IND VS ENG Test Series Jaiswal Records : ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఎవరి నోట విన్నా వినిపించే పేరు యశస్వి జైశ్వాల్. ఎందుకంటే ఈ యువ సంచలనం మేటి బౌలర్లను అవలోకగా ఎదుర్కొంటూ పరుగుల వరద పారిస్తున్నారు. ఇప్పటికే ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లో రెండు ద్విశతకాలతో మైదానాన్ని హోరెత్తించాడు. ఇంకా చెప్పాలంటే ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ లాంటి సూపర్ స్టార్ లేని లోటును భర్తీ చేయడమే కాదు, అతడి తర్వాత అంతటి స్థాయిని అందుకోగల దమ్మున్న బ్యాటర్‌గా నిలిచాడు.
పిచ్ ఎలా ఉన్నా ధనాధన్ బాదుడే : 7 టెస్టులు, 861 పరుగులు, 71.75 యావరేజ్, రెండు ద్విశతకాలు, ఒక శతకం, రెండు అర్ధ సెంచరీలు. ఈ గణాంకాల ఆధారంగానే చెప్పొచ్చు యశస్వి టెస్టు కెరీర్ ఎంత గొప్పగా ఆరంభమైందో. అయితే ఇదంతా అతడు అనుకూల పరిస్థితుల్లో చేసిన పరుగులేమీ కావు.
అసలు అతడి ఎంట్రీ పేస్ పిచ్‌లకు నెలవైన వెస్టిండీస్‌లో జరిగింది. ఆ జట్టులో ఒకప్పటిలా భీకర బౌలర్లు లేరు. కానీ అతడు అరంగేట్రం విదేశీ గడ్డపై, అది కూడా పేస్‌కు అనుకూలించే పిచ్‌పైనా తొలి ఇన్నింగ్స్‌లోనే 171 పరుగులు సాధించడం మాములు విషయం కాదనే చెప్పాలి.
ప్రస్తుతం ఇంగ్లాండ్ లాంటి బడా జట్టుపై కూడా వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ రెండు భారీ డబుల్ సెంచరీలు సాధించడం ఎంతో పెద్ద గొప్ప విషయమనే చెప్పాలి. ఎందుకంటే ఈ సిరీస్‌లో అతడికి దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. పిచ్ ఎలా ఉన్నా పేస్, స్పిన్ అని తేడా లేకుండా ఎలాంటి బౌలర్‌నైనా అలవోకగా ఎదుర్కొంటూ ధనాధన్ ఇన్నింగ్స్ ఆడేస్తున్నాడు. అతడు ఆడే షాట్లు కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి. అండర్సన్ లాంటి దిగ్గజాన్నే గల్లీ బౌలర్‌గా పరిగణించాడేమో. రాజ్‌కోట్ టెస్ట్‌లో ఒకే ఓవర్లో మూడు కళ్లు చెదిరే సిక్సర్లు బాదేశాడు.
ఆషామాషీ కాదు : టెస్టుల్లో ఓపెనింగ్ ఆడటమంటే అంత ఈజీ కాదు. పిచ్, పరిస్థితులు ఎలా ఉంటాయనేది తెలీకుండా క్రీజులోకి దిగి కొత్త బంతి బౌలర్లను ఎదుర్కోవడం సీనియర్లకే సవాల్‌గా ఉంటుంది. అలాంటిది ఈ మధ్యే ఎంట్రీ ఇచ్చిన యశస్వి మాత్రం ఎంతో పరిణతితో ఎదుర్కొంటున్నాడు. అవసరానికి తగ్గట్లు డిఫెన్స్ ఆడుతూన్నాడు. క్రీజులో కుదురుకున్నాక చక్కటి స్ట్రోక్‌ప్లేతో మెప్పిస్తున్నాడు.
ఒక మైలురాయి అందుకోగానే అక్కడితో ఆగట్లేదు. 50ని 100గా మలిస్తే, 100ను 150 చేస్తున్నాడు. 150ను 200గా మలిచేందుకు మరింత పట్టుదల ప్రదర్శిస్తున్నాడు. రాజ్‌కోట్‌లో మూడో రోజు శతకం బాది వెన్ను నొప్పితో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. కానీ తర్వాతి రోజే తిరిగి వచ్చి ద్విశతకాన్ని బాదేశాడు. టీ20 యుగంలోనూ ఇంత ఓపికతో సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడేవాళ్లు అరుదుగానే ఉంటారు. అందుకే యశస్వి ప్రత్యేకంగా నిలుస్తున్నాడు. బజ్‌బాల్ వ్యూహంతో అన్ని జట్లనూ దెబ్బ కొట్టే ఇంగ్లాండ్ ఈ సిరీస్‌లో మాత్రం యశస్విని ఎదుర్కోలేకపోతోంది.
యశస్వి నేపథ్యం : అతడు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఒక పేద కుటుంబంలో జన్మించాడు. తన్నులు తిని మరీ బలవంతంగా తన తండ్రిని ఒప్పించి ముంబయికి వచ్చిన జైశ్వాల్ డబ్బులు లేక పడ్డ అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఎంతో కష్టపడ్డాడు. ఐపీఎల్‌లో పేరు సంపాదించినప్పటికీ ఆ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ వరకు చేరుకోలేకపోయిన వారు, ఒకవేళ వచ్చినా నిలకడ లేక చోటు కోల్పోయిన వారు ఎందరో. కానీ యశస్వి అలా కాదు. నిరంతరం కష్టపడుతూనే ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్‌తో ఓ మ్యాచ్ ఆడేందుకు జైపుర్ వెళ్లిన ముంబయి ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ - యశస్వి మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు చేసిన సాధన చూసి ఆశ్చర్యపోయాడట.అలా చిన్నతనం నుంచి కష్టాలకు ఎదురొడ్డి లక్ష్య సాధన కోసం అడుగులు వేయడంలో చూపించిన పోరాట స్ఫూర్తే ఇప్పుడు యశస్వి ఆటలోనూ ప్రతిఫలిస్తోంది.
సౌత్‌లో ఆ ఇద్దరు తెలుగు హీరోలే నా ఫేవరెట్: షమీ
స్టేట్ ఐకాన్‌గా శుభ్‌మన్- లోక్‌సభ ఎన్నికల్లో గిల్- పంజాబ్‌లో టార్గెట్ అదే!