IPL 2024 Pant Fitness : ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి మరో 12 రోజులు ఉండగా దిల్లీ క్యాపిటల్స్‌కు శుభవార్త అందింది. ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్‌కు నేషనల్ క్రికెట్ అకాడమీ క్లియరెన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు తాజాగా ఎన్‌సీఏ ఇచ్చిన ఎన్‌ఓసీతో ఐపీఎల్ 2024 సీజన్ ఆడేందుకు పంత్‌కు లైన్ క్లియర్ అయినట్టవుతుంది.
ఇకపోతే గత కొద్ది రోజులుగా పంత్ దిల్లీ క్యాపిటల్స్ క్యాంప్‌లో ప్రాక్టీస్ బాగానే చేస్తున్నాడు. అతడి ఫిజికల్ ఫిట్‌నెస్ కూడా మళ్లీ మనుపటి తరహాలో ఉన్నట్లు అనిపించింది. అతడు భారీ షాట్లు కూడా ఆడాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొట్టాయి. కానీ ఎన్‌సీఏ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోవడం వల్ల దిల్లీ క్యాపిటల్స్ జట్టు పంత్ పేరును టీమ్‌లో చేర్చలేదు. అయితే ఇప్పుడు తాజాగా సీజన్లో పంత్ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా మాత్రమే అందుబాటులో ఉంటాడని ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వికెట్ కీపింగ్ మాత్రం అనుమానమనే అని అంటున్నాయి.
పంత్‌కు ఆసీస్ మాజీ కీలక సూచన!
అయితే పంత్ దేశవాళీ క్రికెట్‌లో తన ఫామ్ నిరూపించుకున్న తర్వాతే జాతీయ జట్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉండాలని ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ అతడికి సలహా ఇచ్చాడు. నేరుగా అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వటం వల్ల మరింత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాడు.
"ఇప్పటికప్పుడే రిషభ్ పంత్‌ను తీసుకోవాల్సిన అవసరం లేదు. ధ్రువ్ జురెల్‌కు ఛాన్స్ ఇవ్వాలి. పంత్‌ను ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాలని సజెస్ట్ చేయాలి. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆడితే ఫామ్ అందుకోవడానికి అవకాశం ఉంటుంది. బ్యాటింగ్ పరంగా పంత్ అద్భుతంగా రాణించగలడనే నమ్మకం నాకుంది. ప్రమాదానికి ముందు ఎలాంటి దూకుడు ప్రదర్శించాడో అలానే ఆడగలడు. కీపింగ్ విషయంలో కాస్త జాగ్రత్త ప్రదర్శించాలి. వికెట్ల వెనుక ఉండటం చాలా కష్టం. అందుకోసమే దేశవాళీలో ఆడాలని అంటున్నా. పంత్ టెస్టుల్లో తప్పకుండా తిరిగి అడుగు పెడతాడు" అని బ్రాడ్ హాగ్ తెలిపాడు.