Paris Olympics 2024 : ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్‌లో సత్తా చాటేందుకు ఎంతో మంది భారత ప్లేయర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే పలు ఛాంపియన్‌షిప్‌లు సాధించిన దిగ్గజాలు కూడా పారిస్ వేదికగా మరిన్ని ఘనతనలను తమ ఖాతాలో వేసుకోవాలన్న కసితో ఉన్నారు. అయితే అందులో కొందరు మాత్రం తమ సుదీర్ఘ కెరీర్‌లో ఒలింపిక్ పతకాన్ని సాధించుకోవాలన్న వెలితిని తీర్చుకోకుండానే కెరీర్లు ముగిస్తారా అన్న బాధలో ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లో టెన్నీస్ స్టార్ రోహన్ బోపన్న, ఆర్చర్ దీపిక కుమారీ, టేబుల్ టెన్నీస్ ప్లేయర్ శరత్ కమల్. ఈ ముగ్గురూ తమ కెరీర్‌లో చివరిసారి ఆ లక్ష్యాన్ని అందుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరీ ఈ ప్లేయర్ల ఫామ్ ఎలా ఉందంటే?
బోపన్న పసిడి పట్టేనా?
పారిస్ ఒలింపిక్స్‌లోని పాల్గొంటున్న భారత టీమ్‌లో రోహన్ బోపన్నే పెద్ద వయస్కుడు. ప్రస్తుతం ఆయనకు 44 ఏళ్లు. అయితే ఈ లేటు వయసులోనే ఆయన మునుపటికంటే జోరుగా ఆడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో పాటు మియామి టైటిల్స్‌ను తన ఖాతాలో వేసుకుని సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇప్పుడీ అనుభవంతోనే పారిస్ బరిలో దిగుతున్నాడు. అదే ఫామ్‌తో తన చివరి ప్రయత్నంలోనూ పతకాన్ని పట్టాలనే సంకల్పంతో ఉన్నాడు.
2016 రియో ఒలింపిక్స్‌లో సానియా మీర్జాతో మిక్స్‌డ్ డబుల్స్ ఆడాడు. ఆ గేమ్‌లో ఈ జోడీ సెమీఫైనల్‌కు చేరింది. అయితే సెమీస్‌లో త్రుటిలో ఓటమిపాలైంది. కాంస్యమైనా దక్కుతుందనుకుంటే అది కూడా జరగలేదు.
మరోవైపు బోపన్నకు తోడుగా శ్రీరామ్ బాలాజీ మిక్స్‌డ్ డబుల్స్‌లో ఆడనున్నాడు. ఇప్పటివరకు మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జతగా దూసుకెళ్తున్న బోపన్న, ఈ కొత్త పార్ట్నర్తో ఏమేరకు సమన్వయం సాధిస్తాడన్నది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. అన్నీ కలిసొస్తే ఈ ఇద్దరిలోనూ విజయం సాధించగల సత్తా ఉంది.
2004 నుంచే పతకాల వేట
2004 ఏథెన్స్ ఒలింపిక్స్ నుంచి క్రమం తప్పకుండా క్రీడలకు వెళ్తున్నాడు ఆచంట శరత్ కమల్. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ పతకాన్ని ముద్దాడేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. యంగ్ ప్లేయర్లకు దీటుగా ఆడుతూ ర్యాంకుల్లోనూ మెరుగైన ఈ స్టార్ ప్లేయర్ తన చివరి ప్రయత్నంలో ఎలాగైనా మెడల్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో సత్తా చాటాడు.
ముఖ్యంగా 2022 కామన్వెల్త్లో సింగిల్స్, మిక్స్‌డ్ డబుల్స్, పురుషుల టీమ్ ఇలా మూడు విభాగాల్లో పసిడి పతకాన్ని అందుకున్నాడు. ఇప్పుడీ పారిస్ ఒలింపిక్స్‌లో అదరగొట్టి పతకం పట్టేయాలన్నే అతడి చిరకాల కోరిక. టీటీలో ఇప్పటివరకు ఒక్క ఒలింపిక్ పతకం రానందున శరత్ మెడల్ సాధిస్తే అది చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఈ క్రీడల్లో సింగిల్స్, డబుల్స్‌లో, మిక్స్‌డ్ డబుల్స్‌లో శరత్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.
కష్టాల కడలి దాటి పారిస్‌కు
ప్రపంచ ఛాంపియ్‌షిప్, ప్రపంచకప్‌ల్లో ఎన్నో పతకాలు కొల్లగొట్టింది ఆర్చరీ స్టార్ దీపిక కుమారి. అయితే ఒలింపిక్స్‌లో మాత్రం ఆమె ప్రతిసారీ నిరాశగానే వెనుతిరిగింది. 2012 లండన్ ఒలింపిక్స్ మొదలుపెట్టి ఆమెకు ప్రతిసారీ నిరాశే ఎదురైంది. ఇప్పటివరకూ క్వార్టర్ ఫైనల్‌కు వెళ్లిన ఆమె, 2020 ఒలింపిక్స్ తర్వాత లైమ్లైట్ను క్రమంగా వీడుతూ వచ్చింది. పెళ్లి, పిల్లలు ఇలా పలు బాధ్యతల నడుమ ఆమె ఆటలో కొనసాగదని అందరూ అనుకున్నారు. అనారోగ్య సమస్యల వల్ల కూడా ఆమె ఆర్చరీకి దూరమైంది.
అయితే ఎన్నో అవాంతరాల నడుమ, భర్త అతానుదాస్ అండతో ఆటలో మళ్లీ సూపర్ కమ్‌బ్యాక్ ఇచ్చింది. 2024లో షాంగై ప్రపంచకప్‌లో రజతంతో సత్తా చాటింది. ఇదే జోష్‌తో పారిస్ ఒలింపిక్స్‌లోనూ ఈ సారి పతకం తన వెంట భారత్‌కు తెచ్చుకునేందుకు సిద్ధమవుతోంది.
పారిస్ ఒలింపిక్స్: ఇండియన్ అథ్లెట్లు ఈవెంట్లు- పూర్తి షెడ్యూల్ ఇదే! - Paris Olympics 2024