10 Rupee Coin Problems : నన్ను గుర్తుపట్టారా? నేను మీ పది రూపాయల నాణేన్ని. నన్ను చూసి చాలా రోజులైంది కదా! మీ కోసం నేను అందంగా తయారయ్యి వస్తే మీరు మాత్రం నన్ను పట్టించుకోవడంలేదు. ఎన్నో ఆశలతో అందరి అవసరాలకు ఉపయోగపడతానని భారతీయ రిజర్వు బ్యాంకు నన్ను మీ చెంతకు తీసుకొచ్చింది. కానీ నన్ను మీరు చెల్లదంటూ పుకార్లు పుట్టించి అందరికీ దూరం అయ్యేలా చేశారు.
నన్ను దూరం చేయకండి : తొలిసారిగా నేను మీ చేతుల్లోకి వచ్చినప్పుడు ఆసక్తిగా చూశారు కదా. పిల్లలు, పెద్దలు, వృద్ధులు చిన్నపాటి అవసరాలకు నన్ను ఉపయోగించుకున్నారు. తల్లితో కలిసి వీధి దాటుతున్న ఐదేళ్ల పిల్లవాడు తన జేబులోంచి నన్ను తీసి వీధిలో ఆకలితో ఉన్న బిచ్చగాడికి ఇచ్చాడు. ఆయన నన్ను ఉపయోగించి టీ దుకాణం నుంచి రొట్టె కొన్నాడు. ఆకలితో ఉన్న బిచ్చగాడు రొట్టెని ఎలా తిన్నాడో నేను చూశాను. దీంతో నేను చాలా సంతోషించాను. ఇలా నేను ఎందరో కష్టాలు తీరుస్తానని వచ్చాను. కానీ మీరు మాత్రం నేను చెల్లడంలేదని, నకిలీ నాణేలు పుట్టాయంటూ వదంతులు సృష్టించారు. అప్పటి నుంచి మీరందరూ నన్ను దూరం చేస్తూ వచ్చారు. దీంతో ఎవరి అవసరాలను తీర్చలేకపోతున్నాని భాదతో కుంగిపోయాను.
చిరు వ్యాపారులు, కొనుగోలుదారులు విలువ లేని నాణెంగా నన్ను మూలన పడేశారు. దీంతో ప్రభుత్వమే రంగంలోకి దిగి నాకు విలువ ఉందంటూ ప్రకటన చేసింది. అయినా మీరు నన్ను బయటకు తీయడం లేదు. దేశంలో ఎవరైనా సరే నేను చెల్లదని చెబితే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇకనైనా ఆలోచించి నన్ను వినియోగంలోకి తీసుకొచ్చి అందరికీ ఉపయోగపడే అవకాశం కల్పించండి. పది మంది చేతుల్లో మారి వాల్ల అవసరాలను తీరిస్తేనే కదా నాకు ఆనందంగా ఉంటుంది.
వద్దంటే చట్ట ఉల్లంఘన : ఆర్‌బీఐ పది రూపాయల నాణేలు నిషేధించిందని, నకిలీవి పుట్టుకొచ్చాయని వచ్చిన వదంతులను నమ్మకూడదు. వాటిని వస్తు క్రయవిక్రయాలు, బ్యాంకు ఖాతాల్లోనూ డిపాజిట్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే నాణేలను స్వీకరించకపోతే 2011 సెక్షన్ 61 ప్రకారం చట్ట ఉల్లంఘన కింద పరిగణిస్తారు. భారతీయ రిజర్వు బ్యాంకు 2005 నుంచి 2019 మధ్య కాలంలో పది రూపాయల నాణేలను అందుబాటులోకి తెచ్చింది. వివిధ రూపాల్లో ఇవి ప్రజల్లోకి చేరాయి. ఆర్‌బీఐ నిబంధనల మేరకు రూ.10 నాణేలు చెల్లుబాటు అవుతాయని వీటిని ఎవరూ తిరస్కరించొద్దని సుబేదారి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. నాణేలు తీసుకోవడం లేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
హాబీతో ప్రత్యేకత చాటుకున్న యువకుడు - నాణేల సేకరణతో అంతర్జాతీయ రికార్డులు - RAVITEJA COINS COLLECTIN
ఆ పది రూపాయలు వద్దంటే మూడేళ్లు జైలుకే!- ఆర్‌బీఐ తాజా ప్రకటన ఇదే - Indian currency coins