IPL 2024 Second Schedule: 2024 ఐపీఎల్ టోర్నీ నిర్వహణ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో లోక్‌సభ ఎన్నికల (General Elections India) సందడి నెలకొన్న నేపథ్యంలో 2024 ఐపీఎల్ రెండో విడత మ్యాచ్‌లను దుబాయ్‌కు తరలించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే 22 మ్యాచ్‌లతో తొలి విడత షెడ్యూల్‌ను బోర్డు ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో మార్చి 22న చెన్నై- బెంగళూరు మధ్య మ్యాచ్‌తో ఈ సీజన్ ప్రారంభం కానుంది.
ఇక సార్వత్రిక ఎన్నికల తేదీలు వెలువడిన తర్వాత మిగతా మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ప్రకటిస్తామని బోర్డు ఇదివరకే తెలిపింది. ఈ మ్యాచ్‌లను కూడా భారత్‌లోనే నిర్వహించాలని తొలుత భావించినప్పటికీ, ఎన్నికల వేళ భద్రతా కారణాల దృశ్య టోర్నీని దుబాయ్ (United Arab Emirates)కి షిఫ్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. కానీ, ఈ విషయంపై బీసీసీఐ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం శనివారం (మార్చి 16) మధ్యాహ్నం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది. ఈ ఎన్నికలను ఈసీ పలు విడతల వారిగా నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బోర్డు మ్యాచ్‌ల వేదికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోనుందోనని ఆసక్తిగా మారింది. కానీ, బీసీసీఐ భారత్‌లోనే ఐపీఎల్ నిర్వహించాలనే ఆలోచన మార్చుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
దీనిపై నేడో రేపో ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక మైదానంలో లైవ్ మ్యాచ్ చూడాలనుకున్న భారత క్రికెట్ ఫ్యాన్స్‌కు ఇది బ్యాడ్‌న్యూస్ అనే చెప్పాలి. అయితే గతంలోనూ బీసీసీఐ 2009, 2014 ఎన్నికల సమయంలో టోర్నీని సౌతాఫ్రితా, దుబాయ్‌లో నిర్వహించింది. కానీ, 2019లో మాత్రం పూర్తి టోర్నీనీ విజయవంతంగా భారత్‌లోనే నిర్వహించింది.
పాస్‌పోర్టులు తీసుకుంటున్న ఫ్రాంచైజీలు: ఐపీఎల్ టోర్నీ వేదిక మారనున్నట్లు కథనాలు వస్తున్న నేపథ్యంలో ఆయా ఫ్రాంచైజీలు ప్లేయర్ల పాస్‌పోర్టులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పాస్‌పోర్టు కాలపరిమితి (Expiry Date)కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.