Australian umpire injured : క్రికెట్‌లో బ్యాటర్లు, బౌలర్లకు గాయాలు అవ్వడం మనం చూస్తూనే ఉంటాం. ఒక్కోసారి ఫీల్డ్ అంపైర్లకు, స్టాండ్స్‌లో కూర్చొన్న ప్రేక్షకులకు ఇలాంటి ఇబ్బందులు తప్పవు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ గాయాల తీవ్రత వల్ల ప్రాణం పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. తాజాగా ఆస్ట్రేలియాలోని దేశవాళీ మ్యాచ్‌లో ఇలాంటి సంఘటనే ఎదురైంది.
ముఖం, కన్న భాగాలపై వాపు - వెస్ట్ ఆస్ట్రేలియన్ సబర్బన్ టర్ఫ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నార్త్ పెర్త్ - వెంబ్లే డిస్ట్రిక్ట్స్ మధ్య థర్డ్ గ్రేడ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లోనే అంపైరింగ్ చేసిన టోనీ డి నోబ్రెగాకు (Tony de Nobrega Injury) తీవ్ర గాయమైంది.
అయితే, టోనీ ముఖానికి తీవ్రంగా గాయాలు అవ్వడంతో అతడి ముఖం అంతా వాచిపోయింది. కన్ను భాగాల వద్ద కూడా తీవ్రంగా వాచిపోయింది. దీంతో అతడు ఆస్పత్రి పాలయ్యాడు. అయితే ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని వైద్యులు తెలిపారు. ఎముకలు ఫ్రాక్చర్ అవ్వలేదని, సర్జరీ కూడా అవసరం లేదని వైద్యులు చెప్పారు. ఈ సంఘటన నాలుగు రోజుల కిందట చోటు చేసుకుంది. కానీ ఇప్పుడీ విషయం బహిర్గతం కావడం వల్ల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడికి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
"గత శనివారం దేశవాళీ మ్యాచ్‌లో సీనియర్ అంపైర్ టోనీ డినోబ్రెగా అంపైరింగ్ చేశారు. అయితే ఈ మ్యాచ్‌లో బ్యాటర్ స్ట్రెయిట్ డ్రైవ్ కొట్టగా, బంతిని అంపైర్ మీదకు దూసుకెళ్లింది. ఆ సమయంలో అతడు బంతి నుంచి తప్పించుకొనేందుకు ప్రయత్నించినా కుదరలేదు. అది నేరుగా అతడి ముఖం మీద తాకింది. దీంతో వెంటనే అతడిని హాస్పిటల్‌కు తరలించారు. అదృష్టవశాత్తూ ఎలాంటి బోన్ ఫ్రాక్చర్ అవ్వలేదు. అతడిని అబ్జర్వేషన్‌లో పెట్టారు. సర్జరీ అవసరం లేదని వైద్యులు తెలిపారు. టోనీ త్వరగా కోలుకుని మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాలని కోరుకుంటున్నాం. మా అంపైరింగ్ టమ్ అంతా నీకు మద్దతుగా ఉంది" అని వెస్ట్ ఆస్ట్రేలియన్ సబర్బన్ టర్ఫ్ క్రికెట్ అసోసియేషన్ (WASTCA) అంపైర్స్ అసోషియేషన్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. అతడి ఫొటోలను కూడా పోస్ట్ చేసింది.
గతంలో (2019) 80 ఏళ్ల అంపైర్ జాన్ విలియమ్స్ కూడా ఇలానే బంతిని తాకడం వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు ఆస్ట్రేలియా క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. అందుకే అంపైర్లకు కూడా రక్షణ కవచాలు ఇవ్వాలని, ప్రమాదాలు, గాయాల బారి నుంచి కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.
టీమ్ ఇండియాను వెంటాడుతోన్న ఆ సమస్య - బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో వాళ్లకు కఠిన పరీక్షే