India Lost Match Against Australia in T20 : మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో భారత్ చరిత్ర పునరావృతమైంది. ఈసారి చరిత్ర తిరిగి రాయాలి అనుకున్నా కానీ పరిస్థితి అనుకూలించలేదు. ఈసారి భారత్ సెమీస్ చేరాలంటే ఆస్ట్రేలియా జట్టును కచ్చితంగా ఓడించాల్సిన పరిస్థితుల్లో రంగంలోకి దిగిన హర్మన్‌ప్రీత్ సేన గట్టిగానే పోరాడినా విజయం మాత్రం దక్కలేదు. బౌలర్లు ఉత్తమ ప్రదర్శన కనబరిచినా, బ్యాటింగ్‌లో కెప్టెన్ గొప్ప ఇన్నింగ్స్ ఆడినా, స్కోర్ బోర్డులో దీప్తి శర్మ కూడా ఓ చేయి వేసినా, ఆశల్లేని స్థితి నుంచి విజయానికి చేరువగా వెళ్లిందే తప్ప గెలుపొందలేకపోయింది. 19వ ఓవర్లో 14 పరుగులొచ్చాయి. అవే 14 పరుగులు చివరి ఓవర్లోనూ సాధిస్తే మనమ్మాయిలదే విజయం. కానీ ఆ ఓవర్లో 4 పరుగులే చేసి 4 వికెట్లు కోల్పోయిన భారత్ ఓటమి మూటగట్టుకుని సెమీస్ అవకాశాలను మరింత కష్టతరం చేసుకుంది. ఇక హర్మన్‌ప్రీత్ సేన సెమీస్ చేరుతుందా లేదా అన్నది పాకిస్థాన్ చేతుల్లోనే ఉంది.
ఇటు పాండ్య, అటు రాధ- ఒకేరోజు రెండు క్యాచ్‌లు- టీమ్ఇండియా క్రేజీ ఫీల్డింగ్
ఛేదనలో భారత్ ఆట ఆసీస్ ఇన్నింగ్స్‌కు భిన్నంగా సాగింది. ఓపెనర్ షెఫాలీ వర్మ 13 బంతుల్లో 20 రన్స్ చేసింది. 3.2 ఓవర్లలో 26/0 తో భారత్ లక్ష్యం దిశగా దూసుకెళ్తున్నట్లు కనిపించింది. కానీ ఉన్నట్టుండి ఇన్నింగ్స్ కుదుపునకు లోనైంది. ఆరంభం నుంచి నెమ్మదిగా ఆడిన మరో ఓపెనర్ స్మృతి మంధాన 12 బంతుల్లో 6 రన్స్ చేయగా, స్పిన్నర్ మోలనూ ఆమెను ఎల్బీగా ఔట్ చేసింది. ఆ వెంటనే షెఫాలీ కూడా ఔటైపోయింది. ఉన్నంతసేపు ధాటిగా ఆడిన జెమీమా (16; 12 బంతుల్లో) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. దీంతో భారత్ 6.5 ఓవర్లకు 47/3తో ఇబ్బందుల్లో పడింది.
ఈ స్థితిలో దీప్తిశర్మ (29)తో కలిసి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వికెట్లు పడకుండా ఆపింది. ఈ జంట షాట్లకు పోకుండా సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్కోరు పెంచడంతో టీమ్‌ఇండియా 14 ఓవర్లకు 90/3తో కోలుకున్నట్లు కనిపించింది. కానీ అప్పటికే సమీకరణం (36 బంతుల్లో 62) క్లిష్టంగా మారింది. షాట్లు కొట్టే క్రమంలో దీప్తి వెనుదిరగడంతో భారత్‌పై ఒత్తిడి ఇంకా పెరిగింది. చివరి మూడు ఓవర్లలో 40 పరుగులు అవసరమైన స్థితిలో హర్మన్‌ప్రీత్ బ్యాట్ ఝుళిపించింది. దీంతో రెండు ఓవర్లలో (18, 19) 26 పరుగులు లభించడంతో చివరి ఓవర్లో భారత్‌కు 14 పరుగులు అవసరమయ్యాయి. కానీ ఆఖరి ఓవర్ ఫస్ట్ బాల్‌కి హర్మన్‌ప్రీత్ సింగిల్ తీయగా, తర్వాత పూజ (9), అరుంధతి, శ్రేయాంక, రాధ వరుసగా అవుట్ కావడంతో భారత్ పనైపోయింది. ఈ ఓటమితో భారత్ సెమీస్ ఆశలు మరింత సంక్లిష్టమయ్యాయి.
మహిళల ప్రపంచకప్ 2024 - లంకపై భారత్ విజయం
బోర్డర్ గావస్కర్ ట్రోఫీ: రోహిత్ దూరమైతే కెప్టెన్‌గా ఛాన్స్ ఎవరికో?