Paris Olympics 2024 Live Telecast : పారిస్ వేదికగా ఒలింపిక్ క్రీడా సంబరాలు నేడు (జులై 26) అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే పలు ఈవెంట్లు కూడా ప్రారంభం కాగా, అఫీషియల్ ఓపెనింగ్ సెరిమనీతో మిగతా ఈవెంట్లు కూడా గ్రాండ్‌గా మొదలవ్వనుంది. మరీ ఈ విశ్వ క్రీడల ప్రారంభ వేడుకను ఎప్పుడు ఎలా చూడొచ్చంటే?
జియో సినిమా, స్పోర్ట్స్18 నెట్‌వర్క్, లాంటి సంస్థలు ఈ వేడుకలను లైవ్ టెలికాస్ట్ చేయనున్నాయి. భారత కాలమానం ప్రకారం ఈ ప్రారంభోత్సవ వేడుకలు రాత్రి 11 నుంచి టెలికాస్ట్ కానుంది. ఇక అథ్లెట్ల పరేడ్ పడవల్లో ఉంటుంది. ఇందులో సుమారు 94 పడవల్లో ప్లేయర్లు పయనిస్తారు.
ఇక ఈ పరేడ్‌లో గ్రీస్ ముందు వరసలో ఉండగా, ఆ తర్వాత ఆల్ఫాబెట్ వరుస క్రమంలో ఆయా దేశాల ప్రతినిథ్లు అనుసరిస్తారు. అయితే ఆతిథ్య దేశ జాతీయ భాషను ప్రామాణికంగా తీసుకోవడం వల్ల ఆతిథ్య దేశం పరేడ్ చివరిలో వస్తుంది. ఇక అంతకంటే ముందు వరుసలో రానున్న ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న దేశాలు ఉంటాయి. ఈ లెక్కన 203లో ఆస్ట్రేలియా (2032 ఒలింపిక్స్), 204లో అమెరికా (2028 ఒలింపిక్స్), 205లో ఫ్రాన్స్ (2024 ఒలింపిక్స్) వస్తాయి.
మరోవైపు ఈ పరేడ్‌లో భారత్ 84వ స్థానంలో రానుంది. ఇక ఈ ప్రారంభ వేడుకల్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించనున్నారు. తనతో పాటు టేబుల్ టెన్నిస్ ప్లేయర్ శరత్ కమల్ మన త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని భారత అథ్లెట్ల బృందాన్ని ముందుండి నడిపించనున్నారు.
దాదాపు 10వేల 500 మంది అథ్లెట్లు ఈసారి విశ్వక్రీడల్లో ఆడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా షార్ట్ వీడియోల ట్రెండ్ నడుస్తున్న వేళ యువతరం కోసం ప్రత్యేక వేదికలు సిద్ధమయ్యాయి. ఉగ్రదాడులు, గాజా ఉక్రెయిన్ యుద్ధాలను దృష్టిలో ఉంచుకుని భద్రతను ఫ్రాన్స్ ప్రభుత్వం పటిష్టం చేసింది.
పారిస్‌కు 150 కిలోమీటర్ల విస్తీర్ణంలోని ప్రదేశాన్ని నోఫ్లై జోన్‌గా ప్రకటించారు. ఫ్రాన్స్ అతి పెద్ద స్టేడియమైన స్టేడ్‌డి ఫ్రాన్స్‌ను 2015లో ముష్కరులు లక్ష్యంగా చేసుకోవడంతో ఈసారి ప్రారంభోత్సవాలను అందులో నిర్వహించట్లేదు. ఎక్కడికక్కడ కృత్రిమ మేధతో కూడిన నిఘా వ్యవస్థను నెలకొల్పారు. 45వేలమంది పోలీసులు, 10 వేలమంది సైనికులు పారిస్‌కు పహారా కాస్తున్నారు.
124 ఏళ్ల క్రితం ఇదే పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో 22 మంది మహిళలే ఆడగా, ఈసారి పాల్గొంటున్న క్రీడాకారుల్లో స్త్రీ పురుషుల సంఖ్య దాదాపు సమానంగా ఉంది. 'మీ టూ' ఉద్యమం తర్వాత జరుగుతున్న తొలి ఒలింపిక్స్ ఇవి. వాతావరణ పరిరక్షణకు కట్టుబడి తక్కువ కాలుష్యంలో విశ్వక్రీడలను నిర్వహించాలని ఫ్రాన్స్ భావిస్తోంది.
పారిస్ ఒలింపిక్స్: ఇండియన్ అథ్లెట్లు ఈవెంట్లు- పూర్తి షెడ్యూల్ ఇదే! - Paris Olympics 2024