Teachers Day Sarvepalli Radhakrishnan History In Telugu : డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. భారత తొలి ఉపరాష్ట్రపతిగా, రెండవ రాష్ట్రపతిగా దేశసేవ చేసిన భారతరత్నం సర్వేపల్లి రాధాకృష్ణన్. సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5వ తేదీన తమిళనాడులో తిరుత్తణి గ్రామంలో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు సర్వేపల్లి వీరాస్వామి, సీతమ్మ దంపతులు. రాధాకృష్ణన్ బాల్యమంతా తిరుత్తణి, తిరుపతిలోనే గడిచాయి. తండ్రి స్థానిక జమిందార్ వద్ద సబార్డినేట్ రెవెన్యూ అధికారిగా ఉండటంతో రాధాకృష్ణన్ ప్రాథమిక విద్య తిరుత్తణిలో కేవీ స్కూల్ లో జరిగింది. 1896లో తిరుపతిలోని హెర్మన్స్‌బర్గ్ ఎవాంజిలికల్ లూథరన్ మిషన్ స్కూలులోనూ, వాలాజీపేటలోని ప్రభుత్వ హైయర్ సెకండరీ స్కూల్ లో జరిగింది.
స్కాలర్‌షిప్‌లతోనే చదువు
రాధాకృష్ణన్ చదువంతా స్కాలర్‌షిప్‌లతోనే జరిగిందంటే ఆయన ఎంతటి ప్రతిభావంతుడో అర్ధమవుతుంది. చదువులో ఎప్పుడూ చురుగ్గా ఉండే రాధాకృష్ణన్ అంటే ఉపాధ్యాయులందరికీ ఎంతో ఇష్టముండేది. రాధాకృష్ణన్‌కు పదహారేళ్ల ప్రాయంలో తన దూరపు బంధువైన శివకాముతో వివాహం జరిగింది. రాధాకృష్ణన్‌కు ఒక కుమారుడితో పాటు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు.
రాధాకృష్ణన్ ఉన్నత చదువులకు వెళ్లడం వారి తండ్రి వీరాస్వామికి సుతరామూ ఇష్టముండేది కాదు. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన తన కుమారుడు ఏదైనా ఆలయంలో పూజారిగా స్థిరపడాలని ఆయన తండ్రి కోరుకునేవారట. అయితే తన కుమారుడు చదువులో చూపిస్తున్న అద్భుత ప్రజ్ఞ చూసి ఆయనను బాగా చదివించాలని నిర్ణయించుకున్నారు.
విద్యావేత్తగా, తత్వవేత్తగా ఘన చరిత్ర
విద్యావేత్తగా, తత్వవేత్తగా విజయవంతమైన ప్రయాణాన్ని సాగించి ఘన చరిత్ర సాధించి చరిత్ర పుటల్లో నిలిచిన రాధాకృష్ణన్ భారత దేశానికి చేసిన సేవ ఎనలేనిది. భారతదేశానికి తొలి ఉపరాష్ట్రపతిగా, రెండవ రాష్ట్రపతిగా ఎనలేని సేవలందించిన రాధాకృష్ణన్ విషయంలో ఆయన తండ్రి మనసు మారకుంటే, రాధాకృష్ణన్ పూజారిగానే స్థిరపడి ఉంటే ఈనాడు భరతజాతి గొప్ప విద్యావేత్త, తత్వవేత్త అయిన ఈ మహోన్నతమైన వ్యక్తిని భారత రాష్ట్రపతిగా చూసి ఉండేవారం కాదేమో! అందుకే అంటారు కదా! "తానొకటి తలిస్తే దైవమొకటి తెలుస్తుందని"
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అమ్మలందరికీ కూడా వందనం చేయాలి. ఎందుకంటే ఒక బిడ్డ ఉపాధ్యాయుని కంటే ముందు తన తల్లి ఒడిలోనే ఓనమాలు నేర్చుకుంటుంది. అందుకే ప్రతి తల్లి ఒక ఉపాధ్యాయురాలే! ప్రతి బిడ్డకు తల్లి ఒడినే తోలి బడి! అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.