MS Dhoni losses his cool : ధోనీకి మిస్టర్ కూల్ అనే ఇమేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. మైదానంలో ఎలాంటి పరిస్థితులో ఉన్నా తన ప్రశాంత స్వభావంతో ప్రణాళికను రచిస్తూ మ్యాచ్‌ను గెలిచేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఎన్నో మ్యాచ్‌లలోనూ ఇలానే విజయం సాధించాడు. అయితే తాజాగా సీఎస్కే టీమ్మేట్ సుబ్రమనియణ్ బద్రినాథ్ మహీ గురించి ఎవరికీ తెలియని ఓ విషయాన్ని బయట పెట్టాడు. మహీ తన ట్రూ ఎమేషన్స్ను బయటపెట్టకుండా, మ్యాచ్ కోసం కామ్‌గా ఉంటాడని అన్నాడు. ఓ సారి డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నాడు. అప్పుడు ధోనీ తన సహనాన్ని కోల్పోయాడని పేర్కొన్నాడు.
ఐపీఎల్ ప్రారంభ ఎడిషన్‌లో చిదంబరం స్టేడియం వేదికగా ఆర్సీబీ - సీఎస్కే మధ్య ఓ లో స్క్రోరింగ్ మ్యాచ్ జరిగింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీని 126 పరుగులు, 8 వికెట్లకు కట్టడి చేసింది సీఎస్కే. ఆల్బీ మార్కెల్ నాలుగు వికెట్లు తీసి బెంగళూరు జట్టును అడ్డుకున్నాడు. అయితే ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కేను ఆర్సీబీ కేవలం 111 పరుగులు, 8 వికెట్లకు పరిమితం చేసింది. దీంతో ఈ మ్యాచ్‌లో సీఎస్కే ఓడిపోయింది.
ఈ మ్యాచ్ ఓడిపోయాక ధోనీ తన సహనాన్ని కోల్పోయాడని పేర్కొన్నాడు సుబ్రమనియణ్. అప్పుడు అనిల్ కుంబ్లే తనను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపిన సందర్భంలో ఇలా జరిగిందని చెప్పుకొచ్చాడు.
"అనిల్ కుంబ్లే బౌలింగ్‌లో నేను ఎల్బీడ్ల్యూగా వెనుదిరిగాను. అప్పుడు నేను డ్రెస్సింగ్ రూమ్‌లో లోపలికి వెళ్లి నిలబడ్డాను. అప్పుడు ధోనీ కూడా లోపలికి వస్తున్నాడు. అక్కడే చిన్న బాటిల్ ఉంది. దాన్ని మహీ పార్క్ బయటకు పడేలా బలంగా తన్నాడు. ఎవరూ ఆ దృశ్యాన్ని చూడలేదు. ఆ సంఘటన జరిగినప్పుడు మేం ఎవ్వరూ కూడా అతడికి ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వలేకపోయాం. దాదాపుగా అతడికి దూరంగానే ఉండేందుకు ప్రయత్నించాం. అప్పుడు మహీ కూడా దాని గురించి ఏమీ మాతో చర్చించలేదు. ఏదేమైనా మహీ కూడా మనిషే. అందుకే అతడు కూడా తన సహనాన్ని కోల్పోయాడు. అయితే ఇది మైదానంలో జరగలేదు. ఎందుకంటే తాను సహనం కోల్పోయినట్టు ప్రత్యర్థి జట్టుకు తెలియకూడదు." అని చెప్పుకొచ్చాడు.