Why Buy Gold On Akshaya Tritiya : వైశాఖ శుద్ధ తదియ రోజున మనం అక్షయ తృతీయగా జరుపుకొంటాం. వాస్తవానికి ప్రాచీనకాలంలో పెద్దగా ప్రాచుర్యం లేని అక్షయ తృతీయ మూడు దశాబ్దాలుగా బాగా ప్రచారంలోకి వచ్చింది. అక్షయ తృతీయ రోజు బంగారం, వెండి వంటి విలువైన వస్తువులు కొంటే అవి అక్షయంగా అంటే తరగకుండా ఉంటాయన్న నమ్మకం ప్రచారంలో ఉంది. అయితే అప్పు చేసి బంగారం, వెండి వంటివి కొంటే అప్పులు కూడా అక్షయంగానే ఉంటాయన్న సంగతి మనం ఇక్కడ మర్చిపోకూడదు.
ఏ పని చేసినా అక్షయ ఫలం
మత్స్య పురాణం అరవై ఐదవ అధ్యాయంలో సాక్షాత్తు ఈశ్వరుడు పార్వతీదేవికి అక్షయ తృతీయ వ్రతం గురించి వివరించినట్లుగా తెలుస్తోంది. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమమైనా, దానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణ ఏదైనా దాని ఫలితము అక్షయమౌతుంది. అలాగే పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే, పాప కార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది. ఈ రోజున అక్షయుడైన విష్ణువు ఆరాధన విశేషంగా జరుగుతుంది కాబట్టి దీనికి అక్షయ తృతీయ అని పేరు.
ఇలా చేస్తే సంపూర్ణ వ్రతఫలం
అక్షతలు అంటే ఏ మాత్రం విరగని, పగుళ్ళు లేని, గట్టిగా ఉన్న బియ్యంతో అక్షింతలను తయారు చేసి విష్ణు భగవానుని పాదములపై ఉంచి, అర్చించి, తరువాత ఆ బియ్యమును చక్కగా మరోసారి ఏరి అందులో కొంత భాగం బ్రాహ్మణులకు దానమిచ్చి, మిగిలిన వాటిని దైవోచ్చిష్టంగా, బ్రాహ్మణోచ్చిష్టంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి అక్షయ తృతీయ వ్రతం చేసిన ఫలం తప్పక కలుగుతుంది.
దానధర్మాలతో అనంత కోటి పుణ్యఫలం
శ్రీ నారద పురాణం ప్రకారం ఈ రోజు చేసే దాన ధర్మాలు అత్యధిక ఫలాన్ని ఇస్తాయని తెలుస్తోంది.
జలదానం: అక్షయ తృతీయ రోజు బాటసారుల దాహార్తి తీర్చే చలివేంద్రాలు ఏర్పాటు చేసి జలదానం చేస్తే కోటి రెట్లు పుణ్యఫలం ఉంటుంది. స్వర్గంలో ఉన్న పితృదేవతలు సంతోషిస్తారు.
అన్నదానం: అన్ని దానాలలో కెల్లా అన్న దానం శ్రేష్ఠం అని పెద్దలు అంటారు. అలాంటిది అక్షయ తృతీయ రోజు చేసే అన్నదానం వలన కలిగే పుణ్యఫలం వెలకట్టలేనిదని శాస్త్రవచనం.
ఛత్రదానం : అక్షయ తృతీయ రోజు ఛత్రదానం అంటే గొడుగు దానం చేసిన వారి వంశంలో ఎవరికీ కూడా దారిద్ర్య బాధలు ఉండవు.
వస్త్ర దానం : అక్షయ తృతీయ రోజు వస్త్ర దానం చేసిన వారికి జీవితంలో అన్న వస్త్రాలకు లోటుండదు.
నారద ఉవాచ : అక్షయ తృతీయ రోజు సాధారణంగా చేసే దానధర్మాలే అక్షయ ఫలితాన్ని ఇస్తుంటే, ఇక గంగా తీరంలో చేసే దానాది ఫలముల గురించి నారదమహర్షి వారు ఇలా వివరించారు.
గంగా తీరంలో దానం సర్వశ్రేష్ఠం : ఎవరైతే అక్షయ తృతీయ రోజు గంగా తీరంలో వస్తువులు, వస్త్రాలు, ధాన్యం వంటివి దానం చేస్తారో వారు బంగారు, రత్నములతో కూడిన విమానంలో తన పితృదేవతలతో కల్ప కోటి సహస్రముల కాలము బ్రహ్మ లోకమున ప్రకాశిస్తారంట. అనంతరం గంగా తీరంలో అత్యంత ధనవంతుడైన బ్రాహ్మణునిగా జన్మించి, అంతమున బ్రహ్మజ్ఞానియై ముక్తిని పొందుతాడు.
గంగాతీరంలో గోదానం స్వర్గప్రాప్తి : అక్షయ తృతీయ రోజు గంగాతీరంలో యధావిధిగా గోదానము చేసినవాడు గోరోమ సంఖ్యలు ఎన్ని ఉన్నాయో అన్ని సంవత్సరాలు స్వర్గలోకంలో విరాజిల్లి, తరువాత భూమి మీద పుట్టి, చక్కని విద్యను, ఐశ్వర్యాన్ని అనుభవించి, అంతమున ముక్తిని పొందుతాడు.
బ్రాహ్మణులకు కపిల గోదానము : అక్షయ తృతీయ రోజు గంగా నది ఒడ్డున వేదవిదుడైన బ్రాహ్మణులకు కపిల గోదానము చేసిన వారికి నరకంలో ఉన్న వారి పితృ దేవతలందరూ స్వర్గలోకాన్ని చేరుతారని శాస్త్ర వచనం.
గంగాతీరంలో భూదానం త్రిలోక ప్రాప్తి : అక్షయ తృతీయ రోజున గంగాతీరంలో భూమిని దానం చేస్తే, ఎంత భూమిని దానం చేసాడో ఆ భూమిలో ఎన్ని ఇసుక రేణువులు ఉంటాయో అన్ని వేల సంవత్సరాల వరకు బ్రహ్మ, విష్ణు, శివ లోకములలో నివసించి తిరిగి భూమి మీద పుట్టి సప్త ద్వీపా అధిపతి అగును అని నారదుల వారు స్వయంగా వరమిచ్చారంట.
అక్షయ తృతీయ నాడు జరిగే ముఖ్య విశేషాలు
- శ్రీకృష్ణుడు ద్రౌపదికి అక్షయ పాత్ర అక్షయ తృతీయ నాడు సమర్పించాడు. ఈ సందర్భంగా ఇప్పటికి మధుర, ద్వారకలో విశేష పూజలు జరుగుతాయి.
- అక్షయ తృతీయ రోజున హిమాలయ సానువుల్లో ఉన్న గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఆరు నెలల తర్వాత తిరిగి తెరుచుకుంటాయి.
- సింహాచలం అప్పన్న ఆలయంలో ఈరోజు అత్యంత వైభవోపేతంగా స్వామివారికి చందనోత్సవం జరుగుతుంది. ఏడాది మొత్తం చందనంతో కప్పబడి ఉన్న స్వామి ఈరోజు తన నిజరూప దర్శనాన్ని భక్తులకు అనుగ్రహిస్తారు.
సంపద పెంచుకోవడం కాదు పంచుకోండి!
అక్షయ తృతీయ వెనుక ఉన్న పురాణం విశేషాలు తెలుసుకున్నారు కదా! నిజానికి అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి కొనాలని ఎక్కడా లేదు. ఇంకా ఈ రోజు దానాలు చేయాలని పురాణాలు చెబుతున్నాయి. అనవసరంగా అప్పులు చేసి అయినా బంగారం కొనాలన్నా ఆలోచన విడిచి పెట్టి మనకు ఉన్నంతలో మన శక్తి కొద్దీ దానం చేయాలి. మన భారతీయ సంస్కృతి సంపదలను నలుగురితో పంచుకోవాలని చెబుతుంది. కానీ, సంపదలను పెంచుకోవాలని ఎక్కడా చెప్పలేదు. మనం కూడా మన శక్తి కొద్దీ ఈ రోజు దానధర్మాలు చేసి అక్షయమైన ఫలాన్ని పొందుదాం. సుఖ సంతోషాలను పొందుదాం.
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
అమావాస్య ముందు ఆరోగ్య సమస్యలా? ఈ 'స్పెషల్' సోమవారం పూజతో అంతా సెట్! - masa shivaratri 2024