Kasapuram Anjaneya Swamy Temple History : ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద హనుమాన్ ఆలయమైన నెట్టి కంటి ఆంజనేయస్వామి దేవాలయం అనంతపురం జిల్లాలోని గుంతకల్లు పట్టణంలో కసాపురం అనే గ్రామంలో ఉంది. ఈ స్వామిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్ర ప్రజలే కాదు, పక్క రాష్ట్రమైన కర్ణాటకతో పాటుగా దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.
ఆలయ చరిత్ర
కసాపురం నెట్టికంటి ఆలయ చరిత్రను పరిశీలిస్తే సా.శ.1521 ప్రాంతంలో శ్రీ వ్యాసరాయలవారు తుంగభద్ర నది ఒడ్డున ప్రతిరోజూ ధ్యానం చేసేవారంట! ఆయన అలా ధ్యానం చేసేటప్పుడు తాను ధరించిన గంధంతో తన ఎదురుగా ఉన్న ఒక రాయి మీద శ్రీ ఆంజనేయ స్వామి రూపం చిత్రించేవారంట. అలా రాయలవారు చిత్రించిన ప్రతిసారి హనుమంతుడు తన నిజరూపం ధరించి అక్కడి నుంచి వెళ్లిపోయేవాడట. ఇది గమనించిన వ్యాస రాయలవారు హనుమంతుని శక్తిని వేరొక చోటికి వెళ్లనీయకుండా, స్వామి వారి ద్వాదశ నామాల బీజాక్షరాలతో ఒక యంత్రం తయారు చేసి, దానిలో శ్రీ ఆంజనేయ స్వామి వారి నిజరూపాన్ని చిత్రించారట. దాంతో స్వామి ఆ యంత్రంలో బంధిచడం వల్ల అందులో ఉండిపోయారట.
వ్యాసరాయలకు స్వప్న సాక్షాత్కారం
ఇప్పటి కర్నూలుగా పిలవబడుతున్న ప్రాంతంలో చిప్పగిరి మండలంలో ఉన్న శ్రీ భోగేశ్వర స్వామి వారి ఆలయంలో ఒకరోజు వ్యాసరాయలు నిద్రిస్తుండగా ఆంజనేయ స్వామి కలలో వచ్చి "నేను ఫలానా ప్రాంతంలో ఉన్నాను, నాకు గుడి కట్టించు" అని చెప్పాడట. అయితే ఆ ప్రాంతం ఎక్కడుందో తెలపమని వ్యాస రాయలు కోరగా స్వామి వారు ఇలా చెప్పారంట! ఇక్కడ నుంచి దక్షిణం వైపున వెళితే ఒక ఎండిన ఒక వేప చెట్టు కనిపిస్తుందని, ఎప్పుడైతే రాయలవారు ఆ చెట్టుకు సమీపంగా వెళతారో ఆ చెట్టు చిగురిస్తుందని, అక్కడ తవ్వితే తాను ఉంటానని పలికి అదృశ్యమయ్యారంట.
ఒంటి కన్ను ఆంజనేయస్వామి విగ్రహ దర్శనం
వ్యాసరాయలవారు ఎంతో సంతోషించి మరునాడు ఉదయాన్నే లేచి దక్షిణం వైపు ప్రయాణం చేసి చివరకు ఆ ఎండిన వేప చెట్టును కనిపెట్టి ఆ చెట్టు వద్దకు చేరుకోగానే, ఆ చెట్టు చిగురిస్తుంది. అది చూసి ఆశ్చర్యచకితుడైన వ్యాసరాయలు వెంటనే అక్కడ భూమిని తవ్వించగా ఆ తవ్వకాల్లో ఒంటి కన్ను గల ఆంజనేయ స్వామి వారి విగ్రహం కనిపిస్తుంది. రాయలవారు ఆ విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించి, ఆలయాన్ని నిర్మిస్తాడు. అప్పటి నుంచి ఈ ఆలయంలో స్వామిని నెట్టికంటి ఆంజనేయ స్వామిగా ప్రతిష్ఠించి పూజించడం మొదలుపెట్టారు.
స్థల పురాణం
ఆలయ స్థల పురాణం ప్రకారం కన్నడంలో నెట్టె అంటే నేరుగా అని అర్థం. నెట్టికంటి అంటే నేరుగా చూసే కన్ను కలిగిన స్వామి అని అర్థం. ఈ ఆలయంలోని స్వామి వారి కుడివైపు భాగం మాత్రమే మనం దర్శించుకోగలం. అందుకే స్వామి వారి కుడి కన్ను మాత్రమే మనకు కనిపిస్తుంది. అయితే స్వామి వారి ఈ కుడి కన్ను నేరుగా మనల్ని చూస్తున్నట్లు ఉండటం వల్ల స్వామి తననే చూస్తున్నట్లు ప్రతివారికీ అనిపిస్తుంది. అందుకే నేరుగా చూసే స్వామి కనుక నెట్టికంటి ఆంజనేయస్వామి అని అంటారు.
సమస్త గ్రహ పీడలు తొలగించే హనుమ
భక్తుల పాలిట కల్ప తరువుగా, వర ప్రదాతగా పిలవబడే ఈ స్వామిని దర్శించుకోవడం వలన సమస్త భూత, ప్రేత, దుష్ట గ్రహ పీడ తొలగిపోతాయి కాబట్టి ఈ ఆలయం భూత, ప్రేత, దుష్ట గ్రహ పీడ నివారణ క్షేత్రంగా ఖ్యాతికెక్కింది. ఈ హనుమజ్జయంతి రోజు మనం కూడా నెట్టికంటి ఆంజనేయ స్వామిని తరిద్దాం. జై శ్రీరామ్!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.