T20 world cup 2024 Teamindia Squad : సాధారణంగా టీ20 ఫార్మాట్ అంటే కుర్రాళ్లదే అని చాలామంది సిద్ధాంతం. రెండేళ్ల క్రితం వరకు బీసీసీఐ ప్రణాళిక ఇలానే కొనసాగించింది. కానీ 2022 టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో టీమ్‌ఇండియా ఘోర ఓటమి పొందడం వల్ల స్టార్ ప్లయేర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను పొట్టి ఫార్మాట్లో కాస్త పక్కనబెట్టింది. ఇక టీ20 కప్పులో వీరిని చూడటం కష్టమేనని అంతా అనుకున్నారు! హార్దిక్ పాండ్య నాయకత్వంలో టీమ్ ఇండియా బరిలో దిగుతుందని అంతా భావించారు. కానీ రెండేళ్లు కూడా అవ్వలేదు అంతా తారుమారైంది. ఇప్పుడు కోహ్లీ, రోహితే జట్టులో మళ్లీ ప్రధాన ఆటగాళ్లైపోయారు. ఏడాది నుంచి టీ20 ఫార్మాట్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పాండ్యకు చివరికి జట్టులో చోటు కూడా కష్టమే అన్న పరిస్థితి నుంచి త్రుటిలో బయటపడ్డాడు! ఫైనల్‌గా బీసీసీఐ సెలక్టర్ల అనుభవానికే ఓటేశారు.
2022 టీ20 వరల్డ్ కప్‌లో నిలిచిన జట్టులోని ఎనిమిది మందికి మరోసారి ప్రపంచకప్ ఆడే ఛాన్స్ దక్కింది. కోహ్లీ, రోహిత్, హార్దిక్, రిషబ్ పంత్, సూర్యకుమార్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్, చాహల్ తమ స్థానాలను కాపాడుకున్నారు. ప్రస్తుతం సెలెక్ట్ అయిన వారిలో ఇద్దరు ముగ్గురు తప్ప మిగితా వారు ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే విషయం.
ఆ ఇద్దరు జట్టుకు బలం - ముఖ్యంగా టీ20 ప్రపంచకప్‌లో కోహ్లీ, రోహిత్ ఫామ్‌లో ఉండటం జట్టుకు బలాన్ని ఇచ్చే అంశం. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ 158.29 స్ట్రెక్‌రేట్‌తో 315 పరుగులు సాధించాడు. కోహ్లీ 10 మ్యాచ్‌ల్లో 147.49 స్ట్రైక్‌రేట్‌తో 500 పరుగులు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. వెస్టిండీస్, అమెరికాలోని మందకొడి పిచ్‌లపై ఈ ఇద్దరి ఆట కీలకం. ఇక 2022 డిసెంబరులో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ ఈ వరల్డ్ కప్‌నకు సెలక్ట్ అవ్వడం సంచలనమే అని చెప్పాలి. సుమారు 15 నెలలు ఆటకు దూరమైనా. అతడు. ఐపీఎల్‌లో తన ఫామ్, ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆటను మలుపు తిప్పగలడుతడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో అతడు 11 మ్యాచుల్లో 158.56 స్ట్రైక్‌రేట్‌తో 398 పరుగులు చేశాడు. సంజు శాంసన్ కూడా సెలెక్టర్లు తనను ఎంపిక చేయాల్సిన విధంగా ఆడాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నప్పటికీ, నిలకడగా రాణిస్తున్నప్పటికీ భారత జట్టుకొచ్చేసరికి రకరకాల కారణాలతో సంజును పక్కనపెట్టేవారు. కానీ చివరికి అతడి మౌన పోరాటమే చివరికి జట్టులో చోటు దక్కేలా చేసింది. ఈ సీజన్‌లో అతడు 161.08 స్ట్రైక్‌రేట్‌తో 385 పరుగులు సాధించాడు.
అతడికి నిరాశే ఎదురైంది - అయితే నాలుగు నెలల క్రితం వరకు రింకూ సింగ్ పేరు మారుమోగింది. కానీ అతడికి 15 మందిలో చోటు దక్కలేదు. చెన్నై తరఫున భారీ సిక్సర్లతో, చివరి ఓవర్లలో దూకుడు ప్రదర్శిస్తున్న శివమ్ దూబెకు ఛాన్స్ దక్కింది. వాస్తవానికి ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన రింకూ ఆశలకు గండికొట్టింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌లో టాప్ ఆర్డర్ ఫామ్‌లో ఉండటం, ఇంపాక్ట్ రూల్ కారణంగా, మరో స్పెషలిస్ట్ బ్యాటర్‌కు అతడి కన్నా ముందే ఆడే అవకాశం రావడం వల్ల ఈసారి లీగ్‌లో రింకూ (9 మ్యాచ్‌ల్లో 123)కు ఎక్కువగా ఆడే ఛాన్స్ రాలేదు. అదే సమయంలో మరోవైపు టాప్ ఆర్డర్‌లో ఆడిన దూబె మంచి ప్రదర్శన చేసి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. దూబె 9 మ్యాచ్‌ల్లో 172.41 స్ట్రైక్‌రేట్‌తో 350 పరుగులు సాధించాడు. హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్ ఈ ఐపీఎల్ సీజన్‌లో అంతగా రాణించలేదు.
వారిదే కీలక పాత్ర - ఇక ఈ సారి వరల్డ్ కప్‌లో అత్యంత కీలక పాత్ర స్పిన్నర్లదే అని చెప్పాలి. ఒకప్పుడు మణికట్టు స్పిన్నర్లు కుల్‌దీప్, చాహల్ సక్సెస్ఫుల్ జోడీగా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు ఈ ప్రపంచకప్ కోసం మళ్లీ జోడీ కట్టనున్నారు.రవి బిష్ణోయ్ రెండో లెగ్ స్పిన్నర్ రేసులో నిలిచినప్పటికీ ఫామ్‌లో ఉన్న చాహల్‌కే మొగ్గు చూపారు సెలెక్టర్లు. వీరంతా ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన చేస్తూ ముందుండటం జట్టుకు ఉత్సాహాన్ని ఇచ్చే అంశం. ఇక ఈ సీజన్‌లో ఫామ్‌లో లేని పేసర్లు సిరాజ్, అర్ష్‌దీప్ బుమ్రాకు ఎంతవరకు సహకారం అందిస్తారో చూడాలి. ఏదేమైనా కేఎల్ రాహుల్, రింకూ సింగ్‌లను తప్పించడం తప్పితే ప్రస్తుత జట్టుపై ఎవరికీ పెద్దగా అభ్యంతరాలు లేవనే చెప్పాలి. ఎందుకంటే సీనియర్లు, కుర్రాళ్లతో సమతూకంగా కనిపిస్తోంది. చూడాలి మరి ఈ జట్టు భారత ప్రపంచ కప్ టైటిల్‌ను అందిస్తుందో లేదో.
టీమ్ఇండియా జట్టు ప్రకటించిన బీసీసీఐ - పంత్ ఇన్, రాహుల్ ఔట్ - ICC T20 World Cup 2024
ఇంపాక్ట్ రూల్ వల్లే రింకూ సింగ్‌కు జట్టులో చోటు దక్కలేదా? - T20 World Cup 2024