Central Sahitya Akademi Award to Writer Penugonda Lakshminarayana : ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. ‘దీపిక అభ్యుదయ వ్యాస సంపుటి’కిగాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. పెనుగొండ లక్ష్మీనారాయణ గుంటూరులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. 1972 నుంచి అభ్యుదయ రచయితల సంఘం కార్యకర్తగా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు బాధ్యతలు నిర్వహించి, 2023లో జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి తెలుగు సాహితీవేత్తగా గుర్తింపు పొందారు. 1972లో సమిధ అనే కవితతో తన సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
సాహిత్య అకాడమీ దేశ వ్యాప్తంగా 21 భాషలకుగాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను బుధవారం ప్రకటించింది. వీటిలో ఎనిమిది కవితలు, మూడు నవలలు, రెండు లఘు కథలు, మూడు వ్యాస సంపుటిలు, మూడు సాహిత్య విమర్శకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. నాటక, పరిశోధన అంశాలకు సంబంధించి ఒక్కో పుస్తకం ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికయ్యాయి. బెంగాలీ, ఉర్దూ, డోగ్రి భాషలకు తర్వాతి దశలో అవార్డులు ప్రకటించనున్నారు.
మొత్తం 21 భారతీయ భాషల్లో సాహిత్య రంగంలో సుప్రసిద్ధమైన వ్యక్తులు జ్యూరీ మెంబర్లుగా వ్యవహరించారు. వారు పలు పుస్తకాలను ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు సిఫారసు చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్ అధ్యక్షతన సాహిత్య అకాడమీ ఎగ్జిక్యూటివ్ బోర్డు బుధవారం సమావేశమైంది. ఈ పురస్కారానికి ఎంపికైన పుస్తకాల పేర్లను ప్రకటించింది.
విజేతలకు వచ్చే ఏడాది మార్చి 8న దిల్లీలో పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డు కింద రూ.లక్ష నగదుతో పాటు శాలువాతో సన్మానిస్తారు. తెలుగు భాషకు సంబంధించి ప్రొఫెసర్ రాచపాలెం చంద్రశేఖరరెడ్డి, కె.శ్రీనివాస్, జేఎస్ మూర్తి (విహారి) జ్యూరీలుగా వ్యవహరించారు. తెలుగు నుంచి మొత్తం 14 పుస్తకాలను జ్యూరీ సిఫారసు చేయగా పెనుగొండ లక్ష్మీనారాయణ రచించిన ‘దీపిక’ అభ్యుదయ సాహిత్య వ్యాస సంపుటి ఈ అవార్డుకు ఎంపికైంది.
జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీగా 'ముప్పాళ్ల' - రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం