Chandra Dosha Remedies In Telugu : నవగ్రహాల్లో చంద్రుడు మనః కారకుడని అంటారు. జాతకంలో సోమవారానికి అధిపతి అయిన చంద్ర గ్రహం బలహీనంగా ఉంటే మానసిక రుగ్మతలు ఎక్కువగా ఉంటాయి. చంద్రుడు బలహీనంగా ఉంటే కలిగే మానసిక రుగ్మతలు ఇవే.
- మనః స్థిమితం లేకపోవడం
- ఏ పని మీద కుదురు లేకపోవడం
- చెప్పేదానికి చేసేదానికి పొంతన లేకపోవడం
- ప్రతి చిన్న విషయానికి చిన్నబుచ్చుకోవడం
- ఆత్మవిశ్వాసం లోపించడం
- ఆత్మా న్యూనతతో బాధపడటం
- భవిష్యత్తు గురించి ఆందోళన, బెంగతో బాధపడటం
- ఎవరితోనూ కలవకుండా, ఎప్పుడు ఒంటరిగా ఉండాలనుకోవడం
Chandra Dosha Nivarana In Telugu : జాతకంలో చంద్ర గ్రహం బలహీనంగా ఉంటే మధుమేహం (డయాబెటిస్), కిడ్నీ సంబంధిత రోగాలు, డిప్రెషన్, దంతాల సమస్యలు, కామెర్లు, గుండె జబ్బులు వంటివి కూడా వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
చంద్రదోష నివారణకు ఏమి చేయాలి?
జాతకంలో చంద్ర బలం పెరగాలంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రునికి కొన్ని రకాల పరిహారాలు చేయాలనీ జ్యోతిష శాస్త్రంలో సూచించారు. అవేంటంటే?
- గోవు పాలు, గోమూత్రం, గోవు పాలతో చేసిన పెరుగు, గోవు నెయ్యి, మంచి గంధం, స్పటికం ఈ ఆరింటిని నీళ్ళల్లో వేసి ఆ నీటిలో మేలు రకం శంఖంను వేసి, ఆ నీటిని వేడిచేసి ఆ నీళ్లతో స్నానం చేస్తే చంద్ర దోషం పోతుందని పండితులు చెబుతారు.
- వెండి, ముత్యం వంటివి చంద్రునికి ప్రతీకలుగా చెబుతారు. అందుకే చంద్ర దోషంతో బాధ పడుతున్నవారు ముత్యం బిగించిన వెండి ఉంగరాన్ని తయారు చేయించుకుని ఒక సోమవారం నాడు కుడిచేతి చిటికెన వేలుకు ధరించడం మొదలు పెడితే జాతకంలో చంద్ర దోషం పోతుంది. 11 సోమవారాలు పరమ శివునికి ఆవు పాలతో అభిషేకం జరిపిస్తే కూడా చంద్ర దోషం పరిహారమవుతుంది.
- ఒక నిండు పౌర్ణమి రోజు ఒక పళ్లెంలో తెల్లని వస్త్రం ఉంచి దానిపై బియ్యం పోసి, తాంబూలం, దక్షిణ ఉంచి శివాలయంలో అర్చకునికి దానం ఇస్తే చంద్ర గ్రహ దోషం పోతుంది.
- వెండితో చంద్రబింబం తయారు చేయించి సద్బ్రాహ్మణుడికి పౌర్ణమి రోజు దానం చేస్తే చంద్ర గ్రహ దోషం పోతుంది. ఇవేమి చేయలేనివారు 11 సోమవారాలు ఓం నమ శివాయ అని 108 సార్లు జపించి, శివాలయంలో 11 ప్రదక్షిణలు చేసినా చంద్ర గ్రహ దోషం పోతుంది.
భక్తి విశ్వాసాలే ప్రధానం
మనం ఏ పని చేసినా భక్తిశ్రద్ధలతో చేసే పని మీద విశ్వాసంతో చేస్తే సత్వర ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. భక్తి లేని కర్మ శుద్ధ దండగ. కాబట్టి జాతకంలో చంద్ర గ్రహ దోషం ఉంటే ఈ పరిహారాలు పాటించి ప్రశాంతతను పొందుదాం. శుభం భూయాత్!
ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.