10 Month Old Baby Swallowed Battery in Srikalahasti : చిన్నపిల్లలు చేతికి అందిన దాన్ని తీసుకుని నోట్లో పెట్టుకుంటారు. ప్రమాదవశాత్తు కొన్నింటిని మింగుంతుంటారు. వాటి వల్ల చిన్నారులు ఎంతగానో ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో అయితే ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు ఆడుకునేప్పుడు వారిని కనిపెట్టుకుని ఉండాలని సూచిస్తున్నారు. పది నెలల బాలుడు ఇంట్లోని గుండ్రటి బ్యాటరీని మింగాడు. ఈ ఘటన శ్రీకాళహస్తిలో జరిగింది.
బాలుడు బ్యాటరీ మింగినట్లు గమనించిన తల్లిదండ్రులు అతడ్ని తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం వైద్యులు దీన్ని తొలగించారు. ముందుగా సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం వైద్యులు ఎక్స్‌రేలో బాలుడు మింగిన బ్యాటరీని పరిశీలించారు. అనంతరం ఎండోస్కోపీ ద్వారా దాన్ని బయటకు తీశారు. బాలుడు కోలుకోవడంతో మంగళవారం డిశ్చార్జి చేశారు. ఇటువంటి వాటిని ఆలస్యం చేస్తే ప్రాణాపాయం ఎదురయ్యే అవకాశం ఉంటుందని డా.శివరామకృష్ణ, డా.వెంకట్రామిరెడ్డి తెలిపారు.
ఇటీవల బిహార్‌కు చెందిన ఓ ఏడాది బాలుడు మూడు అడుగుల పామును బొమ్మ అనుకుని చక్కగా ఆడుకున్నాడు. అదే సమయంలో పామును మధ్య భాగంలో కొరికి నమిలాడు. చిన్నారి నోటిలో నుంచి పాము బయటకు తీసి కిందపడేసింది తల్లి. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్యులు చిన్నారికి అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు చేశారు. బాలుడు సురక్షితంగానే ఉన్నట్లు తల్లికి తెలిపారు.
అయితే పాము మాత్రం చనిపోయింది. పిల్లవాడు నమిలిన పాము విషపూరితమైనది కాదని వైద్యులు చెప్పారు. అందుకే చిన్నారి ప్రాణానికి ఎలాంటి అపాయం కలగలేదని వెల్లడించారు. దీంతో పిల్లవాడి కుటుంబసభ్యులు అంతా ఊపిరి పీల్చుకున్నారు! చిన్నారి పామును నమిలిన విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున గ్రామస్థులు బాలుడి ఇంటి వద్దకు చేరుకున్నారు. పామును చూసి ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు భయపడిపోతున్నారు. పాము విషపూరితం కాకపోవడం వల్ల పర్లేదని, లేకుంటే పెద్ద విషాదానికి దారితీసేదని వాపోతున్నారు. అది తేలియా జాతికి చెందిన పాముగా చెబుతున్నారు. వానపాములా అనిపిస్తుందని అంటున్నారు.