IPL 2024 RCB VS MI : వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో బెంగళూరుపై ముంబయి ఘన విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 196 పరుగుల లక్ష్యాన్ని విధ్వంసకర బ్యాటింగ్‌తో మరో 27 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఫలితంగా ఓటమి చెందడంతో బెంగళూరు జట్టు తీవ్ర నిరాశకు గురైంది. మ్యాచ్ అనంతరం బెంగళూరు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ మాటల్లోనూ అది కనిపించింది.
"టాస్ ఓడిపోవడం నుంచి బ్యాటింగ్, బౌలింగ్‌లో ఏదీ మాకు కలిసిరాలేదు. మా ఓటమిలో మంచు కీలకంగా వ్యవహరించింది. మంచు కురుస్తున్న వేళ బౌలింగ్ చేయడం చాలా కష్టం. టాస్ గెలిచి ఉంటే ఫలితం ఇంకోలా ఉండేది. 250 పరుగులు చేయాల్సిన పిచ్‌పై 196 పరుగులు మాత్రమే చేయడంతో ఘోర పరాజయం తప్పలేదు. ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టం. మంచు కూడా మా అవకాశాలను దెబ్బతీసింది. నేను, రజత్ పటీదార్ మంచి భాగస్వామ్యం నెలకొల్పినా బుమ్రా మమ్మల్ని దారుణంగా దెబ్బతీశాడు. మేం మంచి భాగస్వామ్యం నెలకొల్పినా ముంబయి బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. తీవ్ర ఒత్తిడిలోనూ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. అది మరోసారి నిరూపితం అయింది. మలింగా మార్గనిర్దేశంలో బుమ్రా మరింత రాటుదేలాడు. బుమ్రా లాంటి బౌలర్ మా జట్టులో ఉంటే బాగుండేది. మా బౌలింగ్ బలహీనమనే విషయం తెలిసిందే. భారీ స్కోర్లు చేస్తేనే విజయాలు అందుకోగలుగుతాం" అని మ్యాచ్ అనంతరం బెంగళూరు కెప్టెన్ పేర్కొన్నాడు.
వరుసగా రెండో విజయం సాధించండపై ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్యా సంతోషం వ్యక్తం చేశాడు. బుమ్రా లాంటి బౌలర్ తమ జట్టులో ఉండడం చాలా అదృష్టమని అన్నాడు. "విజయం ఎప్పుడూ బాగానే ఉంటుంది. బుమ్రా మా వైపు ఉండడం చాలా అదృష్టం. బుమ్రా తన పనిని తాను సమర్థంగా పూర్తి చేస్తాడు. ఇప్పుడు అదే పని చేశాడు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో మేం గెలిచిన విధానం చాలా ఆకట్టుకుంది. రోహిత్ శర్మ- ఇషాన్ కిషన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. రోహిత్, ఇషాన్ వేసిన పునాదిపై లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించాం. జట్టుకు ఏం కావాలో ఆటగాళ్లందరికీ తెలుసు" అని హార్దిక్ పాండ్యా మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించాడు.
తన బౌలింగ్ ప్రదర్శనపై పేస్ స్టార్ బుమ్రా హర్షం వ్యక్తం చేశాడు. "మ్యాచ్ ఫలితం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. ప్రతీసారి నేను ఐదు వికెట్లు తీసుకోవాలని అనుకున్నానని చెప్పను. ఈ ఫార్మాట్‌లో బౌలింగ్ చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి బౌలర్లు విభిన్న నైపుణ్యాలను కలిగి ఉండాలి. బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ప్రతి ఒక్కరూ రిసెర్చ్ చేస్తున్నారు. కాబట్టి బౌలర్లు విభిన్న నైపుణ్యాలను కలిగి ఉండాలి. బౌలర్లకు కూడా చెడ్డ రోజులు వస్తాయి. అలా చెడ్డ రోజులు వచ్చినప్పుడు మనం గతంలో బాగా బౌలింగ్ చేసిన వీడియోలు చూడాలి. నేను అదే పని చేస్తాను. నెట్స్‌లో భారీ సిక్సర్లు కొట్టే బ్యాటర్లకు బౌలింగ్ చేయాలి. ఆ ఒత్తిడిని ఎలా అధిగమిస్తున్నారో తెలుసుకోవాలి. మ్యాచ్‌లో ఆ ఒత్తిడిని ఎదుర్కొన్నప్పుడు మనకు సమాధానాలు ఉంటాయి. నేను కూడా చాలా రిసెర్చ్ చేసి బ్యాటర్ బలం ఏంటో బలహీనత ఏంటో తెలుసుకుంటాను." అని మ్యాచ్ అనంతరం బుమ్రా అన్నాడు.
'వరల్డ్ కప్ కోసమే కదా ఇదంతా' - దినేశ్‌ను టీజ్ చేసిన రోహిత్ శర్మ! - IPL 2024 MI VS RCB
ఆర్సీబీపై విజయం - బుమ్రా ఖాతాలోకి పలు రికార్డులు - IPL 2024 RCB VS Mumbai Indians