Missing Telangana Student Found in America : అమెరికాలో భారతీయ విద్యార్థులు వరుసగా ప్రమాదాలకు గురవడం తీవ్ర కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఉన్నత విద్య కోసమని వెళ్లిన తెలుగు విద్యార్థులు మిస్సింగ్ అవ్వడం గందరగోళానికి గురి చేస్తోంది. అసలు అగ్రదేశంలో ఏం జరుగుతోందని అందరి మదిని తొలచివేస్తోంది. అక్కడికి చదువుకోవడానికి వెళ్లాలంటే తెలుగు విద్యార్థులు భయపడేలా పరిస్థితులు నెలకొన్నాయి.
గత నెల 28న తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన నితీశ కందుల కనిపించకుండా పోయింది. అయితే ఎట్టకేలకు ఆ విద్యార్థిని ఆచూకీ మంగళవారం లభ్యమైంది. లాస్ఏంజెల్స్లో అదృశ్యమైన నితీశ ఆచూకీ కనుగొన్నామని, ఆమె క్షేమంగానే ఉన్నట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అయితే యువతి అదృశ్యానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. తమ కుమార్తె కనిపించడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే నితీశ అదృశ్యం వెనుక కారణాలు తెలియాల్సి ఉంది.
అసలేం జరిగింది : నిజామాబాద్‌కు చెందిన నితీశ కందుల కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ, శాన్ బెర్నార్డినోలో ఎంఎస్ చదువుతోంది. ఆమె గత నెల 28 నుంచి కనిపించకుండా పోయింది. చివరిసారిగా ఆమె లాస్ఏంజిల్స్లో కనిపించినట్లు యూనివర్సిటీ ఎక్స్‌లో పోస్టు చేసింది. మళ్లీ ఆ తర్వాత ఆమె ఆచూకీ లభించలేదు. దీనిపై స్థానిక పోలీసులకు అక్కడి వారు ఫిర్యాదు చేయగా, వారు గాలింపు మొదలు పెట్టారు. చివరికి దాదాపు వారం రోజుల తర్వాత లాస్ ఏంజెల్స్‌లో అదృశ్యమైన ఆమె ఆచూకీ లభించింది. ఆ యువతిని గుర్తించడంలో స్థానికులు ఎంతో సహకారం అందించారని పోలీసులు తెలిపారు.
అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు, మిస్సింగ్‌లు : గన్‌కల్చర్‌కు అలవాటు పడిన అగ్రరాజ్యంలో ఇప్పుడు భారతీయ విద్యార్థులు చదువుకోవాలంటే భయపడుతున్నారు. ఒకప్పుడు ఉన్నత చదువుల కోసం అమెరికా స్టేట్స్కు వెళ్లాలని చాలామంది కలలు కనేవారు కానీ అక్కడి భారతీయుల మరణాలు, మిస్సింగ్ కేసులు చూసి వెనుకంజ వేస్తున్నారు. ఈ మధ్యకాలం అమెరికాలో ఎక్కువగా భారతీయ విద్యార్థులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ నెలలోనే తెలంగాణకు చెందిన రూపేశ్ చంద్ర షికాగోలో అదృశ్యమయ్యారు. అలాగే మార్చి నెలలో హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ అరాఫత్ మృతి చెందాడు. మరో విద్యార్థి సయ్యద్ మజాహిర్ అలీపై కూడా గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఇలా భారతీయ విద్యార్థులను చాలా మంది అమెరికా పొట్టన పెట్టుకుంది.
అమెరికాలో రోడ్డు ప్రమాదం - తెలంగాణ విద్యార్థిని మృతి - Telangana Student Died in America