How to Give Vayanam in Varalakshmi Vratam: తెలుగు క్యాలెండర్ ప్రకారం.. ఈ ఏడాది ఆగస్టు 16వ తేదీ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం జరుపుకోనున్నారు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షలు కలిగి అష్టైశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు.. సకల శుభాలు కలుగుతాయని చెబుతున్నాయి. అలాగే స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి.. ఇక వరలక్ష్మీ వ్రతంలో పూజ పూర్తైన తర్వాత ముత్తైదువలకు ఇచ్చే వాయనం చాలా ముఖ్యమైనది. అయితే చాలా మంది తమ శక్తి కొలది వాయనం ఇస్తుంటారు. ఇంతకీ.. వాయనంగా ఏమేమి ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి? అనే వివరాలను ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు.
వాయనం ఇవ్వడానికి కావాల్సిన పదార్థాలు:
- పసుపు
- కుంకుమ
- తమలపాకులు
- వక్కలు
- నానబెట్టిన శనగలు
- జాకెట్ ముక్కలు
- గాజులు
- రూపాయి నాణెం
- పూలు
- పండ్లు
- పసుపు కొమ్ము
వాయనం ఇచ్చే పద్ధతి:
- ముందుగా 3 లేదా 5 లేదా 9 లేదా 11 మంది ముత్తైదువులను ఇంటికి పిలవాలి.
- ఆ తర్వాత వారికి కుంకుమ బొట్టు పెట్టి, గంధం పూయాలి. ఆ తర్వాత పాదాలకు నిండుగా పసుపు రాయాలి.
- ఆ తర్వాత మంగళసూత్రాలకు పెట్టుకునేందుకు పసుపు ముద్దను ఇవ్వాలి. పసుపు ముద్ద అంటే పసుపులో కొద్దిగా నీరు కలుపుకుని ముద్దలాగా చేసుకోవాలి.
- ఆ తర్వాత ముత్తైదువుల చేతులకు తోరాలు కట్టాలి.
- ఇక ఇప్పుడు వాయనం అందించాలి. అందుకోసం ఓ ప్లేట్ తీసుకుని అందులో ముందుగానే వాయనం సిద్ధం చేసుకోవాలి. వాయనంలో జాకెట్ ముక్క పెట్టి రెండు తమలపాకులు పెట్టాలి.
- అయితే.. తమలపాకు కాడలు వాయనం ఇచ్చే వారి వైపు ఉండాలి. తమలపాకు చివర్లు వాయనం తీసుకునే వారి వైపు ఉండాలి.
- తమలపాకులో పసుపు, కుంకుమ, 2 వక్కలు, గాజులు, రెండు పండ్లు, పూలు, పసుపు కొమ్ము, రూపాయి నాణెం, నానబెట్టిన శనగలు పెట్టుకోవాలి.
- వీటన్నింటినీ వచ్చిన ముత్తైదువుకు అందించి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. ఆ తర్వాత మీరు చేసుకున్న ప్రసాదాలను కూడా పెట్టవచ్చు.
వాయనం ఇచ్చేటప్పుడు.. "ఇందిరా ప్రతి గృహ్నాతు ఇందిరా వైదదాతిచ
ఇందిరా తారికావాభ్యమ్ ఇందిరాయై నమోనమః.." అనే శ్లోకాన్ని పఠిస్తూ వచ్చిన ముత్తైదువులను వాయనం అందించి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. ఒకవేళ మీరు వాయనం ఇచ్చేవారిలో ఎవరైనా చిన్నవారు ఉంటే వారి ఆశీర్వాదం కోసం అక్షతలు వారి చేతిలో పెట్టి వారి గాజులకు నమస్కారం చేసుకుని ఆ తర్వాత అక్షింతలు తీసుకుని తలపై వేసుకోవాలి.
ఇలా నిండుమనసుతో వాయనం అందిస్తే.. లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని చెబుతున్నారు. ఎందుకంటే.. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. అయితే.. సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి.
NOTE: పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్య నిపుణులు, పురాణాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ఆగస్టు 16నే వరలక్ష్మీ వ్రతం - మొదటి నుంచి చివరి దాకా - ఎలా చేసుకోవాలో మీకు తెలుసా?
శ్రావణ మాసం స్పెషల్ - అమ్మవారికి ఈ నైవేద్యాలు సమర్పించండి! - ప్రిపరేషన్ చాలా సింపుల్!