73 Indian Pharmaceutical Congress 2024 : గతేడాది మన దేశం 1.83 కోట్ల రూపాయల విలువైన ఫార్మాసూటికల్ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. 150కి పైగా దేశాలకు భారత్ నుంచే ఫార్మా ఎగుమతులు జరుగుతున్నాయి. వీటిలో ఒక్క తెలంగాణ నుంచే 35 శాతం ఉన్నాయి. కరోనా మహమ్మారి విజృంభన వేళ భారత్ బయోటెక్ నుంచి ఉత్పత్తైన కోవాగ్జిన్ సహా క్యాన్సర్, హెచ్ఐవీ లాంటి ఎన్నో వ్యాధులకు మన రాష్ట్రం నుంచి ఔషధాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫార్మా రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇండియన్ ఫార్మాసూటికల్ కాంగ్రెస్ వేదికగా మారింది.
విజయవంతంగా ముగిసిన ఫార్మా కాంగ్రెస్ ఎక్స్ఫో : దేశంలో ఇప్పటివరకు 72 సదస్సులను ఏటా నిర్వహిస్తూ వచ్చిన ఐపీసీ హైదరాబాద్‌లో ఆరోసారి దిగ్విజయంగా నిర్వహించింది. హైదరాబాద్ హైటెక్స్‌లో ఈ నెల 5న ప్రారంభమైన 73వ ఇండియన్ ఫార్మాసూటికల్ కాంగ్రెస్ ఎక్స్‌పో ఏడో తారీఖున ముగిసింది. 3 రోజుల పాటు జరిగిన సదస్సులో అంతర్జాతీయ ప్రతినిధులు, ఫార్మా శాస్త్రవేత్తలు, వేల మంది విద్యార్థులు ఇలా మొత్తం 12 వేల మందికి పైగా భాగస్వాములయ్యారు. దేశానికే కాకుండా ప్రపంచానికి కావాల్సిన ఔషధ ఉత్పత్తులను అందించడమే లక్ష్యంగా వీరంతా చర్చలు జరిపారు. పలు శాస్త్రవేత్తలు, పరిశ్రమల మధ్య అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
సదస్సులో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి భట్టి : ఈ సదస్సు ప్రారంభోత్సవంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫార్మారంగ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున పూర్తి సహాయసహకారాలు అందిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. ఇక చివరిరోజు సదస్సుకు ఐపీసీఏ ఛైర్మన్ పార్థసారథిరెడ్డితో పాటు ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు.
రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు : ఈ సదస్సు ద్వారా దాదాపు 2 వేల మంది విద్యార్థులకు వివిధ కంపెనీల నుంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పార్థసారథిరెడ్డి వెల్లడించారు. త్వరలో భారత్ 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనేదే తమ లక్ష్యమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి జనఔషధి కేంద్రాల ద్వారా ప్రజలకు 50 నుంచి 90 శాతం వరకు తక్కువ ధరలకు మందులు అందిస్తున్నామన్నారు.
Kishan Reddy On Pharma University : ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఇప్పటివరకు దేశంలో లేని ఫార్మాసూటికల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తానని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ప్రత్యేకించి హైదరాబాద్ ప్రాంతానికి యూనివర్సిటీని తెచ్చేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని అన్నారు. పారిశ్రామిక రంగం అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న ఫార్మాసూటికల్ రంగానికి ప్రధాని మోదీ తరఫున పూర్తి సహాయసహకారాలు ఉంటాయని కిషన్‌రెడ్డి చెప్పారు.
ఇదివరకు ఔషధాలను చైనా నుంచి దిగుమతి చేసుకున్న దేశాలు సైతం నేడు భారత్ వైపే మొగ్గు చూపుతున్నాయి. దీనివల్ల రాబోయే కొన్నేళ్లలో ఫార్మా రంగం మరింత వృద్ధి చేందే అవకాశం ఉంది. దీనివల్ల భారత ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించడంతో పాటు ఇక్కడి శాస్త్రవేత్తలకు, పరిశోధకులకు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి.