బీ సెక్షన్) చదువుతున్నాడు. ఆ తరగతికే చెందిన ఏ సెక్షన్ విద్యార్థులు పది మంది కొద్ది రోజులుగా ఆ బాలుడితో గొడవపడి కొట్టి భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో అక్టోబర్ 24న షేక్ సమీర్ పాఠశాలకు వెళ్లలేదు. ఆ రోజు మధ్యాహ్నం పాఠశాలలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఆ సమయంలో తొమ్మిదో తరగతి పిల్లలు కొందరు డ్రిల్ చేయకుండా వెళ్లిపోయారు.
ఈ క్రమంలోనే సహచర విద్యార్థులు ఇంటివద్ద ఉన్న సమీర్‌ను తీసుకొని ఈత కొడదామని గ్రామ పొలిమేరలోని బావి వద్దకెళ్లి అతనిపై దాడి చేసి అందులో పడేసినట్లు తెలుస్తోంది. సాయంత్రానికి గ్రామస్థులు, కొందరు ఉపాధ్యాయుల దృష్టికి సమీర్ చనిపోయినట్లు సమాచారం అందింది. వారు అక్కడికి చేరుకుని బావిలో ఉన్న బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. అతడి శరీరంపై రక్త గాయాలు, చొక్కాపై రక్తపు మరకలు ఉండటాన్ని గమనించారు.
Tadikonda Student killed Case : అయితే గ్రామస్థులు పోలీసుల్ని మేనేజ్ చేసి పోస్టుమార్టం లేకుండా మృతదేహాన్ని ఆ రాత్రి కర్లపూడి తరలించారు. అక్కడ బాలుడి మృతదేహంపై గాయాలను చూసిన బంధువులు ఆ గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులతో మాట్లాడారు. బాలుడే ఆధారమైన మస్తాన్‌బీకి ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని కోరారు. ఉపాధ్యాయులు రూ.50 వేలు పోగేసి ఇవ్వాలని చూడగా అందుకు సర్పంచ్ అభ్యంతరం చెప్పారు. మస్తాన్‌బీతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయించారు.
అప్పటికీ విద్యాశాఖ అధికారులు, పోలీసులు ఈ విషయాన్ని బయటకు రానీయలేదు. దీనిని పోలీసులు, విద్యాశాఖ తేలిగ్గా తీసుకోవడం, కేసు నమోదు చేయకపోవడం పట్ల పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై డీఈవో సీవీ రేణుకను వివరణ కోరగా బాలుడి మృతి వాస్తవమేనని చెప్పారు. ఈత రాక బావిలో పడి చనిపోయినట్లు తనకు చెప్పారని పేర్కొన్నారు. ఆ రోజు కొందరు విద్యార్థులు డ్రిల్ సమయంలో బయటకు వెళ్లారని తెలిపారు. ఎందుకు వెళ్లారని ఆరా తీస్తున్నామని చెప్పారు. దీనిపై తెనాలి ఉప విద్యాశాఖ అధికారితో విచారణ చేయిస్తామని అదేవిధంగా పిల్లలు బయటకుపోతే పట్టించుకోని హెచ్‌ఎం, పీఈటీల నుంచి వివరణ కోరతామని డీఈవో సీవీ రేణుక వెల్లడించారు.
కాకినాడలో బీటెక్ విద్యార్థుల ఘర్షణ.. ఇద్దరికి గాయాలు
యూనివర్సిటీ విద్యార్థుల మధ్య చిచ్చు రేపిన పుట్టినరోజు వేడుకలు - బాణసంచా కాల్చడంతో ఘర్షణ