Ashwin England Series : రాజ్కోఠ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ నుంచి టీమ్ఇండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ వైదొలిగాడు. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుండటం వల్ల అతడు శుక్రవారం మ్యాచ్ ముగిసిన తర్వాత చెన్నైకి పయనమయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ట్విట్టర్ వేదికగా చేసిన ఓ పోస్టులో పేర్కొన్నారు. అశ్విన్ తల్లి తొందరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
మరోవైపు ఇలాంటి పరిస్థితుల్లో మీడియా, అభిమానులు అశ్విన్‌తో పాటు అతడి ఫ్యామిలీ మెంబర్స్ ప్రైవసీకి భంగం కలిగించకుండా ఉండాలని బీసీసీఐ బోర్డు పేర్కొంది. ప్లేయర్లతో పాటు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం, శ్రేయస్సు తమకు ఎంతో ముఖ్యమని బీసీసీఐ తెలిపింది. ఈ కష్టకాలంలో అశ్విన్‌కు అవసరమైన సహాయాన్ని బోర్డు, టీమ్‌ఇండియా జట్టు అందిస్తుందంటూ పేర్కొంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే - మూడో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగుల భారీ స్కోర్‌ను నమోదు చేసి ఆలౌట్ అయింది. దీంతో లక్ష్య చేధన కోసం రెండో రోజు బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టు 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. బెన్ డకెట్(133*) సెంచరీ బాదాడు. ఇక భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్ తీశారు.
ఇదే వేదికగా అశ్విన్ తన ఖాతాలో ఓ అరుదైన రికార్డు వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఒక వికెట్ తీసి 500 వికెట్ల క్లబ్‌లో చేరాడు. అలా భారత్ టెస్టు క్రికెట్‌లో ఈ రికార్డును సొంతం చేసుకున్న సాధించిన రెండో బౌలర్‌గా చరిత్రకెక్కాడు. మూడో టెస్టులో అశ్విన్ 37 పరుగులు చేసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
మరోవైపు రానున్న మ్యాచ్‌లో బౌలర్లు వేగం పుంజుకొని ప్రత్యర్థి జట్టును ఎంత తొందరగా ఆలౌట్ చేస్తేనే అంత మేలు అంటూ క్రికెట్ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే ఇలాంటి సమయంలో మ్యాచ్‌లకు అశ్విన్ దూరం కావడం అనేది జట్టుకు పెద్దదెబ్బే. ప్రస్తుతం జట్టులో పూర్తిస్థాయి బౌలర్లు నలుగురే ఉన్నారు. దీంతో వీరిపైనే భారం పడనుంది.