Ishan Kishan BCCI : ఒకప్పుడు క్రికెటర్లందరూ ఇంటర్నేషనల్ మ్యాచులు లేకుంటే రంజీల్లో ఆడుతూ క్రికెట్ అభిమానులను అలరించేవారు. అయితే ఇప్పుడు కొందరు క్రికెటర్లు అలా చేయట్లేదు. రంజీలు ఆడేందుకు విముఖత చూపిస్తున్నారు. కేవలం అంతర్జాతీయ మ్యాచులు, ఐపీఎల్ మాత్రమే ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అలాంటి ప్లేయర్స్‌ను కంట్రోల్ చేసేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఓ కొత్త నిబంధనను తీసుకొచ్చేలా నిర్ణయం తీసుకుంది. భారత జట్టులో(పర్యటనలో) లేనివాళ్లు ఐపీఎల్లో ఆడాలంటే అంతకన్నా ముందు ప్లేయర్స్ అందరూ కచ్చితంగా రంజీ ట్రోఫీ మూడు, నాలుగు మ్యాచులు ఆడేలా బోర్డు ప్రణాళిక రచిస్తోంది.
అసలేం జరిగిందంటే ? గతేడాది డిసెంబర్ నుంచి ఇషాన్ కిషన్ ఆటకు దూరంగా ఉంటున్నాడన్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లిన అతడు మానసిక సమస్యలు అంటూ స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. రీసెంట్గా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి రెండు టెస్టులకు అతడిని సెలక్టర్లు తీసుకోలేదు. ఈ విషయమై కోచ్ ద్రవిడ్‌కు ప్రశ్న ఎదురైంది. టీమ్ఇండియాలోకి రావాలంటే ఎవరైనా సరే కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందని ద్రవిడ్ పేర్కొన్నాడు.
ఈ మాటలను కూడా ఇషాన్ పెడచెవిన పెట్టాడు. ఏ మాత్రం పట్టించుకోలేదు. రంజీలు ఆడటం అవసరమే లేదన్నట్లుగా వ్యవహరించాడు. పైగా ఐపీఎల్ 2024 సీజన్ కోసం సిద్ధం అవ్వడం మొదలుపెట్టాడు. బరోడా వెళ్లి మరీ పాండ్యా బ్రదర్స్‌తో కలిసి ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. దీంతో ఇషాన్ ప్రవర్తించే తీరును పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ ఈ కొత్త నిబంధనను అమలు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఆటగాళ్లకు ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలిసింది. అలానే ఫిబ్రవరి 16 నుంచి జార్ఖండ్ ఆడబోయే చివరి రంజీ ట్రోఫీ లీగ్ మ్యాచ్‌లో ఇషాన్ బరిలోకి దిగాల్సిందేనని బీసీసీఐ ఆదేశించినట్లు కూడా తెలుస్తోంది. మరి ఇప్పటికైనా అతడు తన ప్రవర్తనను మార్చుకుని జార్ఖండ్ ఆడే చివరి మ్యాచ్‌లో పాల్గొంటాడా లేదా అనేది చూడాలి. బీసీసీఐ తాజా నిర్ణయంతో ఇషాన్ కిషన్‌తో పాటు హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, దీపక్ చాహర్, శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లు కూడా ఇక రంజీల్లో తప్పకుండా ఆడాల్సిందే.
రాజ్ కోట్ టెస్ట్ - అలా చేయకపోతే ఇక భరత్‌కు కష్టమే
సొంతగడ్డపై అరుదైన రికార్డు - టీ20ల్లో 12 వేల పరుగుల మైల్స్టోన్ దాటిన వార్నర్