T20 Worldcup 2024 Babar Azam : ప్రస్తుత టీ20 వరల్డ్ కప్ నుంచి దాయాది దేశం పాకిస్థాన్ గ్రూప్ దశలోనే నిష్క్రమించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే పాక్ జట్టు టీ20 ఫార్మాట్ కెప్టెన్ బాబర్ ఆజమ్ పైన ఆ జట్టు మాజీ ప్లేయర్లు విరుచుకుపడుతున్నారు. ఈ విమర్శలపై పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ ఐర్లాండ్‌తో మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో స్పందించాడు.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) స్వదేశంలో జరిగే ప్రచారాన్ని సమీక్షించి జట్టు భవిష్యత్తు నాయకత్వంపై నిర్ణయం తీసుకుంటుందని కెప్టెన్ బాబర్ ఆజమ్ పేర్కొన్నాడు. తనను టీ20 ఫార్మాట్ కెప్టెన్‌గా ఇటీవలే మళ్లీ నియమించడం పీసీబీ తీసుకున్న నిర్ణయమని తెలిపాడు. అలానే టీ20 ప్రపంచకప్ నుంచి జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించడంపై బాబర్ నిరాశ వ్యక్తం చేశాడు. వ్యక్తిగతంగా ఆటగాళ్లను విమర్శించడం సరికాదని, జట్టు మొత్తం విఫలమైందని అభిప్రాయపడ్డాడు. ఈ టీ20 మెగాటోర్నీలో బౌలర్లు బాగా రాణించినా, బ్యాటర్ల విఫలమయ్యారని బాబార్ పేర్కొన్నాడు.
"మాకు చాలా బాధగా ఉంది. ఆటగాళ్లు, టీమ్ మేనేజ్ మెంట్ అందరూ విచారంగా ఉన్నారు. మేము ఆశించిన స్థాయిలో క్రికెట్ ఆడలేకపోయాము. అమెరికా పిచ్‌లు ఫాస్ట్ బౌలర్లకు కొద్దిగా అనుకూలంగా ఉన్నాయి. ఈ టోర్నీలో మా టీమ్ బ్యాటింగ్ వైఫల్యం పెద్ద సమస్యగా మారింది. కీలక మ్యాచుల్లో వరుసగా వికెట్లు కోల్పోవడం వల్ల రెండు కీలక మ్యాచుల్లో ఓడిపోయాం. దీంతో టీమ్ పై ఒత్తిడి పెరిగిపోయింది." అని బాబర్ ఆజామ్ విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించాడు.
టోర్నీ నుంచి వైదొలిగిన పాకిస్థాన్ - ఆదివారం ఫ్లోరిడాలో ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 3 వికెట్ల తేడాతో పాకిస్థాన్ విజయం సాధించింది. అయినా ఆ జట్టు గ్రూప్ దశలోనే టీ20 టోర్నీ నుంచి వైదొలిగింది. టీ20 టోర్నీలో పాక్ ఘోరంగా విఫలమవ్వడంతో కెప్టెన్ బాబర్ అజామ్, ఇతర కీలక ప్లేయర్స్ పై విమర్శలు వస్తున్నాయి. చాలా మంది బాబర్ ను తొలగించాలని, ఫ్లాప్ ప్లేయర్స్ పై వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే పాక్ జట్టు కెప్టెన్ గా బాబర్ ను నియమించింది పీసీబీ. గతేడాది వన్డే వరల్డ్ కప్ లో జట్టు పేలవ ప్రదర్శన చేయడం వల్ల కెప్టెన్సీ నుంచి బాబర్ తప్పుకున్నాడు.
నేపాల్‌పై ఘనవిజయం- సూపర్‌కు 8కు దూసుకెళ్లిన బంగ్లాదేశ్ - T20 worldcup 2024
సూపర్-8కు టీమ్ఇండియా రెడీ - గత రికార్డులు ఎలా ఉన్నాయంటే? - T20 World Cup Super 8