Balkampet Yellamma Kalyanam 2024 : తెలుగు పంచాంగం ప్రకారం నాలుగో మాసం ఆషాఢం. ఆషాడం అమ్మవారి ఆరాధనకు విశేషమైనది. ఈ మాసంలో బోనాలు పేరుతో గ్రామ దేవతల ఆలయాలలో జరిగే జాతర చూడటానికి సంవత్సరమంతా భక్తులు వేచి చూస్తారు. ఈ ఏడాది జులై 7వ తేదీ నుంచి ఆషాఢమాసం ప్రారంభం కానుంది. ప్రతి ఏడాది బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం ఆషాడ మాసం మొదటి మంగళవారం రోజున నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఎల్లమ్మ కల్యాణం ఎప్పుడంటే?
హైదరాబాద్‌లోని ప్రసిద్ధ బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయంలో జరిగే అన్ని ఉత్సవాలలోకెల్లా అత్యంత ముఖ్యమైన వార్షిక పండుగ ఎల్లమ్మ కల్యాణం. ఈ ఏడాది అమ్మవారి కల్యాణాన్ని 2024 తేదీ జూలై 9న నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ముందురోజు అంటే జులై 8న ఎదుర్కోలు ఉత్సవం, జులై 9న కల్యాణం, జులై 10న ఘనంగా రధోత్సవం జరుగుతుంది.
ఎల్లమ్మ తల్లి కల్యాణం చూతము రారండి!!
ఆషాఢ మాసంలో బోనాల సందర్భంగా బల్కంపేట ఆలయంలో ఎల్లమ్మ తల్లి కల్యాణం శక్తి మాతను మహాదేవ శివయ్యతో జరిపిస్తారు. ఈ సందర్భంగా తెలంగాణా ప్రభుత్వం వారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈ కళ్యాణం చూసి తీర్థప్రసాదాలు స్వీకరించిన భక్తుల మనోభీష్టాలు నెరవేరుతాయని నమ్మకం. అమ్మవారి కల్యాణం చూసి అక్షింతలు శిరస్సున వేసుకుంటే అవివాహితులకు శ్రీఘ్రంగా వివాహం జరుగుతుందని విశ్వాసం, అంతే కాదు అమ్మవారి కల్యాణం కళ్లారా చూసిన వారికి పలు అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని అంటారు.
బల్కంపేట అమ్మవారి ఆలయ చరిత్ర
అతి ప్రాచీనమైన బల్కంపేట ఆలయంలో అమ్మవారు ఇక్కడ స్వయంభువుగా వెలిశారు. దాదాపు 700 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరం కూడా ఏర్పడకముందు ఇప్పటి బల్కంపేట ప్రాంతమంతా చుట్టూ పొలాలతో ఒక చిన్న గ్రామంగా ఉండేది.
బావిలో బయటపడ్డ ఎల్లమ్మ తల్లి
ఈ ప్రాంతంలో ఒక రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా అమ్మవారి ఆకృతిలో ఉన్న బండరాయి అడ్డొచ్చింది. భక్తితో ఆ విగ్రహాన్ని బావి గట్టుకు చేర్చాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇక ఆ రైతు ఇది తన ఒక్కడితో అయ్యే పని కాదని ఊర్లోకెళ్లి ఊళ్లోకెళ్లి జనాన్ని తీసుకొచ్చాడు. అందరు కలిసి ప్రయత్నించినా కూడా అమ్మవారి విగ్రహాన్ని కదపడం ఎవ్వరి వల్ల కాలేదు.
బావిలోనే పూజలు
బావిలోనే ఉండి పూజలందుకోవాలన్నదే అమ్మవారి అభీష్టమనుకొని ఊరి ప్రజలు ఒక నిశ్చయానికి వచ్చారు. దైవ నిర్ణయాన్ని కాదనలేం కదా అని శివసత్తులు ఇచ్చిన సలహాతో, మూలవిరాట్టును బావి లోపలనే ఉంచి ఒడ్డున నిలబడే పూజలు చేసేవారు. కొంతకాలానికే, రేణుకా ఎల్లమ్మ మహిమలు చుట్టుపక్కల ప్రాంతాలకూ విస్తరించడం వల్ల భక్తులు తండోపతండాలుగా రావడం మొదలు పెట్టారు. ఇక అక్కడ అమ్మవారి కోసం ఓ చిన్న ఆలయం వెలసింది.
దేవాలయ నిర్మాణం
రాజా శివరాజ్ బహద్దూర్ అనే సంస్థానాధీశుడి హయాంలో బెహలూఖాన్ గూడాగా పిలుస్తున్న ఈ ప్రాంతం, తరువాతి కాలంలో బల్కంపేటగా మారిపోయింది. ఎల్లమ్మ తల్లి బల్కంపేట ఎల్లమ్మగా సుప్రసిద్ధురాలైంది. 1919లో ప్రస్తుతం ఉన్న దేవాలయ నిర్మాణం జరిగింది.
శిరస్సున జలధార - మహా తీర్ధం
బల్కంపేట ఆలయంలో అమ్మవారి స్వయంభూ మూర్తి శిరసు భాగం వెనుక నుంచి నిత్యం జలధార ప్రవహిస్తూ ఉంటుంది. ఆ పవిత్ర జలాన్నే భక్తజనం మహా తీర్థంగా స్వీకరిస్తారు. ఆ నీటితో ఇళ్లను శుద్ధిచేసుకుంటే భూతప్రేతపిశాచాది దుష్టశక్తులు పారిపోతాయని భక్తుల విశ్వాసం. నిత్యం స్నానం చేసే నీళ్లల్లో ఈ మహతీర్ధాన్ని కలుపుకొని స్నానం చేస్తే భయంకరమైన చర్మవ్యాధులు కూడా తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.
ఉత్సవాలు
బల్కంపేట ఆలయంలో ఆషాఢమాసం నెలరోజులు బోనాలు ఉత్సవాలు వేడుకలు జరుగుతాయి. ఈ నెల రోజుల్లో ఆదివారాలు, మంగళవారాలు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి. ఎల్లమ్మ తల్లికి బోనాలు చెల్లించి మొక్కులు చెల్లించుకోడానికి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తారు. ఈ నెల రోజులు ఆలయ పరిసర ప్రాంతాలన్నీ జాతర శోభతో కళకళలాడుతూ ఉంటాయి.
బలి మొక్కులు
బల్కంపేట ఆలయంలో బోనాలు జరిగే నెల రోజుల్లో ముఖ్యంగా ఆదివారాల్లో అమ్మవారికి మొక్కుబడులు ఉన్నవారు బలులు ఇచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.
తల్లీబిడ్డా రెండూ ఎల్లమ్మే
బోనాలు జరిగే నెలరోజులు అమ్మవారిని భక్తులు అమ్మవారిని సొంత బిడ్డగా భావించి పొంగళ్లు పెట్టి, ఒడి బియ్యం పోసి, చీర సారెలతో తమ ప్రేమాభిమానాలను చూపిస్తారు. తనను బిడ్డగా భావించే భక్తులను కన్నతల్లిగా అనుగ్రహిస్తుంది ఆ ఎల్లమ్మ తల్లి. పిలిస్తే పలికే చల్లని తల్లి ఎల్లమ్మను ఆషాఢమాసంలో దర్శించుకుందాం. ఆ చల్లని తల్లి అనుగ్రహాన్ని పొందుదాం. జై ఎల్లమ్మ తల్లి!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.