Tendulkar Colleague Turns Businessman : స్పోర్ట్స్ ప్లేయర్ల కెరీర్ చాలా తక్కువ కాలమే ఉంటుంది. ఎక్కువ పోటీ, భారీ అంచనాలు ఉండే క్రికెట్‌లో సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం చాలా తక్కువ మందికే ఉంటుంది. 90లలో క్రికెట్ చూస్తూ పెరిగిన వారికి 'జతిన్ పరంజ్‌పే' పేరు గుర్తు ఉండే ఉంటుంది. అతడి కెరీర్ చాలా చిన్నదే అయినప్పటికీ, గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. కెనడాలోని టొరంటోలో జరిగిన సహారా కప్‌లో పాకిస్థాన్‌పై పరంజ్‌పే 23 పరుగుల మెమరబుల్ ఇన్నింగ్స్‌తో పాపులర్ అయ్యాడు.
దురదృష్టవశాత్తూ, ఓ మ్యాచ్ ఆడుతుండగా చీలమండ గాయం కారణంగా అతడు స్వదేశానికి తిరిగి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత కొన్ని మ్యాచ్‌లకే అతడి అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసింది. సచిన్ తెందూల్కర్, సౌరవ్ గంగూలీ వంటి క్రికెట్ దిగ్గజాలతో కలిసి ఆడిన పరంజ్‌పే, ఆ తర్వాత విజయవంతమైన వ్యాపారవేత్తగా మారారు.
వ్యాపారవేత్తగా మారిన పరంజ్‌పే
చీలమండ గాయం కారణంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత, జతిన్ పరంజ్‌పే స్పోర్ట్స్ వన్ ఇండియాతో తన వ్యాపారవేత్తగా జర్నీ ప్రారంభించాడు. నైకీ (NIKE) అతడి సామర్థ్యాన్ని చూసి మరింత అభివృద్ధి కోసం యూరప్‌కు పంపింది. దీంతో పరంజ్‌పే కెరీర్ కీలక మలుపు తీసుకుంది.
2017లో పరంజ్‌పే ఖేలోమోర్ పేరిట ముంబయిలో వ్యాపారాన్ని ప్రారంభించాడు. డ్రీమ్ 11, అశ్విన్ దామెరా వంటి పెట్టుబడిదారుల మద్దతుతో, ఖేలోమోర్ స్పోర్ట్స్ కోచ్‌లు, అకాడమీలను బుక్ చేసుకోవడానికి ఆన్‌లైన్ సర్వీసులను అందిస్తోంది. ఇది టోర్నమెంట్‌లను కూడా నిర్వహిస్తుంది. ఈ ప్లాట్‌ఫామ్ పిల్లలు, విద్యార్థులు, ప్రొఫెషనల్స్ సహా అన్ని వయస్సుల, నేపథ్యాల ప్రజలకు అందుబాటులో ఉంది. భారతదేశంలోని ప్రధాన నగరాల్లో పని చేస్తోంది.
వ్యక్తిగత జీవితం
జతిన్ పరంజ్‌పే బాలీవుడ్ నటి సోనాలి బింద్రే సోదరిని గాంధాలీ బింద్రేని వివాహం చేసుకున్నాడు. స్పోర్ట్స్ కోచ్‌గా, అకాడమీ అగ్రిగేటర్‌గా పని చేస్తూ, జతిన్ బిజినెస్‌కి ఆమె సపోర్ట్ చేస్తోంది. జతిన్ తండ్రి, వాసూ పరంజ్‌పే 1960లలో మాజీ రంజీ ట్రోఫీ ఆటగాడు. జాతీయ క్రికెట్ అకాడమీలో కోచ్. క్రికెట్, కోచింగ్‌పై తన తండ్రికి ఉన్న ప్రేమతోనే జతిన్ క్రికెట్, స్పోర్ట్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టాడు.
సచిన్‌ని వెనక్కి నెట్టిన జతిన్
1972లో జన్మించిన జతిన్ పరంజ్‌పే, ప్రముఖ సచిన్‌తో కలిసి క్రికెట్ ఆడుతూ పెరిగాడు. అతడు 1986-87 సీజన్‌లో సచిన్‌ని వెనక్కినెట్టి బాంబే క్రికెట్ అసోసియేషన్ నుంచి జూనియర్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. రంజీ ట్రోఫీలో జతిన్ విజయవంతమైన కెరీర్ 1991-92 సీజన్‌లో ప్రారంభమైంది. గొప్ప ప్రతిభ, అంకిత భావాన్ని కనబరిచాడు. అతని కృషితో 1998లో భారత జాతీయ క్రికెట్ జట్టులో అవకాశం వచ్చింది. జతిన్ బీసీసీఐ సెలెక్టర్‌గా కూడా పనిచేశాడు.