National Games 2025 in Kerala : వృద్ధులంటే ఎవరిపైనో ఒకరిపై ఆధారపడి జీవించాల్సిందే అనుకుంటారు. వారి శరీరంలో శక్తి పూర్తిగా సన్నగిల్లి, నిలబడలేక, కూర్చోలేక ఏ వస్తువునూ పట్టుకోలేక నానా అవస్థలు పడుతుంటారు. కానీ కొందరు తమ ప్రతిభకు వయస్సు అడ్డుకాదని నిరూపిస్తుంటారు. సాధించాలనే పట్టుదల, నిబద్ధతే దానికి కారణం. తాజాగా ఆ బామ్మ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు కేరళకు వెళ్లింది. కానీ తీరా అక్కడికి వెళ్లాకు కుమారుడికి గుండెపోటని సమాచారం వచ్చింది.
ఈ పరిస్థితుల్లో ఎవరైనా వెనక్కు వచ్చేస్తారు. కానీ ఆ బామ్మ మాత్రం ఆ బాధను దిగమింగుకుని పోటీదారులతో హోరాహోరీగా తలపడి పతకాలు సాధించింది. ఎనిమిది పదుల వయస్సులోనూ పోటీపడి గెలిచి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విజయంతో ఆమె ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా చోడవరం శివారు అంకుపాలెంకు చెందిన ముత్యం లక్ష్మి (86) గత నెలలో అనకాపల్లి, గుంటూరులో జరిగిన జిల్లా, రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్-2025 పోటీల్లో రాణించారు.
Anakapalli Old Woman Won Medals : దీంతో ఆమె జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకు జరిగిన ఆ పోటీల్లో పాల్గొనేందుకు స్థానికుల ఆర్థిక సాయంతో గత నెల 29న కేరళ బయల్దేరి వెళ్లారు. పోటీలు ప్రారంభమైన రోజే లక్ష్మి రెండో కుమారుడు గుండెపోటుతో ఆసుపత్రి పాలయ్యాడు. కుటుంబసభ్యులు ఈ విషయం తల్లికి చెప్పి తిరిగొచ్చేందుకు విమాన టికెట్లు బుక్ చేస్తామని చెప్పారు. ఈ వయసులో విమాన ప్రయాణం వద్దని వైద్యులు సూచించడంతో ఆమె విరమించుకున్నారు.
కుమారుడి ఆరోగ్య పరిస్థితిని మనసులోనే ఉంచుకుని పోటీల్లో పాల్గొన్న లక్ష్మి షాట్‌పుట్‌లో రజతం సాధించారు. ఒకటి, రెండో తేదీల్లో జరిగిన జావెలిన్‌త్రో, డిస్కస్‌త్రో పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి రెండు బంగారు పతకాలు అందుకున్నారు. రిజర్వేషన్ దొరక్క రెండు రోజులు అక్కడే ఉండిపోయిన లక్ష్మి గురువారం బయలుదేరి శుక్రవారం విశాఖపట్నం చేరుకున్నారు. నేరుగా కేజీహెచ్‌కు వెళ్లి కోలుకుంటున్న బిడ్డను చూసి కన్నీటి పర్యంతమయ్యారు.
69 ఏళ్ల వయసులో డిగ్రీ పట్టా - ఎంఏ అడ్మిషన్‌కు సిద్ధం
మనసుకు వయస్సు లేదంటున్న బామ్మ - 80 ఏళ్ల వయసులోనూ విభిన్న ప్రతిభ - 80 years Old Grandma Huge Talent