Dwajarohanam In Tirumala Significance : శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ధ్వజారోహణ ఉత్సవం జరుగనుంది. "న భూతో న భవిష్యతి" అనేలా నిర్వహించే స్వామి వారి బ్రహ్మోత్సవాలకు సకల దేవతా మూర్తులను ఆహ్వానించే కార్యక్రమమే ఈ ధ్వజారోహణ ఉత్సవం శ్రీనివాసుని వాహనం గరుడుడు కాబట్టి, కొత్త వస్త్రం మీద గరుడుని బొమ్మ చిత్రీకరిస్తారు. దీన్ని 'గరుడ ధ్వజ పటం' అంటారు. దీన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు.
సకల దేవతలకు ఆహ్వాన పత్రం
ఉత్సవ మూర్తులైన భోగ శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవిల సమక్షంలో గోధూళి లగ్నమైన మీన లగ్నంలో కొడితాడుకు కట్టి, పైకి ఎగురవేస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలు, అష్ట దిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వ గణాలకు ఆహ్వాన పత్రం.
ముక్కోటి దేవతలు కొండమీదే తొమ్మిది రోజులు!
గరుడ పతాక ఆహ్వానంతో ముక్కోటి దేవతలూ బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులూ కొండమీదే ఉండి, ఉత్సవాలను తిలకించి ఆనందిస్తారని పురాణాలు చెబుతున్నాయి. శ్రీవారి సన్నిధిలో జరుగనున్న ఇలాంటి అరుదైన వేడుక చూడటం పూర్వ జన్మ పుణ్యమని శాస్త్రం చెబుతోంది.
శ్రీనివాసుడు సర్వాంతర్యామి
విశ్వమంతా గరుడుడు వ్యాపించి ఉంటారు. అలాంటి గరుడుని శ్రీనివాసుడు వాహనంగా చేసుకోవడంతో స్వామివారు సర్వాంతర్యామిగా కీర్తినొందారు. ధ్వజపటంపై గరుడునితోపాటు సూర్యచంద్రులకు కూడా స్థానం కల్పించడం ఆగమ సంప్రదాయం. ఈ సందర్భంగా పెసరపప్పు బియ్యంతో చేసిన కట్టు పొంగలి ప్రసాద వినియోగం జరుగుతుంది. ఈ ప్రసాదం స్వీకరించిన వారికి సంతాన ప్రాప్తి, దీర్ఘాయుష్షు, సిరిసంపదలు సమకూరుతాయని విశ్వాసం. ఓం నమో వెంకటేశాయ!
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.