Paris Olympics July 27 Events : పారిస్‌లో ఒలింపిక్ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. దీంతో ఆయా ఈవెంట్లకు శుభారంభం పలికారు క్రీడాకారులు. ఇప్పటికే పలు గేమ్స్‌లో మన భారత ప్లేయర్లు సత్తా చాటాగా, ఈ పతక వేటలో తమ ట్యాలెంట్ చూపించేందుకు షూటింగ్ స్టార్స్ సిద్ధమయ్యారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్‌లో లక్ష్యంగా షూటర్లు బరిలో దిగుతున్నారు. వీటితోపాటు టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, రోయింగ్, టెన్నిస్, బాక్సింగ్, హాకీలోనూ పోటీలు జరగనున్నాయి.
తొలి రోజు షూటింగ్ ఈవెంట్లో మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో రమిత- అర్జున్ బబుతా, ఎలవెనిల్ వలరివన్- సందీప్ సింగ్ జోడీలు బరిలో దిగనుంది. ముందుగా క్వాలిఫికేషన్ రౌండ్లో ఈ రెండు జంటలు పోటీపడతనున్నాయి. ఇందులో అత్యుత్తమ పెర్ఫామెన్స్ చేసిన టీమ్‌కు పతక రౌండ్లకు అర్హత సాధించే అవకాశాలుంటాయి. ఇక ఈ ఈవెంట్‌కు సంబంధించిన కాంస్య, స్వర్ణ పతక పోటీలు కూడా శనివారమే జరగనున్నాయి. ఒలింపిక్స్‌కు ముందే మన షూటర్లు మెరుగైన మంచి ఫామ్ కనబరిచారు. ఈ క్రీడల్లోనూ నిలకడ కొనసాగిస్తే మొదటి రోజే భారత్ ఖాతాలో తొలి పతకం రావొచ్చు.
ఇక 10మీ. ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్లోని పురుషుల్లో అర్జున్ చీమా, సరబ్‌జోత్ సింగ్ అలాగే మహిళా ప్లేయర్లలో రిథమ్ సంగ్వాన్, మను బాకర్ షూటింగ్ రేంజ్‌లో అడుగుపెట్టనున్నారు. వివిధ ప్రపంచ పోటీల్లో అద్భుతమై పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న మను గత ఒలింపిక్స్‌లో నిరాశపరిచింది. దీంతో ఈ సారి తానేంటో నిరూపించుకునేందుకు సిద్ధమైంది. ఇక మన షూటర్లకు ప్రధానంగా చైనా నుంచి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశాలున్నాయి. అయితే భారత చెఫ్ డి మిషన్‌గా ఉన్న షూటర్ నారంగ్ యంగ్ ప్లేయర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు.
బాక్సింగ్ పోటీలు కూడా శనివారమే ప్రారంభం కానున్నాయి. దీంతో క్రీడాభిమానుల కళ్లు డిఫెండింగ్ ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్‌పైనే ఉంది. అయితే ఆమెతో పాటు గత క్రీడల కాంస్య విజేత లవ్లీనా బొర్గోహెయిన్పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వీళ్లతో పాటు మరో ఆరుగురు భారతీయులు పారిస్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
అయితే నిఖత్ సహా ఎక్కువ మందికి భారత బాక్సర్లకు కఠినమైన డ్రా ఎదురైంది. రక్సత్ (థాయ్‌లాండ్), వు యు (చైనా), సబీనా (ఉజ్బెకిస్థాన్)లు నిఖత్లాగే మంచి ఫామ్‌లో ఉన్నారు. ఆదివారం మ్యాక్సీ (జర్మనీ)తో పోరుతో నిఖత్ తన పతక వేట ప్రారంభం కానున్నాయి. లవ్లీనా (69 కేజీ) తన తొలి రౌండ్లో సునివా (నార్వే) పోటీపడనున్నారు. జైస్మైన్ లంబోరియా (57కేజీ), ప్రీతి పన్వర్ (54 కేజీ), కూడా ఈ భారత్ తరఫున బాక్సింగ్ రింగ్‌లోకి దిగనున్నారు. పురుషుల విభాగంలో నిశాంత్ దేవ్ (71కేజీ), అమిత్ పంఘాల్ (51కేజీ)లకు తొలి రౌండ్లో బై లభించింది.
టెన్నిస్‌లో అలా
స్టార్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న ఈ సారి పతక వేట కన్నేశాడు. శ్రీరామ్ బాలాజీతో కలిసి ఈ 44 ఏళ్ల ఆటగాడు పురుషుల డబుల్స్ పోరుకు సిద్ధమయ్యాడు. తొలి రౌండ్లో ఫాబియన్- రోజర్ (ఫ్రాన్స్)తో బోపన్న ద్వయం తలపడనుంది.
హాకీలో మరో స్వర్ణం!
ఒలింపిక్స్ హాకీలో భారత్‌ది ఘనమైన చరిత్ర. దేశానికి ఏకంగా 8 స్వర్ణాలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ప్రదర్శన పడిపోయింది. 41 ఏళ్ల తర్వాత టోక్యోలో కాంస్యంతో భారత పురుషుల హాకీ జట్టు కొత్త ఆశలు రేపింది. ఈ సారి పతకం రంగు మార్చడమే లక్ష్యంగా హర్మన్‌ప్రీత్ సేన సమరానికి సై అంటోంది. ఆ దిశగా కఠినమైన గ్రూప్‌ను దాటాల్సి ఉంది. 'పూల్ ఆఫ్ డెత్'గా భావిస్తున్న 'బి'లో డిఫెండింగ్ ఛాంపియన్ బెల్జియం, బలమైన ఆస్ట్రేలియా, పటిష్ఠమైన అర్జెంటీనా, న్యూజిలాండ్, ఐర్లాండ్‌తో భారత్ ఉంది. ఇందులో నుంచి ముందంజ వేయాలంటే భారత్ అత్యుత్తమ ఫామ్ కనబరిచాల్సి ఉంటుంది. ఇక శనివారం తన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను టీమ్‌ఇండియా ఢీకొడుతోంది.
బ్యాడ్మింటన్‌లో అందరి ఫేవరట్
గత మూడు ఒలింపిక్స్‌లలో పతకాలతో సంచలనం సృష్టించిన భారత బ్యాడ్మింటన్ టీమ్ ఈ పారిస్ క్రీడల్లోనూ పతకాన్ని ముద్దాడాలన్న ఆశతో ఉంది. శనివారం ప్రారంభం కానున్న పోటీల్లో సాత్విక్- చిరాగ్ జోడీ బరిలో దిగనుంది.
ఇక గ్రూపు-సి తొలి పోరులో లూకాస్ కార్వీ- రోనన్ లాబార్ (ఫ్రాన్స్) జంటతో సాత్విక్ జంట తలపడనుంది. పురుషుల సింగిల్స్ గ్రూపు దశలో కెవిన్ కార్డన్ (గ్వాటెమాలా)తో యంగ్ ప్లేయర్ లక్ష్యసేన్, మహిళల డబుల్స్ గ్రూపు-సి తొలి మ్యాచ్‌లో కిమ్ యియాంగ్- కాంగ్ యాంగ్ (కొరియా)తో మన స్టార్ ప్లేయర్లు అశ్విని పొన్నప్ప- తనీషా క్రాస్టో జంట పోటీపడనుంది.