80 years Old Grandma who Inspires Everyone with her Diverse Skills : చక్కగా బొమ్మలు గీస్తారు. వ్యర్థాలతో హ్యాండ్ క్రాఫ్ట్స్ తయారు చేస్తారు. పాటలు పాడతారు, కవితలు, కథలూ రాస్తారు. పిల్లలకు పాఠాలూ బోధిస్తారు. ఇవన్నీ చేస్తున్నది 80 ఏళ్ల బామ్మ అంటే నమ్మగలరా? వయసు శరీరానికే కానీ మనసుకు కాదు అని నిరూపిస్తున్న రాజకుమారి స్ఫూర్తిగాథను ఈ కథనంలో తెలుసుకుందామా.
80 ఏళ్ల వయసులోనూ స్ఫూర్తి : అందరికి స్ఫూర్తి నింపుతున్న బామ్మ ఆర్యపాటి గోపాల రాజకుమారి ఒంగోలులోని కాకతీయ వృద్ధాశ్రమంలో తొమ్మిదేళ్లుగా ఆశ్రయం పొందుతున్నారు. కష్టాలు వెంటాడినా, సవాళ్లు ఎదురైనా, వయసు మీద పడుతున్నా అవేవీ తన అభిరుచికి అవరోధం కాదని నిరూపిస్తున్నారు. ఎనిమిది పదుల వయసులోనూ కళలు, సాహిత్యంతో సావాసం చేస్తున్నారు. వ్యర్థాలతో హ్యాండ్ క్రాఫ్ట్స్ తయారుచేస్తారు. ఎక్కడ పోటీలు జరిగినా పాల్గొంటారు. పత్రికలకు కథలు, కవితలు రాస్తూ అభిరుచిని చాటుకుంటున్నారు. ఆమె చలాకీతనానికి, జీవన శైలికి ఎవరైనా ఫిదా కావాల్సిందే.
"నేను ఏ స్కూల్లో అయితే చదివానో అక్కడే బీఈడీ ట్త్రైనింగ్ చేశాను. అక్కడే ఉద్యోగం కూడా చేశాను. 37 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా సేవలందించాను. నాకు ఆర్ట్స్ , పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. వీటికి సంబంధించి ఎక్కడ కార్యక్రమాలు జరిగిన పాల్గొంటాను. అలాగే ఆర్టికల్స్, కవితలు రాస్తాను. కర్నూలు జిల్లాలో పనిచేసేటప్పుడు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నాకు అవార్డు వచ్చింది. ఆ అవార్డు కూడా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడి చేతుల మీదుగా తీసుకోవటం చాలా ఆనందంగా ఉంది. మనసుకు వయసు లేదు. కేవలం శరీర భాగాలకే మాత్రమే వయసు ఉంటుంది. అందుకే నాకు ఎప్పుడు ఒంటరిగా ఉన్నాననే భావన రాలేదు." - రాజకుమారి, విశ్రాంత ఉపాధ్యాయురాలు
ఒంటరిగా ఉన్నాననే భావన లేదు : రాజకుమారిది కర్నూలు జిల్లా బనగానపల్లె. 37 ఏళ్లు ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో బెస్ట్ టీచర్‌గా కూడా అవార్డు తీసుకున్నారు. ఒంటరిగా ఉన్నాననే భావన ఆమెలో లేదు. ఇప్పటికీ క్షణం తీరిక లేకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఆధ్యాత్మిక విషయాలను బోధిస్తూ సహచరుల్లో స్ఫూర్తి నింపుతున్నారు.