YSRCP Leaders Distribute Gifts to Voters: ఆ నియోజకవర్గంలో ఓ సామాజిక వర్గం వారు టీడీపీకి మద్దతివ్వాలని నిర్ణయించారు. ఇది తెలిసిన వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధి అక్కడ వాలిపోయారు. అప్పటికప్పుడు రూ.10 లక్షల చెక్కు, రూ.3 లక్షలు నగదు ఇచ్చారు. తర్వాత ఓటుకు ఇంతని ఇస్తానని హామీ ఇచ్చారు. ఇతర సామాజిక వర్గానికి భవనాల పేరుతో 4.5 సెంట్లు చొప్పున తన సొంత భూమి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మరోవైపు ఇసుక అక్రమ రవాణా ద్వారా నేటికీ అడ్డంగా సంపాదిస్తున్నారు.
- విజయవాడ సెంట్రల్‌లో కోడ్ రాకముందే భారీగా కుక్కర్లు పంచారు. తాజాగా రూ.10 కోట్ల విలువైన కుక్కర్ల పంపిణీకి సిద్ధమైన స్టిక్కర్లను పోలీసులు పట్టుకున్నారు. కానీ కుక్కర్లు ఎక్కడున్నదీ తేలలేదు. విజయవాడ శివారులో గోదాములలో భారీగా దాచారని ప్రచారం జరుగుతోంది. ఈ స్టిక్కర్లను ఓటర్లకు పంచి దుకాణాలు లేదా గోదాము వద్దకు వెళ్లి తెచ్చుకునే ఏర్పాట్లు చేశారు. ఒక్కో నియోజకవర్గానికి 10-20 వేల స్టిక్కర్లు పంచనున్నారు.
- గన్నవరంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వంశీ గ్రామాల్లో ప్రచారం వేళ మహిళలు హారతులు ఇస్తున్నారు. ఆయన అలా ముందుకు వెళ్లగానే ఓ వ్యక్తి హారతి ఇచ్చిన మహిళలకు రూ.వెయ్యి, రూ.2 వేలు ఇస్తున్నారు. ఎంపిక చేసిన కొన్ని కుటుంబాలకు రూ.5 వేలు, రూ.10 వేలు కవర్లు ఇస్తున్నారు. ముందే ఓట్ల కొనుగోలులో భాగంగా ఒక్కో గ్రామానికి రూ.10-15 లక్షలు పంపిణీ చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఓట్ల కొనుగోలు భారీగా జరుగుతోంది. ముందే తాయిలాలు పంచుతున్నారు. కొన్నిచోట్ల పంపిణీకి సిద్ధం చేస్తున్నారు. గెలుపు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు ఓటుకు రూ.5-10 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. కొన్నిచోట్ల ఇప్పటికే ఎన్నికల సంఘం కళ్లు గప్పి పంపిణీ ప్రారంభించారు. విజయవాడలో పోలీసులకు రూ.10 కోట్లకు పైగా విలువైన కుక్కర్ల స్టిక్కర్లు లభిస్తే విచారణ అతీగతీ లేదు. నగర పోలీసు బాస్ బదిలీ అయినా పోలీసుల తీరు మారలేదనే విమర్శలు వస్తున్నాయి.
వైఎస్సార్సీపీ గుర్తుతో స్టిక్కర్లు సిద్ధం చేసిన వారికి కుక్కర్లు ఎక్కడ ఉంచారో తెలిసే ఉంటుందని అంచనా. గతంలో వాలంటీర్లు, సచివాలయ, పొదుపు సిబ్బందికి సెంట్రల్, పెనమలూరులో కుక్కర్లు పంచారు. ఇప్పటికే అంతటా బొట్టు బిళ్లలు, చీరలు పంపిణీ చేశారు.
జాబితాలు సిద్ధం: మైలవరం బరిలో వైఎస్సార్సీపీ తరఫున తిరుపతిరావు ఉన్నారు. అక్కడ ఆర్థిక మూలాలు అంతగా లేవని కడప నుంచి బృందాలను దించారు. మొత్తం 70 మంది యువకులు మైలవరంలో మకాం వేసి ఏ గ్రామానికి ఎంత ఇవ్వాలనే లెక్కలతో జాబితాలు సిద్ధం చేశారు. దీంతో ఇక్కడ వైఎస్సార్సీపీ ద్వితీయ శ్రేణి అలక వహించి వసంతతో వెళ్లిపోయారు. తమకు బిల్లులు రాలేదని అసంతృప్తితో ఉండగా వైఎస్సార్సీపీ నేత అయోధ్య రామిరెడ్డి ఆధ్వర్యంలో వారి ప్రసన్నానికి పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది.
విజయవాడ సెంట్రల్‌లో వెలంపల్లి పశ్చిమ నుంచి అనుచరులను తన వెంటే తెచ్చుకున్నారు. తన సామాజిక వర్గ నాయకులతో పంపిణీకి సిద్ధమయ్యారు. కార్పొరేటర్లకు ఖర్చుల కింద రూ.10-15 లక్షలు ఇస్తున్నట్లు నాయకులే చెబుతున్నారు. తూర్పులో ఇప్పటికే ద్వితీయ శ్రేణిని కొనేయగా ఇంటింటికీ మిఠాయి పొట్లాల పేరుతో తాయిలాలు ఇస్తున్నారు. పదిమందికి కలిపి యూపీఐ ద్వారా చెల్లిస్తున్నారని సమాచారం. నందిగామలో సామాజిక సంక్షేమ సంఘాల పేరుతో భారీగా తాయిలాలు ఇస్తున్నారు. కోడ్ ఉన్నా సామాజిక భవనాలకు రిజిస్ట్రేషన్లు, చెక్కులు, నగదు ఇస్తున్నా పరిశీలకులు దృష్టి పెట్టలేదన్న విమర్శ ఉంది.
బొట్టు బిళ్లల ప్యాకెట్లు: బందరు, గుడివాడ, పెనమలూరు, గన్నవరం, విజయవాడ సెంట్రల్, జగ్గయ్యపేట, నందిగామ, మైలవరంలను వైఎస్సార్సీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తాము సంపాదించిన అవినీతి సొమ్ము వెదజల్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గెలుపు అవకాశాలు సన్నగిల్లడంతో పోల్ మేనేజ్‌మెంట్ అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
- బందరులో పేర్ని కిట్టును ఎలాగైనా గెలిపించే లక్ష్యంతో అడ్డదారులు తొక్కుతున్నారు. నకిలీ పట్టాల పంపిణీ వ్యూహం బెడిసి కొట్టింది. ఇక్కడ తాయిలాలు భారీగా ఇస్తున్నారు. సీనియర్ నాయకులు ప్రచారానికి దూరంగా ఉన్నారు.
- గుడివాడలో కొడాలి నాని సానుభూతి కోసం వెంపర్లాడుతున్నారు. ఇదే చివరి పోటీ అని చెబుతున్నారు. ఓ సామాజిక వర్గం ప్రచారానికి దూరంగా ఉంది. ప్రతి ఎన్నికల్లో తన మిత్రుడిని అడ్డంపెట్టుకుని ఆ వర్గం ఓట్లు సంపాదించేవారు. ప్రస్తుతం ఆ వర్గం దూరంగా ఉంది. దీంతో ఓట్ల బేరమాడుతూ భారీగా పంపిణీకి సిద్ధమయ్యారు.
- పెనమలూరులో కోడ్‌కు ముందే తాయిలాల పంపిణీ మొదలెట్టగా ప్రస్తుతం సొంత పార్టీ నాయకుల కొనుగోలుపై దృష్టి పెట్టారు. తమకు భారీగా ఖర్చు అయిందని సొంత పార్టీవారే జాబితాలు ఇస్తుంటే తండ్రీ కొడుకులు కళ్లు తేలేస్తున్నారు. మరోవైపు అక్రమ ఇసుక ద్వారా రోజుకు రూ.50 లక్షలు సంపాదిస్తున్న ఇలాకాలో అంతే మొత్తం ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నారు.
- గన్నవరంలోనూ కొందరి జాబితా సిద్ధం చేసి నగదు ఇచ్చే ఏర్పాట్లు చేసుకున్నారు.