YSRCP Victims at TDP Central Office: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కు సమస్యలతో ప్రజలు పోటెత్తారు. అర్హతలు ఉన్నా గత ఐదేళ్లుగా పింఛన్లు దక్కనివారు, వైఎస్సార్సీపీ నేతల భూ కబ్జా బాధితులు, వివిధ తీవ్ర సమస్యలతో సతమతం అవుతున్నవారు అర్జీలు ఇచ్చేందుకు తరలివచ్చారు. మంత్రులు, తెలుగుదేశం కీలక నేతలు వారి నుంచి వినతులు స్వీకరించారు. శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పార్టీ కార్యాలయానికి వచ్చి ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు.
ఎన్టీఆర్ భవన్‌లో మంత్రి గొట్టిపాటి రవి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, అశోక్‌బాబు సమస్యలు విన్నవించుకునేందుకు వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అడ్డగోలు నిబంధనలతో గత ప్రభుత్వం పింఛన్లు తొలగించిందనే ఫిర్యాదులతో పాటు బలవంతపు భూ మార్పిడ్లు, వైఎస్సార్సీపీ నేతల భూ కబ్జాలు, అక్రమ కేసులు వంటి ఫిర్యాదులతో ప్రజలు పెద్ద ఎత్తున వినతుల సమర్పించారు. తెలుగుదేశం శ్రేణులపై నమోదైన అక్రమ కేసులపై వివిధ జిల్లాల ఎస్పీలతో నేరుగా మాట్లాడినట్లు మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు.
'మనస్ఫూర్తిగా పింఛన్ ఇచ్చింది నువ్వే' - మనసులో మాట బయటపెట్టిన సామాన్యుడు - AP Pensioners Voice
తెలుగుదేశం పార్టీకి చెందిన వారిమనే అక్కసుతో వంద శాతం వైకల్యం ఉన్నా తన కుమారుడికి గత ప్రభుత్వం ఐదేళ్లుగా పింఛన్ ఇవ్వకుండా వేధించిందంటూ కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన దివ్యాంగుడి తండ్రి చుండూరు బాబు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడి దగ్గరికి స్వయంగా వెళ్లి పరిశీలించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పింఛన్ మంజూరు దిశగా చర్యలు తీసుకున్నారు.
కుమారుడు చనిపోయాడనే బాధలో తాముంటే తెలుగుదేశం వాళ్లమని మాజీమంత్రి అంబటి రాంబాబు బీమా కూడా రాకుండా చేశారని సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన బాధితురాలు వాపోయారు. మానసిక స్థితి సరిగ్గా లేని తన కుమారుడు సునీల్‌కుమార్‌కు చికిత్స చేయిస్తామని తీసుకెళ్లిన ఓ స్వచ్చంధ సంస్థ ప్రతినిధులు అతడ్ని బలి తీసుకున్నారని విజయవాడకు చెందిన నిర్మలాకుమారి కన్నీరుమున్నీరుగా విలపించారు. వైఎస్సార్సీపీ నేతలు తమ భూమిని కబ్జా చేశారంటూ మరో వ్యక్తి అర్జీ ఇచ్చినట్లు తెలిపారు.
శనివారం ఉదయం 11 గంటల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజలకు, పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండనున్నారు. ప్రజల వద్ద నుంచి వినతిపత్రాలను స్వీకరించనున్నారు.
ఒకటో తేదీనే పింఛన్లు, వేతనాలు ఇవ్వడం సంతృప్తినిచ్చింది: చంద్రబాబు - CM Chandrababu emotional