1983 To 2024 Team India History: ఉత్కంఠ సాగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను మట్టికరిపించి టీమ్ ఇండియా విజయదుందుబి మోగించింది. దీంతో టీ20 ప్రపంచకప్ భారత్ వశమైంది. అయితే ఇప్పటివరకు టీమ్ఇండియా ఎన్ని ఐసీసీ వన్డే, టీ 20 వరల్డ్ కప్‌లను గెలుచుకుంది? అప్పుడు టీమ్ఇండియాకు సారథ్యం వహించిందెవరు? వంటి విషయాలు ఈ స్టోరీలు తెలుసుకుందాం.
టీమ్ఇండియా ఇప్పటివరకు రెండేసి వన్డే, టీ 20 వరల్డ్‌కప్ ట్రోఫీలను గెలుచుకుంది. 1983లో తొలి ఐసీసీ ట్రోఫీని ముద్దాడిన టీమ్ఇండియా తాజా విజయంతో నాలుగో వరల్డ్‌కప్ టైటిల్ ఖాతాలో వేసుకుంది. అప్పటి సారథి కపిల్ దేవ్ భారత్‌కు తొలి టైటిల్ అందించగా, ఇప్పటి కెప్టెన్ రోహిత్ శర్మ టీమ్ఇండియా 11ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. ఈ 41ఏళ్లలో టీమ్ఇండియా నెగ్గిన ఐసీసీ ట్రోఫీలివే!
It’s coming home 🏆
— Jay Shah (@JayShah) June 29, 2024
JAI HIND🇮🇳@ImRo45 @imVkohli @hardikpandya7 @Jaspritbumrah93 @RishabhPant17 @imjadeja @surya_14kumar @imkuldeep18 @arshdeepsinghh @akshar2026 @IamShivamDube @ybj_19 @yuzi_chahal @IamSanjuSamson @mdsirajofficial @dilip_cc @BCCI || #T20WorldCup || #Champions pic.twitter.com/JzPjNKkU2J
1983 ప్రపంచకప్
భారత క్రికెట్ చరిత్రను మలుపుతిప్పిన ఘనత 1983 వరల్డ్ కప్ విజయానికే దక్కుతుంది. ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అప్పటి టీమ్ఇండియా సారథి కపిల్ దేవ్ జట్టుకు చారిత్రక విజయాన్ని అందించాడు. బలమైన విండీస్ జట్టును మట్టికరిపించి భారత జట్టు కప్పును గెలుచుకుంది. కపిల్ దేవ్ నాయకత్వం, మొహిందర్ అమర్‌నాథ్ అద్భుతమైన ఇన్సింగ్‌తో పాటు, జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శన టీమ్ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ఈ విజయం భారత్ క్రికెట్ పవర్ హౌస్‌గా ఎదగడానికి నాంది పలికింది.
2002 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ
శ్రీలంకలో వేదికగా జరిగిన 2002 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్లో శ్రీలంక, భారత్ తలపడ్డాయి. వర్షం కారణంగా ఫైనల్ రద్దై, రిజర్వ్ డేకు మారింది. ఆ రోజు కూడా వర్షం కురవడం వల్ల మ్యాచ్ రద్దైంది. దీంతో శ్రీలంక, భారత్ జట్లను సంయుక్త విజేతగా ప్రకటించారు అంపైర్లు. 2002 ఛాంపియన్ ట్రోఫీలో సౌరభ్ గంగూలీ సారథ్యంలో డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ అదరగొట్టారు. అలాగే జట్టు విజయంలో బౌలర్లు సైతం కీలక పాత్ర పోషించారు. దీంతో టీమ్ ఇండియా ఛాంపియన్ ట్రోఫీలో సునాయాశంగా ఫైనల్‌కు చేరింది.
2007 టీ20 ప్రపంచకప్ విక్టరీ
దక్షిణాఫ్రికాలో జరిగిన 2007 టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా విజేతగా నిలిచింది. మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ సారథ్యంలో బరిలో దిగిన టీమ్ఇండియా కుర్ర ఆటగాళ్లతో అదరగొట్టింది. ఫైనల్ మ్యాచ్‌లో దాయాది దేశం పాకిస్థాన్‌ను 5 పరుగుల తేడాతో మట్టికరిపించి కప్పు ఎగరేసుకుపోయింది. ఈ టోర్నీలో యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్ అదరగొట్టారు. ఇప్పటి కెప్టెన్ రోహిత్ శర్మ అప్పుటి విన్నింగ్ టీమ్‌లోనూ సభ్యుడిగా ఉన్నాడు.
2011 వన్డే వరల్డ్ కప్ విజయం
2011 వన్డే ప్రపంచకప్‌ను భారత్ కైవసం చేసుకుంది. 1983 తర్వాత భారత్ వన్డే ప్రపంచకప్ గెలవడం ఇది రెండోసారి. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంకను మట్టికరిపించి ట్రోఫీని గెలుచుకుంది భారత్. ఎంఎస్ ధోనీ సారథ్యంలోని బరిలో దిగిన భారత్ అన్ని విభాగాల్లో రాణించింది. గౌతమ్ గంభీర్, కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ ఫైనల్ మ్యాచ్‌లో అదరగొట్టారు. 28 ఏళ్ల వరల్డ్ కప్ ట్రోఫీ నిరీక్షణకు తెరదించుతూ శ్రీలంకపై భారత్ గెలుపొందింది.
2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజయం
2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా భారత్ కైవసం చేసుకుంది. ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో ఇంగ్లాండ్‌పై ఫైనల్లో విజయం సాధించింది. తక్కువ స్కోరు చేసిన భారత్ ప్రత్యర్థి బ్యాటర్లను నిలువరించగలిగింది. టీమ్ఇండియా పేసర్ ఇషాంత్ శర్మ, స్పిన్నర్ రవీంద్ర జడేజా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
2024 టీ20 ప్రపంచ కప్ విజయం
రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు మరో టీ 20 వరల్డ్‌కప్ 2024 జూన్ 29న కైవసం చేసుకుంది. బార్బడోస్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో 11ఏళ్ల ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు తెరదించింది. టీమ్ ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫైనల్ మ్యాచ్‌లో ఔరా అనిపించారు. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా పరాభవం మూటగట్టుకుంది.
రోహిత్ విన్నింగ్ మూమెంట్- తన స్టైల్లో పిచ్‌కు రెస్పెక్ట్ - T20 World Cup 2024