IND vs NZ Test Series 2024 : భారత్ పర్యటనలో చారిత్రక విజయం సాధించిన న్యూజిలాండ్ జట్టుపై ఆ దేశ మీడియా ప్రశంసల వర్షం కురిపిస్తోంది. తాజా టెస్టు సిరీస్‌లో 3-0తో నెగ్గి టీమ్ఇండియాను సొంతగడ్డపై వైట్‌వాష్ చేసిన మూడో జట్టుగా కివీస్ రికార్డు సృష్టించింది. దీంతో తమ జట్టుపై ప్రశంసలు కురిపిస్తూనే, టీమ్ఇండియా ప్లేయర్లను కివీస్ మీడియా హైలైట్ చేసింది. అందులో ఒకరు టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాగా, ఇంకొకరు యువ ఆటగాడు రిషభ్ పంత్.
తాజా టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ బ్యాట్‌తో పూర్తిగా విఫలమయ్యాడు. అటు కెప్టెన్సీపై కూడావిమర్శలు వచ్చాయి. అయితే ఇదే విషయాన్ని న్యూజిలాండ్ మీడియా వేలెత్తి చూపింది. కీలక సమయంలో రిస్క్ షాట్లకు వెళ్లి వికెట్‌ను పారేసుకున్నాడని ఆక్షేపించింది. ఇక ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేయడం వల్లే ఓటమి ఎదురైందని కొన్ని మీడియా సైట్లు పేర్కొన్నాయి.
పంత్‌పై ప్రశంసలు
ఆఖరి టెస్టులో టీమ్ఇండియా బ్యాటర్లు చేతులెత్తేసిన వేళ రిషభ్ పంత్ ఒక్కడై నిలబడ్డాడు. దూకుడు బ్యాటింగ్ చేస్తూ బౌండరీలతో ప్రత్యర్థిపై ఎదురు దాడికి దిగాడు. ఒక దశలో గెలుస్తామనే ధీమా ఇచ్చాడు. ఈ క్రమంలో 57 బంతుల్లోనే 64 పరుగులు చేసి వాహ్వా అనిపించాడు. ఒత్తిడి సమయంలో పంత్ ఆడిన ఈ ఇన్నింగ్స్ అద్భుతంగా ఉందని కివీస్ మీడియా వెబ్సైట్లు అభినందించాయి. వన్‌న్యూస్.కో.ఎన్‌జడ్, న్యూజిలాండ్ హెరాల్డ్, ఆర్‌ఎన్‌జడ్, స్టఫ్.కో.ఎన్‌జడ్ తదితర మీడియా సంస్థల్లో రోహిత్, పంత్ ప్రదర్శనలపై విశ్లేషణలు వచ్చాయి.
కాగా, ఈ ఓటమితో భారత్ డబ్ల్యూటీసీ 2023-25 పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కోల్పోయింది. ఈ సిరీస్‌కు ముందు 62.82 శాతంతో టాప్‌లో ఉన్న భారత్, వరుసగా మూడు టెస్టుల్లో ఓడడం వల్ల 58.33 శాతానికి పడిపోయింది. దీంతో ఆస్ట్రేలియా టాప్‌లోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం ఆసీస్ 62.50 శాతంతో ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఇక ఈ నెలలో ఆస్ట్రేలియా గడ్డపై జరగనున్న బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో 4-0తో నెగ్గితేనే టీమ్ఇండియాకు డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు ఉంటాయి.
సీనియర్లపై BCCI సీరియస్- ఆ సిరీస్ తర్వాత వీళ్ల ఫ్యూచర్ డిసైడ్!
పాయింట్స్ పట్టికలో రెండో స్థానానికి ఢమాల్ - WTC ఫైనల్స్‌కు టీమ్ఇండియా చేరేనా?