Bengaluru Water Crisis IPL Match : బెంగళూరులో తీవ్ర నీటి సంక్షోభం నెలకొన్న తరుణంలో ఈ ప్రభావం ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణపై కూడా పడే అవకాశాలు ఉన్నాయి. నీటి ఎద్దడి ఉన్న సమయంలో చిన్నస్వామి స్టేడియంకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయడంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) నోటీసులు జారీ చేసింది. IPL మ్యాచ్‌లకు వినియోగిస్తున్న నీటి వివరాలను నాలుగు వారాల్లోగా అందించాలని తాజాగా నోటీసులు ఇచ్చింది. మే 2వ తేదీలోగా స్టేడియంలో వినియోగించే నీటి వినియోగానికి సంబంధించిన వివరాలను అందించాలని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA), బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (BWSSB), కర్ణాటక స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(KSPCB)ను ఆదేశించింది. ఎన్జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ ప్రకాశ్ శ్రీవాస్తవ, డాక్టర్ ఏ సెంథిల్ వేల్ (ఎక్స్‌పర్ట్ మెంబర్) సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేశారు.
మ్యాచ్‌లకు ఇబ్బంది ఉండదు: KSCA సీఈఓ
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన నోటీసులపై కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ స్పందించింది. "నోటీసును పరిశీలిస్తున్నాం. స్టేడియం NGT నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటుంది. మ్యాచ్‌ల నిర్వహణలో ఎలాంటి అవాంతరాలు ఉండకుండా, షెడ్యూల్ మేరకు జరుగుతాయని విశ్వసిస్తున్నాం." అని సీఈవో శుభేందు ఘోష్ చెప్పారు. ఒక్కో మ్యాచ్‌కు దాదాపు 15,000 లీటర్ల నీరు అవసరమని KSCA అంచనా వేశారు. ఈ నీటిని ఇన్-హౌస్ STP ప్లాంట్ నుంచి ఉత్పత్తి చేయవచ్చని ఘోష్ చెబుతున్నారు.
కబ్బన్ పార్క్ నుంచి నీటి సరఫరా!
KSCA అభ్యర్థన మేరకు స్టేడియం సమీపంలోని కబ్బన్ పార్క్ నుంచి శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసేందుకు BWSSB అనుమతించిందనే వార్తలు NGT దృష్టికి వెళ్లాయి. కాగా, పిచ్ లేదా అవుట్‌ఫీల్డ్ వాటర్ వంటి కార్యకలాపాలకు భూగర్భజలాలు లేదా తాగునీటిని ఉపయోగించడం లేదని KSCA అధికారులు చెబుతున్నారు. కర్ణాటక ప్రభుత్వం తోటపని, వాహనాలు కడగడం వంటి ఇతర పనులకు తాగునీటిని ఉపయోగించడంపై ఇప్పటికే కఠినమైన ఆంక్షలు విధించింది.
ఇప్పటికే చిన్నస్వామి స్టేడియంలో మూడు మ్యాచ్‌లు జరిగాయి. ఒక్కో మ్యాచ్‌కు 75,000 లీటర్ల శుద్ధి చేసిన నీటిని వినియోగించినట్లు అంచనా. మరో నాలుగు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ఏప్రిల్ 15న సన్‌రైజర్స్ హైదరాబాద్, మే 4న గుజరాత్ టైటాన్స్, మే 12న ఢిల్లీ క్యాపిటల్స్, మే 18న చెన్నై సూపర్ కింగ్స్, ఆర్సీబీతో తలపడుతాయి.