Macharla and Hindupur YSRCP Councillors to TDP : రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతో పలుచోట్ల వైఎస్సార్సీపీ నేతలు టీడీపీ, జనసేన పడుతున్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఈ మార్పు జరగగా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా హిందూపురం, మాచర్లలో వైఎస్సార్సీపీకీ షాక్ తగిలింది.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజతోపాటు తొమ్మిది మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో హిందూపురం మున్సిపల్ పరిధిలో 38 వార్డుల్లో 30 మంది వైఎస్సార్సీపీ నుండి కౌన్సిలర్లుగా అప్పట్లో విజయం సాధించారు. ఆ పార్టీ విధివిధానాలు నచ్చక తెలుగుదేశం పార్టీలో చేరినట్లు మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ మీడియాకు తెలిపారు.
మరో రెండు రోజుల్లో మరికొంతమంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరే అవకాశం ఉంది. దీంతో చైర్ పర్సన్ పదవి దాదాపుగా టీడీపీ ఖాతాలో చేరినట్లేనని తెలుస్తోంది. టీడీపీ కౌన్సిలర్లు 6 మంది ఉండగా బీజీపీ కౌన్సిలర్ ఒకరు, ఎంఐఎం కౌన్సిలర్ ఒకరు గతంలోనే టీడీపీలో చేరిపోయారు. తాజాగా పదిమంది కౌన్సిలర్లు టీడీపీలో చేరడంతో ఆ పార్టీకి దాదాపుగా మెజార్టీ సభ్యులు బలం ఉంది. ఇది ఇలా ఉండగా మరికొంతమంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు టీడీపీలోకి చేరే ఛాన్స్ ఉండడంతో ఇక చైర్మన్ పదవి లాంచనమే కానుంది.
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మాచర్ల మున్సిపాలిటీకి చెందిన 20 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు తెలుగుదేశంలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుత ఛైర్మన్ ఏసోబు, వైస్ ఛైర్మన్ పోలూరి నరసింహారావు తెలుగుదేశంలో చేరడానికి ముందుకు వచ్చారు. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డితో భేటీ అయ్యి తెలుగుదేశంలో చేరేందుకు సమ్మతి తెలిపారు. ఆదివారం నాడు అధికారికంగా పసుపు కండువా కప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
గత ఎన్నికలలో మాచర్ల మున్సిపాలిటీని వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయినా గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోవడంతో కౌన్సిలర్లు అసంతృప్తిగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మాచర్ల మున్సిపాలిటీని ప్రగతి పథంలో నడిపించాలంటే ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి, కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని నమ్మిన కౌన్సిలర్లు తెలుగుదేశంలో చేరేందుకు అంగీకరించారు.
టీడీపీలోకి వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ- పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన చంద్రబాబు - joinings in tdp