Ganja Gang Attack on RTC Driver in Vijayawada: విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ పై గంజాయి ముఠా దాడి చేసి గాయపరిచింది. విజయవాడ గవర్నర్ పేట డిపో ఒకటికి చెందిన RTC డ్రైవర్ సీహెచ్ రావుపై నిన్న రాత్రి అల్లరి మూకలు దాడి చేశాయి. RTC కార్గో వాహనాన్ని వరంగల్ నుంచి విజయవాడకు తీసుకొస్తుండగా ఇబ్రహీంపట్నం కూడలి దాటాక ఈ దాడి జరిగింది. కార్గో వాహనాన్ని వెంబడించి, కారు అడ్డంపెట్టి మరీ డ్రైవర్ పై రౌడీ మూకలు విచక్షణా రహితంగా దాడి చేశాయి. వాహనంలోకి ప్రవేశించి పదునైన ఆయుధాలతో దుండగులు తలపై పొడిచారు. డ్రైవర్ సీహెచ్ రావు తలకు, చేతులపై తీవ్రంగా గాయాలయ్యాయి. తొలుత విద్యాధరపురంలోని RTC ఆస్పత్రికి డ్రైవర్ రావును తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి తలకు శస్త్రచికిత్స చేశారు. ఇబ్రహీంపట్నం కూడలి వద్ద గంజాయి బ్యాచ్ ఇటీవలే పలువురిపై దాడికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఈ దాడిపై స్పందించిన పలువురు రాష్ట్రంలో మత్తు పదార్థాలు ఎక్కువవ్వడమే దీనికి కారణమని వాపోతున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి, మద్యం విచ్చల విడిగా దొరుకుతున్నాయన్నారు. యువత వీటికి అలవాటు పడి మత్తులో అవాంఛనీయ ఘటనలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఇక్కడే కాకుండా పక్క రాష్ట్రాలకు సైతం మాదక ద్రవ్యాల ఎగుమతులలో ఏపీ ముందంజలో ఉండటం బాధాకరమైన విషయమని ఆందోళన చెందుతున్నారు.
ఇది ఇలాగే కొనసాగితే యువత భవిత నాశనం అవుతుందని ప్రజలు హడలెత్తిపోతున్నారు. అభివృద్దిలో ముందుండాల్సిన రాష్ట్రంలో ఇటువంటి అసంబద్దమైన కార్యకలాపాలకు చెక్ పెట్టాలని ధ్వజమెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ మత్తు పదార్థాలు పెద్ద ఎత్తున బయపడుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఏంటని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. పోలీసులు తనీఖీల్లో కిలోల చొప్పున మత్తు పదార్థాలు పట్టబడుతున్న విషయం విధితమే కాగా మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మన్యం జిల్లాలో గంజాయి కలకలం - రెండు బస్తాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు - ganja in manyam district