Rafael Nadal Announces Retirement : టెన్నిస్ దిగ్గం రఫెల్ నాదల్ తాజాగా ప్రొఫెషనల్ టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ఏడాది నవంబర్‌లో డేవిస్ కప్ ఫైనల్స్‌లో చివరి ప్రదర్శన చేసిన ఆయన సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టి అభిమానులకు షాకిచ్చారు. నవంబర్‌లో జరగనున్న డేవిస్ కప్ ఫైనల్ తర్వాత ఈ ఆటకు వీడ్కోలు పలుకుతానంటూ ప్రకటించాడు.
"నేను ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్ అవుతున్నాను. గత రెండేళ్లు నాకు ఎంతో కఠినంగా గడిచాయి. ఈ నిర్ణయం తీసుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది. కానీ, జీవితంలో ప్రతిదానికీ ప్రారంభం, ముగింపు అనేది ఉంటుంది" అంటూ నాదల్ పేర్కొన్నాడు. గత నెలలో జరిగిన లేవర్ కప్ నుంచి తప్పుకొన్నాడు. 38 ఏళ్ల నాదల్ చివరగా పారిస్ ఒలింపిక్స్‌లో ఆడాడు. సింగిల్స్‌లో రెండో రౌండ్లోనే జకోవిచ్ చేతిలో ఓడాడు. డబుల్స్‌లో అల్కరాస్‌తో కలిసి క్వార్టర్స్ వరకూ వెళ్లాడు.
Mil gracias a todos
— Rafa Nadal (@RafaelNadal) October 10, 2024
Many thanks to all
Merci beaucoup à tous
Grazie mille à tutti
谢谢大家
شكرا لكم جميعا
תודה לכולכם
Obrigado a todos
Vielen Dank euch allen
Tack alla
Хвала свима
Gràcies a tots pic.twitter.com/7yPRs7QrOi
2005 నుంచే టైటిళ్ల వేట
ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్ టైటిళ్ల వేట 2005లో మొదలైంది. ఆ తర్వాత నుంచి అతడికి ఈ ఆటలో తిరుగే లేకుండా పోయింది. అలా 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019, 2020, 2022లోనూ ఈ స్టార్ ప్లేయర్ విజేతగా నిలిచాడు. ఇతర గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ సత్తా చాటిన నాదల్, తన కెరీర్‌లో మొత్తం 22 మేజర్ టైటిళ్లను సొంతం చేసుకున్నాడు.
ఫ్రెంచ్ ఓపెన్ అంటే నాదల్, నాదల్ అంటే ఫ్రెంచ్ ఓపెన్ అన్నట్లుగా క్రీడాభిమానులను అలరించాడు రఫెల్ నాదల్. అతడి కంచుకోటలో ఊహకందని రీతిలో అతడు ఏకంగా 14 టైటిళ్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఇటీవలె జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌లో మాత్రం తొలి రౌండ్లోనే జ్వెరెవ్ చేతిలో ఓటమిపాలయ్యాడు. తొలిసారి రొలాండ్ గారోస్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి ప్రత్యర్థులపై నిర్దాక్షిణ్యంగా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చిన అతడు, ఇలా తొలి రౌండ్లో కంగుతినడం విచిత్రంగా అనిపించిందని అభిమానులు అంటున్నారు.
అయితే ఏడాదిన్నరగా అతడ్ని వెంటాడుతున్న గాయాలు, ఫిట్‌నెస్ లేమి, ఇలా పలు కారణాల వల్ల నాదల్‌లో ఒకప్పటి జోరు లేదన్నది విశ్లేషకుల మాట. తుంటి, ఉదర కండరాల గాయాల కారణంగా 2023 జనవరి నుంచి 15 మ్యాచ్‌లే ఆడిన నాదల్ గెలుపోటముల రికార్డు 8-7. చాలా కాలం నంబర్‌వన్‌గా కూడా ఉన్న ఈ స్టార్ ఇటీవల ఎక్కువగా ఆడకపోవడం వల్ల 275వ ర్యాంకుకు పడిపోయాడు.
ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలిసారి అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగాడు. దీంతో తొలి రౌండ్లోనే నాలుగో సీడ్ జ్వెరెవ్‌తో తలపడాల్సి వచ్చింది. అయితే ఆ ఓటమి నేపథ్యంలో నాదల్‌తో పాటు, అతడికిదే చివరి ఫ్రెంచ్ ఓపెన్ మ్యాచ్ అని అర్థం కావడం వల్ల అక్కడి ప్రేక్షకులు కూడా భావోద్వేగానికి లోనయ్యారు. మళ్లీ ఫ్రెంచ్ ఓపెన్ ఆడతానని కచ్చితంగా చెప్పలేనంటూ అప్పుడే నాదల్ చెప్పడం గమనార్హం.
"అందరికీ కృతజ్ఞతలు. నాకు ఈ సమయంలో మాట్లాడానికి చాలా కష్టంగా ఉంది. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడటం ఇదే చివరిసారా అన్న ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను. గత రెండేళ్లలో గాయాల వల్ల నేను చాలా ఇబ్బందిపడ్డాను. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పడమైతే కష్టం. కానీ నేను ఇక్కడికి తిరిగి రాకపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అది నూరు శాతం అని కూడా నేను చెప్పను. ఒలింపిక్స్ కోసం మాత్రం ఇక్కడికి మళ్లీ వస్తానని ఆశిస్తున్నాను" అంటూ నాదల్ ఎమోషనల్ అయ్యారు.