Lord Krishna Childhood Story : బమ్మెర పోతనామాత్యుడు రచించిన భాగవతంలోని కథలన్నీ కూడా శ్రీకృష్ణుని లీలల గురించే ఉంటాయి. కృష్ణుడు మనందరికీ గొప్ప దేవుడుగానే తెలుసు. ప్రతి యుగంలో ధర్మ సంస్థాపన కోసం శ్రీ మహావిష్ణువు అవతార స్వీకారం చేస్తాడని తెలిసిందే. అలాగే భీకర రాక్షసులను మట్టుబెట్టడానికి, ధర్మ యుద్ధంలో పాండవులను గెలిపించి ధర్మసంస్థాపన చేయడానికి ద్వాపర యుగంలో శ్రీమహావిష్ణువు శ్రీకృష్ణుడుగా అవతరించాడు.
పుట్టగానే తల్లికి దూరం
మన కష్టాలు తీర్చమని వేడుకునే దేవుళ్లకే కష్టాలు వస్తే ఎలా ఉంటుందో శ్రీకృష్ణుడు తన అవతారం ద్వారా మనకు తెలియజేసాడు. 'పుట్టడమే చెరసాలలో- శిశువుగా ఉండగానే తల్లికి దూరం'. ఈ కష్టం పగ వాళ్ళకు కూడా రాకూడదని కోరుకుంటాం కదా. కానీ శ్రీకృష్ణుడు తన అవతార ప్రయోజనం నెరవేర్చడానికి ధర్మసంస్థాపన చేయడానికి అన్ని కష్టాలను చిరునవ్వుతో అనుభవించాడు.
చిన్న వయసులోనే ఎన్నో ఘనకార్యాలు
దేవకీ గర్భాన జన్మించి యశోదకు ప్రియ పుత్రుడైన కన్నయ్య చిన్నతనంలో అల్లరి పిల్లవాడిగా తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని వివరించాడు. చిన్న వయసులోనే ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నాడు. పాలిచ్చే సాకుతో తనను హతమార్చాలని వచ్చిన పూతనను మట్టుబెట్టాడు. అల్లరి చేస్తున్నాడని తల్లి యశోద రోటికి కట్టేస్తే ఆ రోలుతో పాటు రెండు చెట్ల మధ్యగా వెళ్లి గంధర్వులకు శాప విమోచనం కలిగించాడు. కబంధుని వధించాడు.
వెన్న దొంగగా
కన్నయ్యకు వెన్న అంటే చాలా ఇష్టం. తన ఇంట్లోనే కాకుండా ఇరుగు పొరుగు ఇళ్లల్లో కూడా కన్నయ్య దొంగతనంగా వెన్న తినేసేవాడు. వెన్న దొంగతనం సాకుతో ఆ గోపికల పాపాలను దొంగిలించి వాళ్లను పునీతులను చేసే వాడని గ్రహించలేని ఆ గోపికలు యశోదకు ఫిర్యాదు చేస్తే తాను ఎక్కడకూ వెళ్లలేదని, ఇక్కడే ఉన్నానని నాటకం ఆడేవాడు ఆ జగన్నాటక సూత్రధారి.
చిలిపి కృష్ణుడుగా
గోపికలు స్నానం చేస్తుండగా వారి వస్త్రాలను అపహరించి పొగడ చెట్టు మీద ఏమీ ఎరగనట్లు మురళి గానం చేసే శ్రీకృషుని గోపికలు చెయ్యెత్తి నమస్కరించి తమ వస్త్రాలను తిరిగి ఇమ్మని కోరేవారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన రహస్యమేమిటంటే ఎవరూ కూడా నదీ స్నానం చేసేటప్పుడు నగ్నంగా స్నానం చేయరాదు. గోపికలు కృష్ణుని భర్తగా పొందాలని కోరుకుంటూ కాత్యాయనీ వ్రతాన్ని ఆచరించే సమయంలో యమునా నదిలో వివస్త్రలై స్నానం చేసారు. వారు చేస్తున్న ఈ తప్పును సరిచేసి వారికి కలిగిన దోషం పోగొట్టడానికి కృష్ణుడు వారి వస్త్రాలను అపహరించాడు. ఆనాటి నుంచి గోపికలు వస్త్రాలు లేకుండా స్నానం చేసేవారు కాదు. ఇదే ఇందులో ఇమిడి ఉన్న రహస్యం. ఇలా ఒకటా, రెండా, కృష్ణ తత్వం అర్ధం చేసుకోవాలంటే భాగవతాన్ని పూర్తిగా చదవాల్సిందే. ఇందుకు శుభారంభం కృష్ణాష్టమి పర్వదినం రోజు నుంచే చేద్దాం
జై శ్రీకృష్ణ!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.