T20 Worldcup 2024 Super 8 Teamindia VS Afghanisthan : టీ20 వరల్డ్ కప్ 2024లో గ్రూప్ దశను విజయవంతంగా పూర్తి చేసింది టీమిండియా. ఇక ఇప్పుడు సూపర్-8 మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమై అఫ్గానిస్థాన్‌తో గురువారం తొలి మ్యాచ్ ఆడనుంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో టీమిండియా బలమైన జట్టే అయినప్పటికీ అఫ్గానిస్థాన్‌ను ఆషామాషీగా తీసుకోవడానికి లేదు. ఇటీవల జరిగిన కివీస్‌తో మ్యాచ్‌లో 84పరుగుల తేడాతో విజయం సాధించింది. బౌలర్లతో పాటు బ్యాటర్లు కూడా బాగా రాణిస్తుండటంతో ఆ జట్టు ప్రమాదకరంగానే కనిపిస్తుంది. గ్రూప్ దశలో అసాధారణ విజయాలు నమోదు చేసిన అఫ్గాన్ జట్టు పేరుకు చిన్న జట్టే అయినా పోరాటంలో ధీటుగా నిలుస్తుంది.
తక్కువ అంచనా వేయొద్దు - బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ధీటుగా రాణిస్తున్న అఫ్గానిస్థాన్‌లో ప్రతిభావంతులకు లోటు లేదు. బ్యాటింగ్‌లో గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, నైబ్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. మంచి ఫామ్‌తో దూసుకెళ్తున్న నైబ్ చక్కటి ఇన్నింగ్స్ కనబరుస్తున్నాడు. ఇక బౌలర్లు ఫారూఖీ, నవీనుల్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ ప్రమాదకరంగా కనిపిస్తున్నారు. అజ్మతుల్లా, నబీ, కరీమ్, జనత్ లాంటి ఆల్‌రౌండర్లు జట్టు కోసం తగ్గేదే లేదంటున్నారు. పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తే భారత బ్యాటర్లకు తిప్పలు తప్పవనిపిస్తోంది.
విరాట్ కోహ్లీ - ప్రధానంగా పరుగుల యంత్రం విరాట్ నిరాశపరుస్తున్నాడు. యూఎస్ఏలోని పిచ్ లపై పరుగులు తీసేందుకు తడబడి 1, 4, 0 స్కోర్లు నమోదు చేశాడు. అలా గ్రూప్ దశలో తేలిపోయిన విరాట్ తిరిగి ఫామ్ అందుకోవాలని ఎదురుచూస్తున్నారు అభిమానులు.
కుల్దీప్ కోసం జడేజా - మంచి ఫామ్‌తో టోర్నీలోకి అడుగుపెట్టిన చైనామన్ కుల్దీప్ యాదవ్ కు ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు. వెస్టిండీస్ గ్రౌండ్లపై స్పిన్ కలిసొస్తుందని వినిపిస్తుండటంతో ఈ సారి స్పిన్నర్ - ఆల్ రౌండర్ అయిన రవీంద్ర జడేజాను పక్కకుపెట్టి, స్పెషలిస్ట్ కుల్దీప్‌కు అవకాశమిచ్చేలా కనిపిస్తుంది. అలా జరిగితే అక్షర్ పటేల్ తో కలిపి ఇద్దరి స్పిన్నర్లతో బరిలోకి దిగుతుంది రోహిత్ సేన.
పిచ్ - గ్రూప్ దశలో మ్యాచ్‌లన్నీ న్యూయార్క్‌లో ఆడిన టీమిండియాకు ఇప్పుడు ఆ కష్టాలు లేనట్లే. అక్కడి డ్రాప్ ఇన్ పిచ్‌లు బ్యాటర్లకు చుక్కలు చూపించగా, వెస్టిండీస్ పిచ్‌లు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. వంద పైచిలుకు స్కోర్ లక్ష్యాన్ని చేధించడమే యూఎస్ఏ గ్రౌండ్లపై కష్టమైతే, వెస్టిండీస్ గ్రౌండ్లపై 200 వరకూ స్కోర్లు చేసే ఆస్కారముంది. ఇక్కడ నిలదొక్కుకుని ఆడగలిగితే భారత బ్యాటర్లు భారీ స్కోర్లు నమోదు చేయొచ్చు. టీమిండియా వర్సెస్ అఫ్ఘనిస్థాన్ మ్యాచ్ జరగనున్న బ్రిడ్జ్ టౌన్ గ్రౌండ్‌లో ఇప్పటికే మ్యాచ్ జరిగింది. అందులో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా 200పై చిలుకు స్కోర్లు నమోదు చేసింది.
జట్లు (అంచనా)
టీమిండియా : రోహిత్ (కెప్టెన్), విరాట్, పంత్, సూర్యకుమార్, దూబె, హార్దిక్, జడేజా, అక్షర్, అర్ష్‌దీప్, బుమ్రా, సిరాజ్
అఫ్గానిస్థాన్ :
గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, నైబ్, అజ్మతుల్లా, నజీబుల్లా, నబీ, కరీమ్ జనత్, రషీద్ ఖాన్ (కెప్టెన్), నూర్ అహ్మద్, నవీనుల్, ఫారూఖీ.
రెండో వన్డేలోనూ అదుర్స్ - హర్మన్ సేన ఖాతాలో మరో విక్టరీ - IND W Vs SA W 2nd ODI
'కోహ్లీపై బయోపిక్ తీస్తే - ఆ హీరో బాగా సెట్ అవుతాడు' - Virat Kohli Biopic