Sankatahara Chaturthi Vrat Katha : పూర్వం ఒకానొకప్పుడు స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు వినాయకునికి గొప్ప భక్తుడైన బృఘండి అనే ఋషిని సందర్శించి తిరిగి స్వర్గానికి వెళ్తుండగా ఒక ప్రదేశంలోకి రాగానే విమానం అకస్మాత్తుగా ఆగిపోయింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్యంతో తిలకించ సాగాడు. ఆ ప్రదేశంలో ఇంద్రుని చూసిన మహారాజు ఆనందంతో నమస్కరించారు.
మహారాజు ఇంద్ర విమానం అక్కడ ఆగడానికి గల కారణాలను అడుగగా అప్పుడు ఇంద్రుడు సురసేనుడి రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి యొక్క దృష్టి సోకి విమానం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగిందని చెప్పాడు. అప్పుడు ఆ రాజు మరి ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుందని అడుగగా ఇంద్రుడు ఇవాళ పంచమి, నిన్న చతుర్థి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో, వారి పుణ్యఫలాన్ని తనకిస్తే ఇంద్ర విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పాడు.
అప్పుడు సైనికులంతా చవితి ఉపవాసం చేసిన వారి కోసం రాజ్యమంతా తిరిగినా దురదృష్టవశాత్తు ఎవరూ దొరకలేదు. అదే సమయంలో వారికి గణేశ ధూత ఒకరు ఒక మరణించిన స్త్రీ శరీరాన్ని భుజంపై మోసుకొని గణేశ లోకాని తీసుకుపోవడం కనబడుతుంది. ఆ స్త్రీ తన జీవిత కాలంలో ఎన్నో పాపాలు చేసింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన ఈ స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకెళ్తున్నారని ప్రశ్నించగా, దానికి గణేశ ధూత, నిన్నంతా ఈ స్త్రీ తెలిసో తెలియకో రోజంతా ఉపవాసం వుంది. సంకష్ట చతుర్థి అని తెలియకుండానే ఆమె నిన్న పూర్తిగా అభోజనంగా ఉండి, చంద్రోదయం అయిన తర్వాత భోజనం చేసింది. ఇందు వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసిన ఫలం దక్కుతుంది. ఈమె ఈ రోజు మరణించింది కాబట్టి సంకష్ట గణపతి వ్రతం చేసిన పుణ్యం కారణంగా ఆమెను గణేశ లోకానికి తీసుకెళ్తున్నామని ఆ గణేశ ధూత చెబుతాడు.
అంతట ఆ సైనికులు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని, అలా చేస్తే ఆగిపోయిన ఇంద్ర విమానం తిరిగి బయలుదేరుతుందని అడుగగా, గణేశ ధూత ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి అంగీకరించలేదు. ఆ సమయంలో ఆశ్చర్యకరంగా ఆ స్త్రీ శరీరం నుంచి వచ్చిన గాలి కారణంగా అక్కడ ప్రచండమైన విస్పోటనంతో కూడిన గాలి వీచి ఇంద్ర విమానం బయలుదేరుతుంది. అది చూసి ఆ వ్రత మహత్యమును తలచుకొని అందరూ భక్తితో నమస్కరిస్తారు.
దేవాలయంలో గణపతి వ్రతం
ఇంట్లో నియమ నిష్టలతో ఈ వ్రతాన్ని ఆచరించలేని వారు వినాయకుని ఆలయంలో ప్రతి బహుళ చవితి రోజు జరిగే సంకష్ట గణపతి వ్రత పూజను జరిపించుకుంటే కష్టాలు తొలగి పోతాయి.
చంద్ర దర్శనం-వ్రత సమాప్తం
ఇంట్లో చేసుకున్నా దేవాలయంలో చేసుకున్నా పూజ పూర్తి అయిన తర్వాత తప్పనిసరిగా చంద్ర దర్శనం చేసుకొని శిరస్సున అక్షింతలు వేసుకోవాలి. అప్పుడే ఈ వ్రత ఫలం దక్కుతుంది. చూశారుగా! ఈ సంకష్ట గణపతి వ్రత మహత్యం. తెలిసి కానీ తెలియక కానీ ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశుని లోకంలో కానీ, స్వనంద లోకం లో కానీ శాశ్వత స్థానం పొందుతారని శాస్త్ర వచనం. ఓం శ్రీ గణాధిపతయే నమః
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
Conclusion: